– సర్కారు అంచనా
కోకాపేట నియోపొలిస్ లేఔట్ లోని 45.33 ఎకరాల్లో 7 ప్లాట్ల వేలం ద్వారా ఖజానాకు దాదాపు రూ.2500 కోట్ల ఆదాయం వస్తుందని సర్కారు అంచనా వేస్తోంది. ఆగస్టు 3న ఈ వేలం జరగనుంది. కరోనా సమయంలో 2021 జూలై 16న హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్ మెంట్ అథార్టీ (హెచ్ఎండీఏ) నిర్వహించిన తొలి దశ వేలంలో 49.949 ఎకరాల్లోని ఎనిమిది ప్లాట్లు రాష్ట్ర ప్రభుత్వానికి రూ.2000.37 కోట్ల ఆదాయాన్ని సమకూర్చాయి. అక్కడ ప్లాట్లు కొనుగోలు చేసిన కార్పొరేట్ సంస్థలు, ఇతరులు ప్రస్తుతం అక్కడ నిర్మాణ కార్యక్రమాలు చేపట్టారు.
ఈ నేపథ్యంలో నియోపొలిస్ లేఔట్ లో రూ.300 కోట్లతో మౌలిక వసతులను అభివద్ధి చేశారు. అనంతరం హెచ్ఎండీఏ.. భారత ప్రభుత్వ సంస్థ ఎంఎస్టీసీ లిమిటెడ్ సహకారంతో రెండో దశ ఈ వేలం ప్రారంభించింది. ఎకరాకు కనీస అప్ సెట్ ధరను రూ.35 కోట్లుగా నిర్ధారించారు. వేలంలో పాల్గొనాలనుకునే వారు ప్రతి ప్లాట్ కు ఈఎండీ కింద రూ.5 కోట్లు చెల్లించి జూలై 31 లోపు రిజిస్టర్ చేసుకోవాలి. ఈఎండీ మొత్తాన్ని ఆగస్టు 1వ తేదీ లోపు చెల్లించాలి. జూలై 20న ప్రీ బిడ్ సమావేశం జరగనుంది.
ఇక ఆగస్టు 3న ఉదయం నాలుగు ప్లాట్లకు, మధ్యాహ్నం మూడు ప్లాట్లకు వేలం నిర్వహిస్తారు. వేలంలో విజయం సాధించిన బిడ్డర్ వారం రోజుల్లోపు ప్లాట్ అమ్మకపు విలువలో (ఈఎండీ మినహా) 33 శాతం ప్రారంభ డిపాజిట్ చేయాలి. అనంతరం నెల రోజుల్లోపు రెండో విడతగా 33 శాతం చెల్లించాలి. తర్వాత ఈఎండీతో సహా మిగిలిన మొత్తాన్ని ఈ వేలం జరిగిన తేదీ నుంచి 90 రోజుల్లోపు చెల్లించాలి. కాగా, మొదటి దశ వేలంలో ఎకరా అప్ సెట్ ధర రూ.31.20 కోట్ల నుంచి రూ.60.2 కోట్లకు చేరగా.. ఎకరా సగటు ధర రూ.40.05 కోట్లు పలికింది.
This website uses cookies.