Categories: TOP STORIES

వరంగల్ రియల్ మార్కెట్ ఢమాల్

  • ప్రభుత్వ హైప్ నిజమేనని నమ్మి
    అడ్డంగా బుక్కయిన డెవలపర్లు!
  • ఆరు నెలల్నుంచి నో సేల్స్..
  • ఫ్లాట్లు అమ్ముకోలేక నానా తంటాలు
  • ఎన్నికల దాకా పరిస్థితి మారదు!

కర్ణుడి చావుకి లక్ష కారణాలు అన్నట్లు.. వరంగల్ రియల్ మార్కెట్ ఢమాల్ అనడానికి అనేక కారణాలున్నాయని చెప్పొచ్చు. ఇందులో ప్రధానంగా ప్రభుత్వ హైప్ ఒక కారణంగా కాగా.. అది నిజమేనని నమ్మి హైఎండ్ నిర్మాణాల్ని డెవలపర్లు ఆరంభించడం మరో కారణం. అంతేకాకుండా, అధిక ధరలకు ఫ్లాట్లు, విల్లాల్ని అమ్మే ప్రచారం నిర్వహించడం ఇంకో కారణమని చెప్పొచ్చు. తెలంగాణ ఆవిర్భావం నుంచి.. కొత్తగా ఉద్యోగ, ఉపాధి అవకాశాల్లేని నగరంలో.. రియల్ రంగం ఎలా అభివృద్ధి చెందుతుందని భావించారో ఈ డెవలపర్లకే తెలియాలి. అధిక ధరకు భూముల్ని కొనుగోలు చేసి.. హైఎండ్ ప్రాజెక్టుల్ని ఆరంభించి.. తమ తప్పును కప్పి పుచ్చుకోవడానికి.. ఆర్భాటపు ప్రచారాన్ని నిర్వహిస్తూ.. హైప్ క్రియేట్ చేస్తూ.. నానా తంటాలు పడుతున్నారు.

స్మార్ట్ సిటీ, మామునూరు విమానాశ్రయం, ఐటీ పార్కులు, టెక్స్టైల్ పార్కులు వంటి ప్రభుత్వ ప్రకటనలు నిజమేనని నమ్మి.. అధిక శాతం మంది బిల్డ ర్లు.. వరంగల్లో ఏదో అద్భుతం జరగనున్నదని ఆశించారు. వీరి ప్రకటనల వల్ల స్థానిక స్థల యజమానులు భూముల ధరల్ని కోట్లకు పెంచేశారు. మార్కెట్లో నెలకొన్న హైప్ కారణంగా.. ఇతర రంగాల్నుంచి రియల్ రంగంలోకి అడుగుపెట్టిన వారి సంఖ్య తక్కువేం కాదు. మొత్తానికి, గత కొంతకాలం నుంచి హైదరాబాద్ తరహాలో వరంగల్ రియల్ రంగంలోనూ స్థబ్ధత నెలకొన్నది. ఆశించినంత స్థాయిలో అమ్మకాలు జరగకపోయినా, కొందరు డెవలపర్లు మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శించడం విడ్డూరమనిపిస్తోంది. మరికొందరేమో అధిక వడ్డీలకు తెచ్చిన అప్పుల్ని ఎలా తీర్చాలో తెలియక సతమతం అవుతున్నారు.

ఇవి ఏర్పాటయ్యేనా?

జాడలేని రూ. 2800 కోట్ల స్మార్ట్ సిటీ అభివృద్ధి.. ఏమైందో తెలియని హెరిటేజ్ సిటీ.. ఉత్తమాటేగా మిగిలిన మామూనూరు విమానాశ్రయం, అడ్రెస్ లేని ఐటీ పార్కులు.. ఎండమావుగా మారిన మెగా టెక్స్టైల్ పార్కు, కలగా మిగిలిన వరంగల్ ఎడ్యుకేషన్ హబ్, మెడికల్ హబ్.. అమలు కానీ వరంగల్ హైద్రాబాద్ ఇండస్ట్రియల్ కారిడోర్.. కాగితాలకే పరిమితమైన హడ్కో 2028 అభివృద్ది ప్రణాళికలు.. వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ కు విడుదల కానీ రూ. ఐదు వేల కోట్లు.. ఇలా చెప్పకుంటూ వరంగల్లో ఏ ఒక్కటి పూర్తి కాలేదు. ఫలితంగా, వరంగల్లో కొత్తగా ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పెరగలేదు. ఫలితంగా, రియల్ రంగం పెద్దగా అభివృద్ధి చెందలేదు. ప్రతిఏటా పడే వర్షాలకు నగరం జలమయం కావడం, డ్రైనేజీ వ్యవస్థ అందుబాటులోకి రాకపోవడం వల్ల పరిస్థితులు మెరుగుపడలేదు. అయినప్పటికీ, సందిట్లో సడేమియాలా కొందరు రియల్టర్లు అభివృద్ధి మాయను చూపెట్టి భూముల రేట్లను పెంచేశారు. దీంతో, వరంగల్ వంటి పట్టణంలో సామాన్యులు సొంతిల్లు కొనుక్కోలేని దుస్థితి నెలకొంది. నిన్నటివరకూ పది వేల లోపు గజం ఉన్న స్థలం నేడు యాభై వేలు దాటేయడంతో.. అంతంత కొనుగోలు శక్తి మధ్యతరగతి ప్రజలకు లేకుండా పోయింది. ఈ విషయం తెలియకో.. తెలిసో.. బిల్డర్లు మాత్రం ఫ్లాట్లు, విల్లాల రేట్లను ఇష్టం వచ్చినట్లు పెంచేశారు. ఇప్పుడేమో అమ్ముకోలేక నానాతంటాలు పడుతున్నారు.

