కోకాపేట్లో రెండో విడత వేలం పాటల్ని వచ్చే నెల 3న నిర్వహించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. సుమారు ఏడు ప్లాట్ల వేలం ద్వారా రూ.2500 కోట్ల ఆదాయం ఆర్జించాలన్న లక్ష్యాన్ని నిర్దేశించుకుంది. అయితే, ట్రిపుల్ వన్ జీవోను తొలగించిన తర్వాత.. సుమారు 1.32 లక్షల ఎకరాలు అందుబాటులోకి వచ్చాక.. ఈ ఏడు స్థలాల్ని తీసుకోవడానికి ఎవరైనా ముందుకొస్తారా? అనే అనుమానం వ్యక్తమవుతోంది. ఇక్కడ ఎకరాకు కనీస ధర రూ.35 కోట్లుగా నిర్థారించారు. అంటే, అంతకు మించిన రేటును పెట్టి కొన్నవారే ఈ ప్లాట్లను దక్కించుకుంటారు. మరి, ప్రస్తుత పరిస్థితిలో ఇంతింత రేటు పెట్టి ఎవరైనా ఎందుకు పెట్టి కొనుగోలు చేస్తారనే సందేహం ప్రతిఒక్కర్ని పట్టిపీడిస్తోంది. ఎందుకో తెలుసా?
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వచ్చే ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని.. ట్రిపుల్ వన్ జీవోను తొలగించిందని సామాన్యులు సైతం అంగీకరిస్తున్నారు. రెజ్ న్యూస్ నిర్వహించిన సర్వేలోనూ ఇదే విషయం వెల్లడైంది. కేవలం రియల్టర్లకు మేలు చేయాలన్న ఉద్దేశ్యంతోనే ప్రభుత్వం తాజా నిర్ణయం తీసుకుందని ప్రజలూ భావిస్తున్నారు. పైగా, ట్రిపుల్ వన్ జీవోను తొలగించిన వెంటనే మాస్టర్ ప్లాన్ కూడా అందుబాటులోకి తెచ్చి ఉంటే ప్రతిఒక్కరికీ స్పష్టత వచ్చేది.
నోటీమాట ద్వారా 111 జీవోను తొలగిస్తున్నామని చెప్పారే తప్ప.. ఇందుకు సంబంధించి ఎక్కడా జీవోను విడుదల చేయలేదు. పైగా, మాస్టర్ ప్లాన్‌ను రూపొందించి.. గ్రీన్ జోన్‌గా ఈ ప్రాంతాన్ని మొత్తం డెవలప్ చేస్తామని మంత్రి కేటీఆర్ పలుసార్లు తెలిపారు. కాకపోతే, అందుకు సంబంధించిన ఒక్క అడుగు ముందుకు పడలేదు. మొత్తానికి, ట్రిపుల్ వన్ జీవో వ్యవహారం త్రిశంకు స్వర్గంలో ఉండటం వల్ల రియల్ ఎస్టేట్ లావాదేవీలు నిలిచిపోయాయి. కోకాపేట్ పక్కనే ఉన్న ప్రాంతాలకు సంబంధించి స్పష్టత రానంతవరకూ కోకాపేట్‌లో వేలం పాటలకు పెద్దగా గిరాకీ ఉండదని నిపుణులు సైతం అంగీకరిస్తున్నారు.
ప్రభుత్వ పెద్దలు ఒక విషయాన్ని గుర్తించాలి. కోకాపేట పక్కనే ట్రిపుల్ వన్ జీవో ప్రాంతం ఉంది. ఆ జీవోను తొలగించాక.. వందల ఎకరాల భూమి అందుబాటులోకి వస్తుంది. ఈ క్రమంలో కోకాపేట లో అధిక ధర పెట్టి కంపెనీలు ఎందుకు భూములు కొంటాయి? ఇప్పటికే అధిక ధర పెట్టి కొన్న వారు ఏమి చేయాలో అర్ధం కాక తల పట్టుకుంటున్నారు. ఎందుకంటే, మంత్రి మండలి 111 జీవో తొలగింపు ప్రకటన తర్వాత.. కోకాపేట్లో అధిక రేటు పెట్టి ఫ్లాట్లను కొనడానికి బయ్యర్లు పెద్దగా ఇంట్రెస్ట్ చూపించట్లేదు. ఈ క్రమంలో రెండో విడత వేలంలో రియల్ సంస్థలు ఎందుకు కొంటారనే ప్రశ్న ఉత్పన్నం అవుతోంది. ఇదే కాదు రేపొద్దున బుద్వేల్ వేలానికి ఇదే పరిస్థితి ఏర్పడుతుందని ప్రభుత్వం గుర్తించాలి.
This website uses cookies.