తెలంగాణలో 2024 ఏప్రిల్ నుంచి అక్టోబర్ మధ్యలో జీఎస్టీ వసూళ్లు గణనీయంగా తగ్గాయి. ఇదే కాలానికి గతేడాది 15.9 శాతం వృద్ధి చెందగా.. ఈసారి కేవలం 5.2 శాతమే నమోదైంది. అంటే దాదాపు పది శాతానికి పైగా జీఎస్టీ వసూళ్లు పడిపోయాయి. ఎన్నికల సీజన్ ఇందుకు కారణమని చెప్పొచ్చు. మరొక కారణం నిర్మాణ రంగమే. స్టీలు, సిమెంట్ వంటి భవన నిర్మాణ సామగ్రి వినియోగం గణనీయంగా తగ్గుముఖం పట్టింది. ఇళ్లు, ఫ్లాట్ల అమ్మకాలు దారుణంగా పడిపోయాయి. హైదరాబాద్ ప్రజలు ఇళ్ల కొనుగోలు వైపు కన్నెత్తి చూడకపోవడమే ఇందుకో కారణం.
తెలంగాణలో కొత్త ప్రభుత్వం ఏర్పాటైన నేపథ్యంలో.. ఇళ్ల కొనుగోలుదారులు, పెట్టుబడిదారులు వేచి చూసే ధోరణిని అవలంబించారు. ఇక్కడ అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలు.. రియల్ రంగానికిచ్చే ప్రోత్సాహాన్ని చూశాకే.. కొనాలనే నిర్ణయానికి వచ్చారు. కాకపోతే, తెలంగాణ ప్రభుత్వం నిర్మాణ రంగం ప్రోత్సాహానికి ఎలాంటి సానుకూల నిర్ణయాలు తీసుకోకపోవడం వల్ల ఇళ్లు కొనే వారు తగ్గారు. మరోవైపు, ఏపీలో చంద్రబాబు నాయుడు ప్రభుత్వం తీసుకుంటున్న వినూత్న నిర్ణయాల్ని చూసి ఇన్వెస్టర్లు కొంతమేరకు ఆకర్షితులయ్యారు. అక్కడ పెట్టుబడి పెట్టడంపై దృష్టి సారించారు. నగరం చుట్టుపక్కల భూములు, ప్లాట్లు కొనేవారంతా.. ప్రస్తుతం అమరావతి చుట్టుపక్కల ఇన్వెస్ట్ చేస్తున్నారు.