అక్రమ లేఅవుట్లను క్రమబద్దీకరించేందుకు ప్రభుత్వం అమల్లోకి తెచ్చిన ఎల్ ఆర్ ఎస్ స్కీముపై కోర్టులో కేసు పెండింగులో ఉంది. ఈ క్రమంలో మున్సిపాలిటీలు, నగర కార్పొరేషన్ల పరిధిలో వచ్చిన ఎల్ఆర్ఎస్ దరఖాస్తుల్ని వర్గీకరించే ప్రక్రియను చేపట్టిన విషయం తెలిసిందే. అయితే, రాష్ట్రంలోని అనధికార లేఅవుట్లు, ఇళ్ల స్థలాలు, ఓపెన్ ప్లాట్ల సంబంధిత సమస్యలను పరిశీలించేందుకు ప్రభుత్వం సబ్ కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీకి మంత్రి కేటీఆర్ ఛైర్మన్ గా, అరవింద్ కుమార్ కన్వీనర్‌గా వ్యవహరిస్తారు. అనధికార లేఅవుట్లు, ఓపెన్ ప్లాట్లు, ఇళ్ల స్థలాల క్రమబద్ధీకరణ, గ్రామ కంఠం స్థలాల సంబంధిత సమస్యలతో పాటు ఇతర అంశాల్ని ఈ సబ్ కమిటీ పరిశీలిస్తుంది.
* ప్రభుత్వం వేసిన ఈ సబ్ కమిటీని చూసి పలువురు రియల్టర్లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణ రెరా అథారిటీ అనుమతి లేకుండా అనేక మంది రియల్టర్లు, డెవలపర్లు.. ప్రీ లాంచుల పేరిట ప్లాట్లు, ఫ్లాట్లను విక్రయిస్తున్నారని.. కొందరు అక్రమార్కులైతే రేటు తక్కువ అంటూ వంద శాతం సొమ్మును అమాయకుల నుంచి వసూలు చేస్తున్నారని.. నిర్మాణాలకు ఎప్పటిలాగే అనుమతులు ఆలస్యం అవుతున్నాయని.. ఇలాంటి కీలకమైన అంశాలపై సబ్ కమిటీ వేయాలని వీరంతా సూచిస్తున్నారు.