Categories: VAASTU

లేఅవుట్‌లో ఎలాంటి ప్లాటు కొనాలి?

హైద‌రాబాద్‌లో సొంతిల్లు కొనుక్కోవాల‌ని చాలామంది క‌ల‌లు కంటారు. ఇప్పుడిప్పుడే కాక‌పోయినా, క‌నీసం భ‌విష్య‌త్తులో అభివృద్ధి చెందే ప్రాంతాల్లోనైనా.. రెండు వంద‌ల గ‌జాల ప్లాటు అయినా‌ కొనాల‌ని అనుకుంటారు. ఈ క్ర‌మంలో అధిక శాతం మంది వారాంతాల్లో.. హెచ్ఎండీఏ, డీటీసీపీ లేఅవుట్ల‌ను ప్ర‌త్య‌క్షంగా చూసేందుకు వెంచ‌ర్ల‌లోకి అడుగుపెడుతుంటారు. అయితే, ఏజెంటేమో ఎక్కువ‌గా అమ్ముడుకాని, ఎవ‌రూ ఎక్కువ‌గా కొన‌డానికి ఆస‌క్తి చూపించ‌ని ప్లాట్లు మాత్ర‌మే అమ్మ‌కానికి ఉన్నాయ‌ని చెబుతూ తిక‌మ‌క పెడుతుంటారు. దీంతో, ఏయే దిక్కులో ఉన్న ప్లాటును ఎంచుకోవాలో కొనుగోలుదారుల‌కు అర్థం కాదు. ఈ వాస్త‌విక ఇబ్బందిని అధిగ‌మించాలంటే మీరు క‌చ్చితంగా ఈ క‌థ‌నం చ‌ద‌వాల్సిందే. లేవుట్‌లో ప్ర‌వేశించిన త‌ర్వాత ఏయే దిక్కున ఉండే ప్లాటును ఎంచుకోవాలో మీరే తెలుసుకోవ‌చ్చు.

  • ప్లాటు కొనడానికి వెళ్లిన‌ప్పుడు, ముందుగా ఆయా వెంచ‌ర్ లోకి ప్ర‌వేశించే ప్ర‌ధాన మార్గాన్ని గ‌మ‌నించాలి. మొత్తం వెంచ‌ర్‌కి తూర్పు, ఈశాన్యం, ఉత్త‌రం, ప‌శ్చిమ వాయువ్యం, ద‌క్షిణ ఆగ్నేయంలో ప్ర‌వేశ మార్గం ఉండ‌టం మంచిది.
  • లేఅవుటు బ‌య‌ట‌ చుట్టుప‌క్క‌ల ప్రాంతాల విష‌యానికి వ‌స్తే.. ద‌క్షిణంలో కానీ ప‌డ‌మ‌ర‌లో కానీ ప‌ల్ల‌ము, గుంట‌లు, చెరువులు, పాడుబ‌డ్డ ప్ర‌దేశాలు, శ్మ‌శానాలు వంటివి లేకుండా చూసుకోవాలి. ఇవి ఉన్న చోట వెంచ‌ర్‌లో ప్లాటు కొంటే, కుటుంబ స‌మ‌స్య‌లు, ఆర్థిక ఇబ్బందులు, క‌ల‌హాలు, కోర్టు కేసులు, జీవితంలో ఎదుగుద‌ల లేకుండా ఉంటుంది. కాబ‌ట్టి, వీటిని కొన‌క‌పోవ‌డ‌మే అన్ని విధాల శ్రేయ‌స్క‌రం.
  • లేఅవుటు మొత్తానికి ద‌క్షిణం వైపు కానీ ప‌డ‌మట వైపు కానీ స‌హ‌జ‌సిద్ధంగా ఏర్ప‌డిన ఎత్తైన గుట్ట‌లు, కొండ‌లు వంటివి ఉండ‌టం మేలు.
  • లేఅవుట్ మొత్తం చ‌ద‌నుగా కానీ ద‌క్షిణం నుంచి ఉత్త‌రం వైపున‌కు, ప‌డ‌మ‌ట నుంచి తూర్పున‌కు ప‌ల్లంగా ఉండ‌టం శ్రేయ‌స్క‌రం. ఇలాంటి వాటిలో ప్లాటును ఎంచుకుంటే ఆర్థిక ఇబ్బందులు ఎదురు కావు. శారీరిక‌, ఆరోగ్య‌, ఆర్థిక స‌మ‌స్య‌లు వంటివి ఉండ‌వు.

వెంచ‌ర్‌లో ఎలాంటి ప్లాటు?

