కోవిడ్ తర్వాత రియల్ రంగం కొద్ది కాలం ఉత్థాన పతనాలు చూసింది. వర్క్ ఫ్రం హోం పెరగడంతో అద్దె, యాజమాన్యం రెండింటికీ డిమాండ్ బాగా తగ్గుముఖం పట్టింది. అయితే, తర్వాత మళ్లీ పరిస్థితులు కుదుటపడటంతో రియల్ రంగం తిరిగి పుంజుకుని దూసుకెళ్తోంది. పైగా అందుబాటు ధరల ఇళ్ల కంటే లగ్జరీ ఇళ్లకు డిమాండ్ పెరుగుతోంది. ఆఫీసులు యథాతథంగా పనిచేస్తుండటంతో వర్క్ ఫోర్స్ అంతా మళ్లీ ఇళ్ల నుంచి నగరాలకు వచ్చేశారు. దీంతో అటు కార్యాలయాలకు, ఇటు ఇళ్లకు డిమాండ్ పెరిగింది. అయితే, కరోనా తర్వాత విశాలమైన, విలాసవంతమైన ఇళ్లకే ఎక్కువ మంది ప్రాధాన్యత ఇస్తున్నారు. 2022లో దేశంలోని ఏడు ప్రధాన నగరాల్లో అమ్ముడైన మొత్తం ఇళ్లలో 18 శాతం ఇళ్లు లగ్జరీ కేటగిరీవేనని అనరాక్ అధ్యయనం వెల్లడించింది. 2019లో ఇది కేవలం 7 శాతం మాత్రమేనని పేర్కొంది. మరి లగ్జరీ ఇళ్లు కొనుగోలు చేయాలనుకుంటున్నవారు కోరుకునేదేమిటి అనే అంశంపైనా అధ్యయనం జరిగింది.
స్వచ్ఛమైన గాలి, మంచి యాక్సెసబిలిటీ, అత్యత్తమ శ్రేణి సుదపాయాలు, చక్కని వ్యూ, అదిరిపోయే ల్యాండ్ స్కేపింగ్ వంటి అంశాలనే ఎక్కువ మంది కోరుకుంటున్నారు. ప్రపంచవ్యాప్తంగా లగ్జరీ సెగ్మెంట్లో వినియోగదారుల ప్రాధాన్యతలు, సాంకేతికతే కీలక పాత్ర పోషించాయి. మనదేశంలో కూడా పరిస్థితి ఇందుకు భిన్నంగా ఏమీ లేదు. 2023 మొదటి త్రైమాసికంలో లగ్జరీ రెసిడెన్షియల్ అమ్మకాలు ఏకంగా 151 శాతం పెరిగాయి. ఢిల్లీలో అయితే ఇది 216 శాతంగా ఉంది. ఇక 800 శాతం వృద్ధితో హైదరాబాద్ అగ్రస్థానంలో నిలవడం విశేషం. లగ్జరీ ఇళ్ల వైపు మొగ్గు చూపేవారు పర్యావరణ అంశాలను కూడా నిశితంగా పరిశీలిస్తున్నారు. గ్రీన్ రూఫ్ లు, సమర్థవంతమైన ఇంధన ఆదా వ్యవస్థలు, స్మార్ట్ హోమ్ ఆటోమేషన్ వంటి సౌకర్యాలు కోరుకుంటున్నారు. భద్రత, గోప్యత కూడా అల్ట్రా లగ్జరీ ఇళ్ల కొనుగోలుదారుల ప్రాధాన్యతల్లో టాప్ లో ఉన్నాయి. అధిక నికర విలువ కలిగిన వ్యక్తులు తమ భద్రతకు అధిక ప్రాధాన్యత ఇవ్వడంతోపాటు తమ ఇళ్లు, పరిసరాల్లో డిజిటల్ భద్రతను కూడా ఆకాంక్షిస్తున్నారు. దీనివల్ల గేటెట్ కమ్యూనీలు, అత్యాధునిక భద్రతా వ్యవస్థలు, విశ్వసనీయమైన డిజిటల్ మౌలిక సదుపాయాలకు డిమాండ్ బాగా పెరిగింది. దీంతో డెవలపర్లు కూడా భద్రతా వ్యవస్థల్లో భారీగా పెట్టుబడి పెడుతున్నారు.
సాంకేతికత గురించి చెప్పాలంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ని భద్రతా వ్యవస్థలు, డిజిటల్ మౌలిక సదుపాయాలతో అనుసంధానించడం వల్ల నివాసాల డిమాండ్ మరింత పెరుగుతోంది. సాధారణంగా హై ఎండ్ ఇళ్లు ఏఐ ఆధారిత వ్యక్తిగత సహయకులు, అధునాతన భద్రతా వ్యవస్థలు, నివాసితుల వ్యక్తిగత అభిరుచులు, ప్రాధాన్యతలకు అనుగుణంగా సమర్థవంతమైన పరిష్కారాలు కలిగి ఉంటాయి. అలాగే చాలామంది స్విమింగ్ పూల్, క్లబ్ హౌస్, జిమ్, ప్రైవేటు స్పా, హోమ్ థియేటర్ వంటి సౌకర్యాలు కావాలనుకుంటున్నారు.