చెరువులు, కుంటలు, కాలువలు ఉన్న ప్రాంతంలో పూర్తి స్థాయిలో ఆ చెరువు నీటి సామర్థ్యాన్ని అంచనా వేసి ఎఫ్‌టీఎల్ ను మున్సిపల్ అధికారులు, నీటి పారుదల శాఖ నిర్ణయిస్తారు. వర్షకాలంలో పూర్తిగా నీరు ఉంటే ఏ ఏరియా వరకు నీరు నిల్వ ఉంటుందో చెప్పేదే ఫుల్ ట్యాంక్ లెవల్. కొన్ని దశాబ్దాలుగా వచ్చిన వరద ఆధారంగా ఎఫ్ టీ ఎల్ ను నిర్ధారిస్తారు.
అక్కడ అన్నీ కాలాల్లో నీరు ఉండదు. దీంతో చాలా మంది వాటిని ఆక్రమించి నిర్మాణాలు చేస్తున్నారు. నీరు లేకున్నా ఆ ప్రాంతం ఎఫ్‌టీఎల్ పరిధిలోకి వస్తోందని తెలిసినా.. ఎవరేం చేస్తారులే అని అనేక మంది అపార్టుమెంట్లను, వ్యక్తిగత గృహాల్ని కట్టుకున్నారు.
ఎఫ్‌టీఎల్ పరిధిలో పట్టా భూములున్నా సరే.. అందులో వ్యవసాయం మాత్రమే చేసుకోవాలి. నిర్మాణాలు చేయడానికి అక్కడ అనుమతులివ్వరు. ఒకవేళ చెరువుకు సమీపంలో నిర్మాణాన్ని చేపడితే.. నిబంధనల ప్రకారం నీటిపారుదల శాఖ నుంచి నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ తీసుకోవాలి. అంతేకాదు సంబంధిత మున్సిపల్, రెవెన్యూ అధికారి, జీహెచ్ఎంసీ నుంచి క్లియరెన్సు సర్టిఫికేట్ తీసుకోవాలి.
ఇవేవి లేకుండా ఎఫ్‌టీఎల్ లో నిర్మాణం చేపడితే.. ఆ నిర్మాణాన్ని కూలగొట్టి, ఆ స్థలాన్ని స్వాధీనం చేసుకునే హక్కు ప్రభుత్వానికి ఉంటుంది. ఈ సందర్భంలో నిర్మాణాన్ని నిర్మించిన వారు కోర్టును ఆశ్రయించినా పెద్దగా ఫలితం ఉండదని అధికారులు చెబుతున్నారు.
This website uses cookies.