- ఎస్సార్డీపీ లేదా స్లిప్ రోడ్డుగా చేయాలి
- కోకాపేట్ నుంచి మణికొండ
మీదుగా షేక్ పేట్ దాకా - 5వ రేడియల్ రోడ్డుగా అభివృద్ధి
- ఇరవై ఏళ్ల క్రితమే ప్రతిపాదన
- భూసేకరణ అక్కర్లేదు
- టీడీఆర్ అవసరం లేదు
- ఆ రోడ్డు సులువుగా అభివృద్ధి
- లక్షలాది మందికి నరకం నుంచి విముక్తి
- కోకాపేట్ నుంచి మెహదీపట్నం రోడ్డుపై
గణనీయంగా తగ్గే ఒత్తిడిz
ఆ రోడ్డును అభివృద్ధి చేయడానికి స్థల సేకరణ జరపక్కర్లేదు. టీడీఆర్‌లను మంజూరు చేయక్కర్లేదు. లక్షలాది మందికి ట్రాఫిక్ గండం తప్పుతుంది. కోకాపేట్- ఖాజాగూడ-మెహదీపట్నం ప్రధాన మార్గం మీద ఒత్తిడి గణనీయంగా తగ్గుతుంది. జలమండలి వృథా ఖర్చూ తగ్గిపోతుంది. ప్రజల ప్రాణాపయానికి ఎలాంటి ముప్పూ ఏర్పడదు. మరి, ఇన్నిన్ని ప్రయోజనాలు ఉన్నప్పటికీ.. ప్రభుత్వ అధికారులు ఎందుకు ఆ రహదారిని అభివృద్ధి చేయట్లేదు? స్లిప్ రోడ్డుగానైనా.. ఎస్సార్డీపీ కింద అయినా ఈ కీలక రహదారిని ఎందుకు వేయట్లేదు? అసలు ఎందుకీ దుస్థితి.. ఏమిటీ దౌర్భాగ్యం.. ప్రజలు ఇంకెన్నాళ్లూ పడాలీ తిప్పలు?
ఔటర్ రింగ్ రోడ్డును ఘనంగా అభివృద్ధి చేశామని గొప్పలు చెప్పుకుంటున్న ప్రభుత్వం.. ఒక్కసారి సాయంత్రం పూట నానక్ రాంగూడ చౌరస్తా నుంచి నార్సింగి జంక్షన్ రోడ్డులో ప్రయాణిస్తే నరకమేమిటో అర్థమవుతుంది. ఉదయం, సాయంత్రం ఈ మార్గంలో నిత్య ట్రాఫిక్ రద్దీతో కిటకిటలాడుతోంది. చేతులు కాలాక ఆకులు పట్టుకున్నట్లు అక్కడక్కడా ఏళ్ల తరబడి ఫ్లై ఓవర్లు వేస్తున్నారే తప్ప.. తెలివిగా ఆలోచించి ప్రత్యామ్నాయ రోడ్లను అభివృద్ధి చేయడంపై దృష్టి సారించట్లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఉదాహరణకు కోకాపేట్ (నార్సింగి) నుంచి మణికొండ పైపు లైన్ రోడ్డు మీదుగా షేక్ పేట్ మార్గంలో రేడియల్ రోడ్డను అభివృద్ధి చేయాలని నిర్ణయించారు. జనాభా పెరుగుదలను ముందే ఊహించిన అప్పటి ప్రణాళికా అధికారులు.. 2001లోనే 120 అడుగుల రహదారి వేయాలని ప్రతిపాదించారు. మాస్టర్ ప్లాన్‌లో కూడా పొందుపరిచారు. ఔటర్ రింగ్ రోడ్డుకు అనుసంధానం చేస్తూ 5వ నెంబర్ రేడియల్ రోడ్డు వేయాలని కూడా నిర్ణయించారు. అదేంటో కానీ, ఇప్పటివరకూ ఈ ఫోర్ లేన్ రహదారి పనులు ఆరంభమే కాలేదు. ఆరు కిలోమీటర్ల ఈ రహదారిని నార్సింగి జంక్షన్ కు అనుసంధానం చేస్తే పాత ముంబై హైవే మీద ఒత్తిడి తగ్గుతుంది. మెహదీపట్నం ఫైనాన్షియల్ డిస్ట్రిక్టు వెళ్లేవారు.. నానక్‌రాంగూడ రోడ్డు బదులు ఈ రహదారి మీద పయనించేందుకు ఆస్కారం ఉంటుంది. స్థానికులు అటు శంషాబాద్ వెళ్లాలన్నా.. జూబ్లీహిల్స్ వెళ్లాలన్నా.. సులువుగా రాకపోకల్ని సాగించొచ్చు. కానీ, అదేంటో కానీ ఎస్సార్డీపీలో కానీ స్లిప్ రోడ్డుల్లో కానీ ఈ రహదారికి స్థానం కల్పించట్లేదు. ప్రతిరోజు వేలాది వాహనాలు ఈ మార్గంలో పయనిస్తూ నిత్యం నరకం చూపెడుతున్నాయి. అయినా, జీహెచ్ఎంసీ అధికారులు మాత్రం ఈ రహదారిని అభివృద్ధి చేయడంపై దృష్టి సారించట్లేదని మణికొండ మాజీ ఎంపీటీసీ రామకృష్ణారెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు.
ఇదే కారణమా?
ఈ రహదారిలో కొంత దూరం దాకా.. నిజాం నవాబు కట్టించిన వాటర్ ఫీడర్ ఛానెల్ ఉంది. ప్రస్తుతం దీని ద్వారా మంచినీరు సరఫరా కావట్లేదు. ఒకవేళ వాడేందుకు ప్రయత్నించినా ఫలితం ఉండదు. కారణం.. ఈ పైపులైనులోకి ఇప్పటికే మురుగునీరు వచ్చి చేరింది. పైగా, పాడైన ఈ ఫీడర్ ఛానెల్ కోసం కోట్ల రూపాయలను వృథాగా ఖర్చు చేస్తున్నారు. దీన్ని మీద ఫెన్సింగ్ వేసి మొక్కలను నాటారు. ఫలితంగా, స్థానికులు అక్కడే వ్యర్థాలన్నీ పారవేస్తున్నారు. పశువులు, పందులకు ఇదో అడ్డాగా మారింది. అంతేకాదు, ఈ ఫీడర్ ఛానెల్ దురాక్రమణకు గురౌతుందని ఆల్ కాలనీస్ సంక్షేమ సంఘం అధ్యక్షుడు సీతారామరాజు తెలిపారు. ఇటీవల హైదరాబాద్‌లో స్లిప్ రోడ్లను అభివృద్ధి చేసినట్లుగానే ఈ రహదారిని అభివృద్ధి చేయాలని విన్నవిస్తున్నారు. 200- 300 మీటర్ల మేరకు గల ఫీడర్ ఛానెల్ ప్రస్తుతం నిరుపయోగకరంగా.. మురికికూపంగా మారిందన్నారు.