హైదరాబాద్‌లో ప్రీలాంచ్ బాగోతానికి కార్పొరేటీకరణ రంగు అద్దిన.. చెన్నైకి చెందిన అర్బన్ రైజ్ సంస్థ.. తమ నిజ స్వరూపాన్ని చూపెడుతోందని కొనుగోలుదారులు విమర్శిస్తున్నారు. మొదట్లో ఈ సంస్థ.. బాచుపల్లిలో 22 అంతస్తులో అర్బన్ రైజ్ నిర్మిస్తున్నామంటూ ప్రచారం చేసిందని.. గరిష్ఠంగా 1600 చదరపు అడుగుల విస్తీర్ణం గల ఫ్లాట్లే ఉంటాయని.. అంతకు మించిన సైజుల్లేవని చెప్పింది. ఏజెంట్ల మాటలు నమ్మి.. రేటు తక్కువంటే కొనుగోలు చేశామని.. ఇప్పుడేమో ఈ సంస్థ చుక్కలు చూపిస్తోందని చెబుతున్నారు.
హైదరాబాద్‌లో ప్రీలాంచ్ బయ్యర్ల నుంచి మంచి రెస్పాన్స్ రావడం.. జనాలు ఇబ్బడిముబ్బడిగా సొమ్ము చెల్లించడం జరిగింది. దీంతో, మరింత సొమ్మను దండుకోవాలనే అత్యాశతో ఈ సంస్థ ఏకంగా పదకొండు అంతస్తుల్ని అధికంగా కట్టాలని నిర్ణయం తీసుకుంది. అసలు అనుమతి రాకముందే.. నిర్మాణ పనులు ఆరంభం కాక ముందే.. కోట్ల రూపాయలు చేతికొస్తుంటే.. ఎక్కడ్లేని సంతోషం వేసిన ఈ సంస్థ.. బాచుపల్లిలో వచ్చిన సొమ్ముతో కొంత మొత్తాన్ని పెట్టి దుండిగల్లో మరో ప్రాజెక్టును ఆరంభించిందని.. ఆతర్వాత అమీన్‌పూర్‌లో ఇంకో నిర్మాణాన్ని ప్రారంభించిందని కొనుగోలుదారులు వెల్లడించారు.
ప్రీలాంచ్‌లో ఫ్లాట్లను విక్రయించి.. ఆ తర్వాత దొడ్డి దారిన ఈ సంస్థ రెరా అథారిటీ నుంచి అనుమతి తెచ్చుకుందని ఆరోపిస్తున్నారు. వాస్తవానికి, రెరా నుంచి అనుమతి తీసుకోకుండా ఫ్లాట్లను విక్రయించే సంస్థ నుంచి రెరా అథారిటీ ప్రాజెక్టు విలువలో పది శాతం జరిమానా వసూలు చేయాలన్నది నిబంధన. కానీ, ఇక్కడ ఏం జరిగిందో తెలియదు కానీ.. అర్బన్ రైజ్ క్లౌడ్ 33కి రెరా నుంచి అనుమతి తెచ్చుకున్నారని.. అదే సమయంలో అపార్టుమెంట్ సైజునూ పెంచేశారని.. 22 బదులు 33 అంతస్తులు చేశారని వెల్లడించారు. ఫ్లాట్ సైజునూ 1600 చదరపు అడుగుల త్రీ బెడ్‌రూమ్ బదులు.. గరిష్ఠ సైజును ఫోర్ బెడ్రూమ్ 2000 చదరపు అడుగులకు పెంచేశారని తెలిపారు. ఈ విషయం తెలిసి తాము సంస్థ ప్రతినిధుల్ని నిలదీశామని.. వారి నుంచి ఎలాంటి సమాధానం రావట్లేదని అంటున్నారు. ఇలాగైతే ఈ సంస్థ భవిష్యత్తులో నాణ్యతగా ఫ్లాట్లను కడుతుందా? ఏమైనా సమస్యలు వస్తే పరిష్కరిస్తుందా అనే సందేహం కలుగుతుందని బయ్యర్లు చెబుతున్నారు.
ఇప్పుడేమో తాజాగా.. ప్రీలాంచ్‌లో కొన్నవారినీ జీఎస్టీతో పాటు మరికొంత సొమ్ము కట్టి అగ్రిమెంట్ చేసుకోమని బలవంతం పెడుతోందని బయ్యర్లు ఆరోపిస్తున్నారు. ఇలాగైతే ప్రీలాంచ్‌లో కొన్నా పెద్దగా ఉపయోగం లేదని విమర్శిస్తున్నారు. అందుకే, ప్రీలాంచ్‌లో ఎట్టి పరిస్థితిలో ఫ్లాట్లను కొనకూడదని సూచిన్నారు. తమ సమస్యను తెలంగాణ రెరా అథారిటీ దృష్టికి తీసుకెళ్లామని బాధితులు తెలిపారు. ప్రీలాంచ్‌లో ఫ్లాట్లను విక్రయించిన ఈ సంస్థ నుంచి.. ప్రాజెక్టు విలువలో పది శాతం జరిమానాను వసూలు చేయకుండా ఎలా అనుమతినిచ్చారని పురపాలక శాఖ మంత్రి కేటీఆర్‌ను నిలదీస్తున్నారు. రెరా అథారిటీ ఏర్పాటయ్యాక ప్రీలాంచ్లో ఫ్లాట్లను విక్రయించి.. తమలాంటివారిని మోసం చేస్తున్న అర్బన్ రైజ్ వంటి సంస్థల ఆగడాలకు అడ్డుకట్ట వేయాలని బయ్యర్లు కోరుతున్నారు.