  • తూర్పు ప్ర‌వేశ‌మార్గంలో ఉన్న లేఅవుట్లోకి ప్ర‌వేశించిన‌వారు.. మొత్తం లేఅవుట్‌లోని ఎడ‌మ‌వైపు భాగంలో ప్లాట్ల‌ను ఎంచుకోవాలి. ఇల్లు క‌ట్టిన త‌ర్వాత ఇంట్లో నుంచి బ‌య‌టికి వెళ్లేందుకు తూర్పు వైపున‌కు కానీ ఉత్త‌రం వైపున‌కు కానీ ఈశాన్యం వైపు కానీ న‌డ‌క ఏర్ప‌డుతుంది. దీని వ‌ల్ల మంచి ఆలోచ‌న‌లు వ‌స్తాయి. ఉన్న‌త విద్యావంతులుగా ఎదుగుతారు. ప్ర‌భుత్వసంస్థల్లో ఉన్న‌త స్థానానికి చేరుకుంటారు. మంచి రాజ‌కీయ జీవితం ఏర్ప‌డుతుంది. కుటుంబం మ‌ధ్య స‌త్సంబంధాలు దృఢంగా ఉంటాయి. మొత్తానికి, జీవితం సాఫీగా సాగుతుంది. ఎలాంటి ఒడిదొడుకులు ఏర్ప‌డ‌టానికి ఆస్కార‌ముండ‌దు.
  • ఉత్త‌ర ప్ర‌వేశ‌మార్గం ఉన్న‌టువంటి లేఅవుట్‌లో ద‌క్షిణం వైపులో తూర్పు లేదా ఉత్త‌రం అభిముఖంగా ఉన్న ప్లాట్ల‌ను ఎంచుకోవ‌డం ఉత్త‌మం.
  • ప‌శ్చిమ వాయువ్యంలో ప్ర‌వేశ‌మార్గం ఉన్న‌ట్ల‌యితే, మొత్తం లేఅవుటుకి కుడివైపు అన‌గా, ద‌క్షిణ భాగాన ఉన్న తూర్పు, ఉత్త‌రం, ప‌డ‌మ‌ర అభిముఖంగా ఉన్న ప్లాట్ల‌ను ఎంచుకోవాలి.
  • ద‌క్షిణాగ్నేయంలో ప్ర‌వేశ‌మార్గం ఉన్న‌ట్ల‌యితే.. లేఅవుటుకి ఎడ‌మ‌వైపు భాగంలో ఏ దిక్కున ప్లాటు అయినా మంచిదే.
  • మొత్తం లేఅవుటులో ఎటువైపు అయినా స‌రే, ద‌క్షిణ అభిముఖం ఉన్న ప్లాటును తీసుకోవాల్సి వ‌స్తే.. ఆ ప్లాట్లులో ఇల్లు క‌ట్టిన త‌ర్వాత బ‌య‌టికొచ్చే మార్గం తూర్పు వైపున‌కు న‌డ‌క సాగించి ర‌హ‌దారిలో క‌లిసేలా ఉండ‌టం ఉత్త‌మం. ఉద‌యాన్నే లేచిన త‌ర్వాత ద‌క్షిణం, ప‌డ‌మ‌ర వైపు న‌డ‌వటం మంచిది కాదు. ఒక‌వేళ ఇలా చేస్తే, జీవితంలో అన్నిర‌కాల అన‌ర్థాలు ఎదుర‌వుతాయి.
  • తూర్పు, ఉత్త‌రం అభిముఖంగా ఉన్న ప్లాటును ఎంచుకోవ‌డం వ‌ల్ల ఉద‌యాన్నే సూర్య‌ర‌శ్మీ నేరుగా ఇంట్లోకి ప్ర‌స‌రిస్తుంది. దీని వ‌ల్ల ఆయా ఇంట్లో నివ‌సించే వారికి చ‌ర్మ రోగాలు, దీర్ఘ‌కాలిక రోగాలు వంటివి ద‌రిచేర‌వు. అందులో నివ‌సించేవారు ఆయురారోగ్యాలు, అష్ట ఐశ్వ‌ర్యాల‌తో జీవిస్తారు. పిల్ల‌లు చ‌క్క‌గా చ‌దువులు, న‌డ‌వ‌డిక అల‌వ‌డే అవ‌కాశం ఉంటుంది.

– కుమార స్వామి సంగం,
వాస్తు శాస్త్ర నిపుణులు.

వాస్తుప‌రంగా మీకు ఎలాంటి సందేహాలున్నా.. స‌మ‌స్య‌లున్నా.. మాకు రాయండి. మీకు మేం స‌ల‌హాల‌ను అంద‌జేస్తాం. మా మెయిల్ ఐడీ: regpaper21@gmail.com లేదా 8501956999 నెంబరుకు కాల్ చేయండి

Share
Published by
REAL ESTATE GURU

This website uses cookies.