ఎన్నారైలు భారత్ లో రియల్ ఎస్టేట్ ప్రాపర్టీ కొనాలంటే ఒకప్పుడు చాలా క్లిష్టంగా ఉండేది. అయితే, గత కొన్నేళ్లుగా నిర్దిష్టమైన చట్టపరమైన సంస్కరణలు తేవడంతో ఇది చాలా సాఫీగా సాగిపోయే ప్రక్రియగా మారింది. ఫెమా చట్టం ప్రకారం దేశానికి వెలుపల 182 రోజుల కంటే ఎక్కువ నివసించే భారతీయులను ఎన్నారైలు గా పేర్కొంటారు. అలాంటి ఎన్నారైలు భారత్ లో ప్రాపర్టీ కొంటే ఆ లావాదేవీలను రిజర్వ్ బ్యాంకు నియంత్రిస్తుంది. ఆ లావాదేవీలన్నీ ఫెమా పరిధిలోకి వస్తాయి. ఈ నేపథ్యంలో రిజర్వ్ బ్యాంకు ఈ విషయంలో కొన్ని వెసులుబాట్లు తీసుకొచ్చింది. మన దేశంలో వ్యవసాయ భూమి, తోటలు, ఫామ్ హౌస్ లు కొనుగోలు చేయడానికి ఎన్నారైలకు అనుమతించింది. అయితే, ఇల్లు లేదా కమర్షియల్ ప్రాపర్టీని కొనుగోలు చేయడానికి ఎన్నారైలకు ఎలాంటి ఆంక్షలూ వర్తించవు. ఎన్నారైలు భారత్ లో ప్రాపర్టీ కొనుగోలు చేసే విషయంలో ఉన్న నియమ నిబంధనలు చూద్దామా..
2013 కంపెనీల చట్టం ప్రకారం.. భారత్ లోని నివాసి మరో ఎన్నారై లేదా బంధువు అయిన ఓవర్సీస్ సిటిజన్ ఆఫ్ ఇండియా (ఓసీఐ) నుంచి బహుమతి ద్వారా భారత్ లోని స్తిరాస్థిని పొందడం సాధ్యమవుతుంది.
ఓ ఎన్నారై భారతదేశంలోని స్థిరాస్థిని దేశం వెలుపల నివసించే వ్యక్తి నుంచి (విదేశీ మారకపు చట్టంలోని నిబంధనల ప్రకారం సంపాదించిన వ్యక్తులు) లేదా భారతదేశంలో నివసించే వ్యక్తి నుంచి వారసత్వంగా పొందవచ్చు.
భారతదేశం వెలుపల నివసించే వ్యక్తి ఎన్నారై లేదా ఓసీఐ కాకపోయినా అతడు లేదా ఆమె ఎన్నారై జీవిత భాగస్వామితో కలిసి ఓ స్తిరాస్థిని (వ్యవసాయ భూమి లేదా ఫామ్ హౌస్ లేదా ప్లాంటేషన్ ఆస్తి కాకుండా) సంపాదించవచ్చు. అందుకు భారతదేశం వెలుపల ఏదైనా ప్రదేశం నుంచి ఇన్ వర్డ్ రెమిటెన్స్ ద్వారా బ్యాంకింగ్ మార్గాల ద్వారా భారత్ లో స్వీకరించిన నిధులను లేదా ఫెమా నిబంధనలు, ఆర్బీఐ నిబంధనలకు అనుగుణంగా నిర్వహించే ఏదైనా నాన్ రెసిడెంట్ ఖాతాలో ఉన్న నిధులు వినియోగించాలి.
స్థిరాస్తి బదిలీకి ట్రావెలర్ చెక్, విదేశీ కరెన్సీ నోట్లు లేదా ఇతరత్రా మోడ్ ద్వారా చెలింపును అంగీకరించరు.
భారత్ లో స్థిరాస్తిని పొందేందుకు అధీకృత భారతీయ బ్యాంకులోని ఎన్నారై ఖాతా ద్వారా భారతీయ కరెన్సీలోనే లావాదేవీలు నిర్వహించి. తప్పనిసరిగా ఎన్నారైకి నాన్ రెసిడెంట్ ఆర్డినరీ ఖాతా, నాన్ రెసిడెంట్ ఎక్స్ టర్నల్ లేదా ఫారిన్ కరెన్సీ నాన్ రెసిడెంట్ ఖాతా ఉండాలి.
భారతదేశంలో ఆస్తి కొనుగోలు కోసం ఎన్నారైలు గృహ రుణాలు తీసుకోవడానికి ఆర్బీఐ అనుమతిస్తుంది. ఆ ఈఎంఐలను సాధారణ బ్యాంకింగ్ మార్గాల ద్వారా మీ విదేశీ బ్యాంకు ఖాతా నంచి డబ్బు పంపడం ద్వారా, మీ ఎన్నార్ ఈ, ఎన్నార్వో, ఎఫ్ ఎన్నార్ ఖాతా నుంచి పోస్ట్ డేటెడ్ చెక్ లు లేదా ఎలక్ట్రానిక్ క్లియరెన్స్ సర్వీస్ జారీ చేయడం లేదా అద్దె ఆదాయం నుంచి చెల్లించొచ్చు.
భారతదేశంలో అనేక రాష్ట్రాల్లో స్థిరాస్తికి సంబంధించిన లావాదేవీలను చేపట్టడానికి పవర్ ఆఫ్ అటార్నీ రిజిస్ట్రేషన్ తప్పనిసరి. పవర్ ఆఫ్ అటార్నీ అనేది ఆస్తి కొనుగోలు లేదా విక్రయానికి సంబంధించిన పత్రాల రిజిస్ట్రేషన్, ఎగ్జిక్యూషన్ కు హాజరు కావడానికి ఎన్నారైలు తమ తరఫున మరో వ్యక్తికి అధికారం ఇచ్చే చట్టబద్ధమైన పత్రం.
ఇక నిర్మాణంలో ఉన్న ఆస్తులు కొనుగోలు చేయాలంటే.. సదరు ఆస్తి రెరాలో నమోదై ఉండాలి. అలాగే ఆ ప్రాజెక్టు రుణాల కోసం జాతీయ బ్యాంకులు ముందస్తుగా ఆమోదించి ఉండాలి.