- సెప్టెంబర్ 12, 15వ తేదీల్లో ఈ వేలం
ఖాళీ ఖజనాను నింపుకునేందుకు విశాఖపట్నం మెట్రోపాలిటన్ రీజియన్ డెవలప్ మెంట్ అథార్టీ (వీఎంఆర్డీఏ) కసరత్తు ప్రారంభించింది. విశాఖపట్నం, అనకాపల్లి జిల్లాల్లో ఉన్న భూములను విక్రయించడం ద్వారా రూ.300 కోట్లు సమీకరించాలని భావిస్తోంది. విశాఖను కార్యనిర్వాహక రాజధానిగా ప్రకటించనున్నారనే ప్రచారంతోపాటు అదానీ డేటా పార్క్, భోగాపురం ఎయిర్ పోర్టు వంటి ప్రాజెక్టులు వస్తున్న నేపథ్యంలో వివిధ ప్రయోజనాల కోసం ప్లాట్లను ఈ వేలం వేయాలని వీఎంఆర్డీఏ నిర్ణయించింది. ప్రదేశం, వాస్తు, వాణిజ్య ప్రాముఖ్యత ఆధారంగా గజానికి రూ.8వేల నుంచి రూ.40వేల అప్ సెట్ ధర నిర్ధారించింది. రెండు జిల్లాల్లో 24 ఎకరాల్లో విస్తరించి ఉన్న భూములను విక్రయించాలని వీఎంఆర్డీఏ సూత్రప్రాయంగా నిర్ణయించింది.
తుమ్మపాలలో 3.96 ఎకరాలు, మధురవాడలో 0.19, 1.75, 0.64, 0.83 ఎకరాలు, కాపులుప్పాడలో 1.66 ఎకరాలు, చిట్టివలసలో 3.55 ఎకరాలు, బోనంగిలో 4.87 ఎకరాలు విక్రయానికి ఉన్నట్టు గుర్తించారు. ఈ ప్లాట్లన్నీ వీఎంఆర్డీఏ నిర్ణయించిన కనీస ధరకు అమ్ముడైతే దాదాపు రూ.175 కోట్ల ఆదాయం వస్తుంది. తొలి దశ వేలాన్ని సెప్టెంబర్ 12న, రెండో దశ వేలాన్ని సెప్టెంబర్ 15న నిర్వహించాలని నిర్ణయించినట్టు అధికార వర్గాలు వెల్లడించాయి. కొనుగోలుదారులు అప్ సెట్ ధర ను పేర్కొనడం ద్వారా వేలంలో పాల్గొనవచ్చు. బిడ్ కనీస పెరుగుదల చదరపు గజానికి రూ.100 ఉంటుంది. వేలంలో ప్లాట్ దక్కించుకున్న బిడ్డర్.. 72 గంటల్లోపు బిడ్ చేసిన మొత్తంలో 10 శాతం చెల్లించాలి. ఏదైనా బిడ్ ను తిరస్కరించే లేదా ఆమోదించే హక్కు వీఎంఆర్డీఏకి ఉంటుంది.