- చంద్రుడి మీద చక్కటి భూమి కావాలా?
- వీనస్, యురేనస్ పై కూడా ప్లాట్లు
- భూమ్మీద కంటే ఎంతో తక్కువ రేటు
హైదరాబాద్ సామాన్యుడు అంగుళం భూమి కూడా కొనలేని దుస్థితి ఏర్పడింది. అలాంటివారి కోసమే ఇతర గ్రహాల్లో రియల్ ఎస్టేట్ వెంచర్లు వెలిశాయండోయ్. సామాన్యుడికే కాదు.. పేదలకు కూడా అందుబాటు ధరల్లో అక్కడి ప్లాట్ల అమ్మకాలు కొనసాగుతున్నాయి. ఇంతకీ ఎక్కడో చెప్పమంటారా? అదేనండీ మన చంద్రుడితోపాటు అంగారకుడు, శుక్రుడు, యురేనస్ గ్రహాలపై స్థలాలు అమ్మేస్తున్నారు. ఇక్కడ యూడీఎస్, ప్రీలాంచుల్లో కొనడం కంటే అక్కడ కొనడమెంతో చౌక. మనం కాకపోయినా, భవిష్యత్తులో మన పిల్లలైనా అక్కడికి వెళ్లొచ్చట. ఇంతకంటే బంఫర్ ఆఫర్ ఎక్కడైనా ఉంటుందా చెప్పండి?
డెన్నిస్ హోప్ అనే వ్యక్తి చంద్రుడికి తానే యజమాని అని చెప్పి, అక్కడి స్థలాలు అమ్ముతున్నానంటూ ప్రకటించాడు. అక్కడ ఎకరం ఎంతో తెలుసా? కేవలం 19.99 డాలర్లు. అంటే జస్ట్ రూ.1500 పెడితే చంద్రుడిపై ఎకరం స్థలాన్ని సొంతం చేసుకోవచ్చు. మీరు స్థలం కొనగానే లీగల్ డాక్యుమెంటు కూడా ఆయన పంపిస్తారు. ఇందుకోసం లూనార్ ట్యాక్స్, షిప్పింగ్ ఛార్జీలతో కలిపి అదనంగా మరో రూ.1200 చెల్లిస్తే సరిపోతుంది. చంద్రుడిపై ఎకరానికి ఇంత పెద్ద మొత్తం పెట్టలేమంటారా? అయితే మీకోసం మరో ఆఫర్ కూడా ఉంది.
బహుశా ఇతర గ్రహాల్లో ప్లాట్లు, అపార్టుమెంట్లను అమ్మవచ్చనే విషయం మన యూడీఎస్, ప్రీలాంచ్ బిల్డర్లకు తెలియదనుకుంటా! లేకపోతే, అక్కడ కూడా ప్లాట్లు, ఫ్లాట్లు అమ్మేవారే. ఇంకేముంది.. ఇప్పుడు తెలిసింది కదా.. ఇక కొందరు అమ్మేందుకు సిద్ధమవుతారని అంటారా? మన యూడీఎస్, ప్రీలాంచ్ స్కామ్‌స్టర్లు అక్రమంగా సొమ్ము సంపాదించేందుకు ఏం చేయడానికైనా సిద్ధమవుతారనే విషయాన్ని మర్చిపోవద్దు.