తెలంగాణ రాష్ట్రంలో సామాన్యుల కష్టార్జితానికి రెరా పూర్తి స్థాయి భద్రతనిస్తుందని.. ఇళ్ల కొనుగోలుదారులు చెల్లించే సొమ్ముకు పూర్తి స్థాయి భద్రతను రెరా చట్టం కల్పిస్తుందని టీఎస్ రెరా ఛైర్మన్ డాక్టర్ ఎన్ సత్యనారాయణ వివరించారు. నగరానికి చెందిన ఐదు రియల్ సంస్థలకు షోకాజ్ నోటీసునిచ్చిన నేపథ్యంలో ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రంలోని కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు, పట్టణాభివృద్ది సంస్థల నుంచి అనుమతి.. టీఎస్ రెరా రిజిస్ట్రేషన్ లేకుండా.. ప్రీలాంచ్, యూడీఎస్, ఎక్స్‌ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ (ఈవోఐ )పేరిట ప్లాట్లు, ఫ్లాట్లను విక్రయిస్తే.. రెరా చట్టం ప్రకారం కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. రెరా నెంబరు లేకుండా అమ్మడం, మార్కెటింగ్ చేయడం, బుకింగులు చేయడం వంటివి నేరమని స్పష్టం చేశారు.
రాష్ట్రంలో రెరా అనుమతి పొందిన ప్రతి ప్రాజెక్టుకు సంబంధించిన ప్రత్యేకమైన బ్యాంకు ఖాతాను ఆరంభించి.. అందులో డెబ్బయ్ శాతం నిధుల్ని ఆ ప్రాజెక్టు కోసమే ఖర్చు చేయాలని సూచించారు. ఒక ప్రాజెక్టు నిధుల్ని మరో ప్రాజెక్టుకు మళ్లించకూడదన్నారు. సదరు ప్రాజెక్టు కోసం నిధుల్ని వినియోగించడానికి సంబంధిత సివిల్ ఇంజనీర్, ఆర్కిటెక్ట్, చార్టెడ్ అకౌంటెంట్ ధృవీకరణ తప్పనిసరి అన్నారు. ప్రతి మూడు నెలలకోసారి భవన నిర్మాణ వివరాలు, నిధుల వినియోగం, బుకింగ్స్ వంటి వివరాల్ని విధిగా రెరాకు సమర్పించాలని తెలిపారు.
This website uses cookies.