ఫ్లెక్సిబుల్ వర్క్ స్పేస్ ప్రొవైడర్ వీ వర్క్ దివాలా తీసింది. పీకల్లోతు అప్పుల్లో కూరుకుపోయామని పేర్కొంటూ ఈ మేరకు దివాలా పిటిషన్ దాఖలు చేసింది. అమెరికాకు చెందిన అత్యంత విలువైన ఈ స్టార్టప్ ఉత్తాన పతనాలకు కారణాలేంటో తెలుసుకుందామా?
ఆఫీస్ మార్కెట్ లో విప్లవం తీసుకురావాలనే లక్ష్యంలో 2010లో వీ వర్క్ ఏర్పాటైంది. ఆడం న్యూమన్, అతడి భార్య రెబెకా న్యూమన్, మిగ్యుల్ మెక్ లేవీతో కలిసి ఈ కంపెనీని స్థాపించారు. పెద్ద పెద్ద ప్రాపర్టీలను దీర్ఘకాలం లీజుకు తీసుకుని, పలు చిన్న సంస్థలు, వ్యాపారాలకు ఆఫీస్ స్పేస్ అద్దెకు ఇవ్వడమే దీని ఉద్దేశం. ఈ కంపెనీ విలువ ఏకంగా 47 బిలియన్ అమెరికా డాలర్లకు చేరుకుంది. ఈ క్రమంలో ఆదాయాన్ని పెంచడమే కాకుండా భారీ నష్టాలనూ మూటగట్టుకుంది. అయితే, మరింత వృద్ధి చెందాలనే లక్ష్యంతో న్యూమన్ తీసుకున్న నిర్ణయాలు కంపెనీ పట్టాలు తప్పడానికి కారణమైంది. దివాలా పిటిషన్ దాఖలుకు వారం రోజుల ముందు కూడా న్యూమన్ ఓ ప్రకటన చేశారు. సరైన వ్యూహం, సరైన బృందంతో వీ వర్క్ పునర్ వ్యవస్థీకరణ విజయవంతంగా జరుగుతుందని పేర్కొన్నారు. 2019లో వీ వర్క్ పబ్లిక్ ఆఫర్ కంపెనీ ప్రస్థానాన్ని మలుపు తిప్పింది. అప్పటివరకు ఉన్న కంపెనీ విలువ 2021 నాటికి 10 బిలియన్ డాలర్లకు పడిపోయింది. మరోవైపు ఖరీదైన లీజులు, పెద్ద సంఖ్యలో కార్పొరేట్ క్లయింట్లు తమ ఒప్పందాలను రద్దు చేసుకోవడంతో మరింత దీన స్థితిలోకి వీ వర్క్ వెళ్లిపోయింది. కరోనా తర్వాత ప్రజలు ఇంటి నుంచే పని చేయడం ప్రారంభించడం మరింత దెబ్బ తీసింది. వీటి నుంచి బయట పడటానికి చేసిన ప్రయత్నాలేవీ ఫలించలేదు. ఈ ఏడాది జూన్ చివరి నాటికి దీర్ఘకాలిక లీజు ఒప్పందాల మొత్తం 13.3 బిలియన్ డాలర్లుగా ఉంది. ఇది కంపెనీకి మోయలేని భారంగా పరిణమించింది. దీంతో దివాలా పిటిషన్ వేయక తప్పలేదు.