కింగ్ జాన్సన్ కొయ్యడ : కొంగరకలాన్‌లో ఫ్యాక్స్ కాన్ సంస్థ ఏర్పాటు అవుతోందని.. లక్ష మందికి ఉద్యోగాలు లభిస్తాయని.. ఇంకేముంది రియల్ రంగానికి ఎక్కడ్లేని గిరాకీ పెరుగుతుందనే ప్రచారం ఊపందుకుంది. మరి, ఇందులో ఎంత శాతం వాస్తవం ఉంది? అసలీ సంస్థ ప్రత్యేకతలేంటి? ఎప్పుడు ఆరంభమైంది? మన దేశంలోనే ప్రప్రథమంగా తెలంగాణలో అడుగుపెడుతుందా? లేక ఇదివరకే ఇతర రాష్ట్రాల్లో పరిశ్రమలను ఏర్పాటు చేసిందా? అయితే, అక్కడ వాస్తవ పరిస్థితులు ఎలా ఉన్నాయి? ఫాక్స్‌కాన్ సంస్థ రాకతో నిజంగానే రియల్ రంగానికి ఊపొస్తుందా?
ఫాక్స్ కాన్ పరిశ్రమలో విస్తృతమైన కార్మికుల దుర్వినియోగం మరియు అక్రమ ఓవర్‌టైమ్‌లతో కూడిన లేబర్ క్యాంపులుగా మారాయని మెయిన్ ల్యాండ్ చైనాలోని 20 విశ్వవిద్యాలయాలు సంయుక్తంగా రూపొందించిన నివేదికలో పేర్కొన్నాయి. అక్కడి ఫ్యాక్టరీ కార్మికులను సెక్యూరిటీ గార్డులు కొడుతూ పట్టుబట్టారని నివేదికలు వెలువడ్డాయి. పనివేళలు సరిగ్గా ఉండవనే ఆరోపణలూ ఈ సంస్థ మీద ఉన్నాయి.
తెలంగాణ కంటే ముందే చెన్నైలో ఫాక్స్‌కాన్ సంస్థ శ్రీ పెరంబుదూర్ ఫ్యాక్టరీని ఏర్పాటు చేసింది. 2021 డిసెంబరు 15న.. సంస్థ అందించే ఆహారం తిని 256 మంది కార్మికులు డయేరియా బారిన పడ్డారు. అందులో 159 మంది కార్మికులు ఆస్పత్రి పాలయ్యారు. దీనిపై సంస్థ ఎలాంటి సమాచారం వెలువరించలేదు. అయితే ఇద్దరు కార్మికులు మరణించారనే వార్త వాట్సప్పుల్లో చక్కర్లు కొట్టింది. దీంతో, డిసెంబరు 17న వర్కర్స్ నివసించే డార్మిటరీల్లో కార్మికులు కూర్చోనే నిరసనలు జరిపారు. అదే రోజు రాత్రి 10 గంటలకు, ఫ్యాక్టరీకి చెందిన వందలాది మంది మహిళా కార్మికులు చెన్నై-బెంగళూరు జాతీయ రహదారిపై నిరసనలు చేపట్టారు. ఫలితంగా 67 మంది మహిళా నిరసనకారుల్ని పోలీసులు అరెస్టు చేశారు. తర్వాత తమిళనాడు ప్రభుత్వం కార్మికుల పరిస్థితిని సమీక్షించింది. డిసెంబరు 22న ఫుడ్ సేఫ్టీ డిపార్ట్‌మెంట్ డార్మిటరీలోని వంటగదిలో ఎలుకలు మరియు డ్రైనేజీ సరిగా లేకపోవడంతో సీజ్ చేసింది. కార్మికులకు అందించిన గదులు కిక్కిరిసిపోయాయి, వారు నేలపై పడుకుంటున్నారని, కొంతమందికి నీటి సరఫరాతో మరుగుదొడ్లు కూడా లేవని గుర్తించింది. అయితే, అవసరమైన దిద్దుబాటు చర్యలు తీసుకున్నామని.. జనవరి 2022లో ఆపిల్, తమిళనాడు ప్రభుత్వానికి హామీ ఇచ్చిన తర్వాత, ఫాక్స్‌కాన్ తన ఫ్యాక్టరీని తిరిగి ప్రారంభించింది. ఇప్పుడీ సంస్థ తెలంగాణ రాష్ట్రం అడుగుపెడుతుంది కాబట్టి.. ప్రతి అంశాన్ని పక్కాగా చర్చించి.. ఇందులో పని చేసేవారికి ఎలాంటి ఇబ్బంది రాకుండా ముందస్తు జాగ్రత్తల్ని తీసుకోవాలి. సంస్థ ప్రతినిధులతో పక్కాగా చర్చించి కార్మికుల పని వేళలు, నివాసయోగ్యమైన ప్రాంతాల్ని అభివృద్ధి చేయాలి.
ఫాక్స్‌కాన్ సంస్థ వస్తే.. రాత్రికి రాత్రే కొంగరకలాన్‌లో అద్భుతం జరుగుతుందని.. ఆ కంపెనీ వేలాది మందికి ఉపాధి అవకాశాల్ని అందజేస్తుందని.. ఫలితంగా రియల్ రంగానికి ఊపొస్తుందనే ప్రచారాన్ని గుడ్డిగా నమ్మకండి. ఫాక్స్‌కాన్ ఎలక్ట్రానిక్ పరికరాల్ని ఉత్పత్తి చేసే కంపెనీ మాత్రమేనని గుర్తుంచుకోండి. ప్రధానంగా ఫోన్లను తయారు చేసే పరిశ్రమ అని మర్చిపోవద్దు. ఈ సంస్థ రావడం వల్ల స్థానికులు కార్మికులుగా పని చేయాల్సి ఉంటుంది తప్ప.. ఐటీ కంపెనీ తరహా ఉద్యోగాలు పెద్దగా ఉండవు. ఇందులో పని చేసే కార్మికులకు వచ్చే జీతభత్యాల వల్ల అక్కడి చుట్టుపక్కల ప్రాంతాల్లో ప్లాట్లు తెగ కొనేస్తారనే ప్రచారాన్ని నమ్మొద్దు. కాకపోతే, పని లేనివారికి పని దొరుకుతుంది. ఠంచనుగా జీతం వస్తుంది. ప్లాట్లు కొనగలిగే స్థాయికి ఆయా కార్మికుల జీతభత్యాలుంటాయా? లేవా? అనే అంశంపై ప్రభుత్వమే స్పష్టతనివ్వాలి.
This website uses cookies.