పొలిటికల్ మాఫియా వర్సెస్ రియల్ ఎస్టేట్!

హైదరాబాద్లో రాజకీయ నాయకులు రియల్ రంగంలో నేరుగా జోక్యం చేసుకోరు. ఒకరిద్దరు మంత్రులు, ఎమ్మెల్యేలు రియల్ రంగంలో ఉన్నప్పటికీ.. పొలిటికల్ మాఫియా పెద్దగా కనిపించదు. అందుకే, దేశంలోని ఏ బిల్డర్ అయినా ఇక్కడికొచ్చి ప్రాజెక్టులను అభివృద్ధి చేసే పరిస్థితి నగరంలో ఉన్నది. కానీ, వరంగల్లో అలాంటి పరిస్థితుల్లేవు. ఇక్కడ రియల్ ఎస్టేట్ రంగం మరియు పొలిటికల్ మాఫియా అంటకాగుతున్నారు. రాజకీయ అండ చూసుకుని కుంటలు మరియు చెరువులు, నాలాలపై అక్రమంగా వెంచర్లు వేసే రియల్టర్లు పెరిగారు. రెవెన్యూ భూరికార్డులు, మున్సిపల్, రిజిస్ట్రేషన్, కుడా వంటి విభాగాల్లో ఎక్కడ్లేని అవినీతి నెలకొంది. మొత్తానికి, పుట్టగొడుగుల్లా అక్రమ లేఅవుట్లు పుట్టకొస్తున్నాయి. తెలిసో తెలియకో వీటిలో కొన్నవారంతా నానా ఇబ్బందులు పడుతున్నారు.

అభివృద్ధి మాయ!

వరంగల్లో అద్భుతం జరుగుతుందనే అసత్య ప్రచారాన్ని నిజమేనని నమ్మి.. అధిక ధరకు భూముల్ని కొనుగోలు చేసి అపార్టుమెంట్లను నిర్మించిన డెవలపర్లు ప్రస్తుతం ఇబ్బంది పడుతున్నారు. ములుగు రోడ్డులో ఒక బిల్డర్ అపార్టుమెంట్ని కట్టి ఆరు నెలలైనా అమ్ముడు కాని దుస్ధితి నెలకొంది. కొందరు డెవలపర్లు వరంగల్ మార్కెట్ను అతిగా ఊహించి.. హైదరాబాద్ తరహాలో హైఎండ్ లగ్జరీ విల్లాల్ని ఆరంభించారు. వాస్తవిక పరిస్థితుల్ని అంచనా వేయకుండా ప్రాజెక్టుల్ని ఆరంభించిన డెవలపర్లలో కొందరు అడ్డంగా బుక్కయ్యారు. ఆరు నెలల్నుంచి అమ్మకాల్లేకపోవడంతో ఏం చేయాలో అర్థం కాకుండా తలపట్టుకుంటున్నారు. ఇక్కడ ఫ్లాట్లు, విల్లాలు కొనడం కంటే హైదరాబాద్లోని ఘట్కేసర్, రాంపల్లి, కీసర, మేడ్చల్ వంటి ప్రాంతాల్లో వ్యక్తిగత గృహాల్ని కట్టుకుని హాయిగా నివసించొచ్చనే భావన చాలామంది కొనుగోలుదారుల్లో నెలకొంది. అందుకే, అనేకమంది వరంగల్ నుంచి హైదరాబాద్కు తరలిపోతున్నారు తప్ప వరంగల్లో ఫ్లాట్లు, వ్యక్తిగత గృహాల్ని కొనడానికి ముందుకు రాకపోవడం దారుణమైన విషయం. కాబట్టి, ఈ పరిస్థితి వచ్చే ఎన్నికలు పూర్తయ్యే వరకూ ఇలాగే నెలకొంటుందని నిపుణులు అంటున్నారు.

This website uses cookies.