హైదరాబాద్ నిర్మాణ రంగంలో ప్రీలాంచుల్లో అమ్మే డెవలపర్లు ఇటీవల కాలంలో అధికమయ్యారు. ఇలాంటి మోసపూరిత డెవలపర్లను పూర్తి స్థాయిలో అరికట్టడానికి టీఎస్ రెరాకు కొంత సమయం పడుతుంది. ప్రీలాంచ్ ప్రాజెక్టుల్లో రేటు తక్కువనే ఏకైక కారణాన్ని కొనుగోలుదారులు పరిశీలిస్తున్నారే తప్ప.. ఆయా డెవలపర్ సకాలంలో అపార్టుమెంట్‌ని నిర్మించగలడా అనే అంశాన్ని అసలేమాత్రం పట్టించుకోవట్లేదు. ముఖ్యంగా, కోకాపేట్‌లో ఇటీవల కొన్ని నిర్మాణ సంస్థలు పోటీపడి ప్రీలాంచ్‌లో ఫ్లాట్లను అమ్ముతున్నాయి. వాటిలో ప్రవాసులు ఎంతో ఉత్సాహంగా పెట్టుబడి పెడుతున్నాయి. మరి, అలాంటి ప్రాజెక్టుల్లో పెట్టుబడి పెట్టొచ్చా? లేక అదే ప్రాంతంలో నిర్మాణం చివరి దశలో ఉన్న ప్రాజెక్టుల్లో కొనుగోలు చేయడం ఉత్తమమా?
ప్రీలాంచ్ ఆఫర్లను గమనిస్తే.. కోకాపేట్‌లో కొన్ని సంస్థలు ప్రీలాంచుల్లో.. చదరపు అడుక్కీ రూ.6 వేల నుంచి 8 వేలు చొప్పున విక్రయిస్తున్నాయి. వాటిలో కొనేందుకు కొందరు ఇన్వెస్టర్లు ఉత్సాహం చూపిస్తున్నారు. కాకపోతే, ఆ ప్రాజెక్టుకి రెరా అనుమతి లేదు. స్థలం కోసమే కోట్ల రూపాయల్ని వెచ్చించాలి. ఇందుకోసం ప్రజల్నుంచి వసూలు చేసే సొమ్మునంతా తీసుకెళ్లి ఆయా ప్రమోటర్లు స్థలం కోసమే చెల్లిస్తారు. ఆతర్వాత నిర్మాణాన్ని ఎలా చేపడతారనేది మిలియన్ డాలర్ల ప్రశ్న. ఒకవేళ అక్కడా ఇక్కడా బ్యాంకులు, ఆర్థిక సంస్థల నుంచి అప్పులు తెచ్చి కట్టినా.. పెరిగే నిర్మాణ వ్యయాన్ని దృష్టిలో పెట్టుకుంటే.. అధిక రేటుకు విక్రయిస్తే తప్ప గిట్టుబాటు కాదు. మరి, నిర్మాణ పనులు ఆరంభమయ్యాక అంతంత రేటు పెట్టి ఎవరు కొంటారు? ఎంతమందికి ధర ఎక్కువ పెట్టి కొనగలిగే స్థోమత ఉంటుంది. ఒకవేళ ఉన్నా.. తక్కువ రేటున్న ప్రాజెక్టునే అంతిమంగా ఎంచుకుంటారు తప్ప.. అధిక రేటు పెట్టి కొనుక్కునేవారూ తక్కువగా ఉంటారు.
కోకాపేట్ అయినా కొండాపూర్ అయినా.. హైదరాబాద్‌లో స్థిర నివాసాన్ని ఏర్పాటు చేసుకోవాలని భావించేవారు.. క్రమం తప్పకుండా మంచి అద్దెలు గిట్టుబాటు కావాలని భావించేవారు.. ఆరు నెలల్లోపు పూర్తయ్యే ప్రాజెక్టుల్ని ఎంచుకోవాలి. ఫ్లాట్ విలువ మీద తొలుత ఇరవై శాతం సొమ్ము చెల్లిస్తే చాలు.. ఆతర్వాత ఎనభై శాతం దాకా బ్యాంకు రుణం లభిస్తుంది. రెరా అనుమతి గల ప్రాజెక్టు కావడంతో.. ఐదేళ్ల వరకూ స్ట్రక్చర్ లోపాలుంటే రెరా అథారిటీ చూసుకుంటుంది. మనకు నచ్చిన ఫ్లాటును ఎంపిక చేసుకుంటే.. బిల్డర్ హ్యాండోవర్ చేయగానే.. ఇంటీరియర్స్ పూర్తి చేసుకుని గృహప్రవేశం చేసేయవచ్చు. కాబట్టి, స్థిర నివాసం ఏర్పాటు చేసుకోవాలని భావించేవారు.. నిర్మాణం చివరి దశలో ఉన్న ఫ్లాట్లను కొనుగోలు చేయడమే ఉత్తమం. వీటిలో అయితే ఎలాంటి మానసిక ఆందోళనలుండవు.
హైదరాబాద్ రియల్ రంగంలో రోజురోజుకీ పెరుగుతున్న ప్రీలాంచుల వల్ల నిర్మాణ పనులు చివరి దశలో ఉన్న ప్రాజెక్టులపై ప్రతికూల ప్రభావం పడుతుంది. ఈ పరిస్థితి కోకాపేట్‌లోనే కాదు.. హైదరాబాద్లోని అన్ని ప్రాంతాల్లోనూ నెలకొంది. రెరా అనుమతితో నిర్మాణాల్ని ఆరంభించి.. ప్రాజెక్టును అడ్వాన్స్ స్టేజీకి తీసుకెళ్లిన ప్రతి బిల్డర్‌కు ప్రీలాంచుల వల్ల ఇబ్బంది కలుగుతోంది. మూడు నుంచి నాలుగేళ్లు కష్టపడి పని చేస్తే తప్ప ఒక బహుళ అంతస్తుల భవనం కానీ ఆకాశహర్మ్యం కానీ చివరి దశకు రాదు. ఈ క్రమంలో కొందరు ప్రమోటర్లు ప్రీలాంచ్ ఆఫర్లను ప్రకటించడం వల్ల అసలైన బిల్డర్లను భారీగా దెబ్బతీస్తోంది.
This website uses cookies.