బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని మేడిపల్లి మండలంలో గల 336 ఎకరాల అసైన్డ్ భూములను లాండ్ పూలింగ్ స్కీం కింద తీసుకొని ప్రభుత్వం నిర్మించనున్న ఇంటిగ్రేటెడ్ టౌన్ షిప్ లో ఒక్కో ఎకరానికి 500 గజాల చొప్పున అందచేయాలని ఈ 336 ఎకరాల అసైన్డ్ భూములు పొందిన 61 కుటుంబాల ప్రతినిధి బృందం శుక్రవారం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ ను కోరాయి.
మేడిపల్లి మండలంలోని సర్వే నెంబర్ 63/2, 63/25 లలో గల 336 ఎకరాల భూమిని వ్యవసాయానికి గాను ఒక్కో దళిత కుటుంబానికి 5 ఎకరాల 18 గుంటలను 1959 అక్టోబర్ 24 న అప్పటి ప్రభుత్వం 61 కుటుంబాలకు కేటాయించింది. అయితే, ప్రస్తుతం బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ గా అప్-గ్రేడ్ అయి జనాభా పెరిగిందని సి.ఎస్ కు అందచేసిన విజ్ఞాపన పత్రంలో తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన లాండ్ పూలింగ్ కు తమకు కేటాయించిన 336 ఎకరాల భూములను అందిస్తామని తెలిపారు.
అయితే, ప్రభుత్వం నిర్మించబోయే ఇంటిగ్రేటెడ్ టౌన్ షిప్ లో ఈ భూములు అందించినందుకుగాను, తమ కుటుంబాలకు ఒక్కొక్క ఎకరానికి గాను 500 గజాల చొప్పున ప్లాట్ లను కేటాయించాలని విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ఏకగ్రీవంగా తీర్మానం చేసిన విజ్ఞాపన పత్రాన్ని సి.ఎస్ సోమేశ్ కుమార్ కు అందచేశారు. రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి సి.హెచ్. మల్లారెడ్డి నేతృత్వంలో ఈ అసైన్డ్ భూముల కుటుంబాల ప్రతినిధిబృందం సి.ఎస్ కు నేడు సాయంత్రం విజ్ఞాపన పత్రాన్ని అందచేశాయి.
సి.ఎస్ ను కలసిన వారిలో దళిత నాయకులు చినింగల్ల ఎల్లయ్య, మీసాల కృష్ణ, చీరాల నర్సింహా, మీసాల యాదగిరి, రాపోలు శంకరయ్య, నారాయణ, కామంగుల కుమార్, మాజీ జెడ్పిటీసీ సంజీవ రెడ్డి, కార్పొరేటర్ చీరాల నర్సింహా తదితరులున్నారు.
This website uses cookies.