- మూడు వారాల్లో నివేదిక
ఇవ్వాలని సుప్రీంకోర్టు ఆదేశం
246 హౌసింగ్ డెవలప్ మెంట్, రీ డెవలప్ మెంట్ ప్రాజెక్టులకు సంబంధించి బిల్డర్లు అప్పగించిన సర్ ప్లస్ ఏరియా వివరాలతోపాటు 2022 ఆగస్టు వరకు బిల్డర్లపై నమోదైన ఎఫ్ఐఆర్ ల ప్రస్తుత పరిస్థితి ఏమిటి అనేది తెలియజేయాలని మహారాష్ట్ర హౌసింగ్ అండ్ ఏరియా డెవలప్ మెంట్ అథారిటీ (ఎంహెచ్ఏడీఏ)ను సుప్రీంకోర్టు ఆదేశించింది.
ఈ వివరాలతో మూడు వారాల్లో నివేదిక సమర్పించాలని స్పష్టం చేసింది. మిగులు ప్రాంతాన్ని అప్పగించకుండా ఉంచే విషయంలో బిల్డర్లతో కుమ్మక్కయ్యారనే ఆరోపణలపై ఆర్థిక నేరాల విభాగం తన అధికారులపై నమోదు చేసిన ఎఫ్ఐఆర్ లను సవాల్ చేస్తూ ఎంహెచ్ఏడీఏ దాఖలు చేసిన పిటిషన్ పై సుప్రీంకోర్టు ఈ మేరకు ఆదేశాలిచ్చింది. మొత్తం బిల్డర్లలో ఇప్పటివరకు కేవలం 133 మంది మాత్రమే మిగులు ప్రాంతాన్ని తిరిగి అప్పగించారు. కమలాకర్ ఆర్ షెనాయ్ అనే వ్యక్త ఆర్టీఐ కింద సమాచారం సేకరించారు.
2014 మార్చి 14 వరకు ఎంహెచ్ఏడీఏ 1728 ప్రాజెక్టుల రీడెవలప్ మెంట్ కు అనుమతి ఇచ్చిందని, అందులో 379 మంది డెవలపర్లు 1,37,332 చదరపు మీటర్ల నిర్మాణ ప్రాంతాన్ని ఎంహెచ్ఏడీఏకు తిరిగి అప్పగించలేదని పేర్కొంటూ హైకోర్టును ఆశ్రయించారు. విచారణలో 133 మంది డెవలపర్లు మాత్రమే 32,233 చదరపు మీటర్ల ప్రాంతాన్ని తిరిగి అప్పగించినట్టు కోర్టు గుర్తించింది. ఈ విషయంలో కేవలం కొద్దిమందిపై మాత్రమే ఎఫ్ఐఆర్ నమోదైనట్లు తెలుసుకుంది. దాదాపు రూ.40వేల కోట్లు విలువచేసే 36 లక్షల చదరపు మీటర్ల ప్రాంతాన్ని డెవలపర్లు విక్రయించినట్లు గుర్తించి, ఆ మేరకు అధికారులపై కేసులు నమోదు చేయాలని ఆదేశించింది.