Categories: TOP STORIES

డ్రీమ్ వ్యాలీ అక్ర‌మ విల్లాల‌పై సీఎం నిర్ణ‌యం ఎప్పుడు?

చ‌ట్టప‌రిధికి లోబ‌డి ప‌ర్స‌న‌ల్ ప‌ని నిమిత్తం నా వ‌ద్ద‌కొస్తే వారికి ప‌లుకుతాను.. చ‌ట్టాన్ని ఉల్లంఘించి ఎవ‌రైనా నాతో ప‌ని చేయాల‌ని అనుకుంటే.. అది కుద‌ర‌దు అని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి స్ప‌ష్టం చేశారు. గ‌త వారం నాన‌క్‌రాంగూడ‌లో జ‌రిగిన ఫైర్ డిపార్టుమెంట్ కార్య‌క్ర‌మంలో భాగంగా ఆయ‌న ఈ వ్యాఖ్య‌లు చేశారు.

మ‌రి, సీఎం రేవంత్ రెడ్డి అక్ర‌మార్కుల వ్య‌వ‌హ‌రంలో ఇంత నిక్క‌చ్చిగా వ్య‌వ‌హ‌రిస్తుంటే.. అక్ర‌మార్కుల‌కు ఎలాంటి ప‌ని చేయ‌న‌ని అంత స్ప‌ష్టంగా చెబుతుంటే.. పుర‌పాల‌క శాఖ, రెవెన్యు, పంచాయ‌తీ రాజ్ ఉన్న‌తాధికారుల‌కు ఎందుకు అర్థం కావ‌ట్లేదు? జంట జ‌లాశ‌యాల్లో ఒక‌టైన హిమాయ‌త్ సాగ‌ర్ చేరువ‌లోని బాకారంలో.. డ్రీమ్ వ్యాలీ రిసార్ట్స్‌.. అక్ర‌మంగా 31 విల్లాల్ని నిర్మిస్తుంటే.. వాటిని కూల్చివేయ‌కుండా.. అధికారులు ఎందుకు ఆల‌స్యం చేస్తున్నారు? అంటే, వారంద‌రికీ ముందస్తుగా తెలిసే ఈ విల్లాల నిర్మాణం జ‌రిగిందా? అక్ర‌మంగా క‌ట్టిన ఈ విల్లాల్ని కూల్చివేయ‌కుండా అధికారులు ఇంకా ఎంత‌కాలం వేచి చూస్తారు?

తెలంగాణ‌లో ఏర్పాటైన టీఎస్ రెరా అథారిటీ చాలా విచిత్రంగా ప్ర‌వ‌ర్తిస్తుంది. రెరా అనుమ‌తి తీసుకున్న త‌ర్వాత కూడా.. మూడు నెల‌ల‌కోసారి నివేదిక‌ను స‌మ‌ర్పించ‌ని బిల్డ‌ర్ల‌కు నోటీసులు పంపించే అథారిటీ.. ట్రిపుల్ వ‌న్ జీవోలోని బాకారంలో డ్రీమ్ వ్యాలీ సంస్థ అసలేమాత్రం అనుమ‌తి తీసుకోకుండా.. అక్ర‌మంగా విల్లాల్ని నిర్మిస్తుంటే ఏం చేస్తోంది? క‌నీసం నోటీసులైనా ఇచ్చిందా? లేక ఆ అక్ర‌మ విల్లాల‌తో త‌మ‌కు సంబంధం లేదంటూ చేతుల్ని దులిపేసుకుందా? ట్రిపుల్ వ‌న్ జీవోలో అక్ర‌మ నిర్మాణాల కూల్చివేత పేరిట కాస్త హ‌డావిడి చేసిన గ‌త హెచ్ఎండీఏ అధికారులు.. ఈ విల్లా ప్రాజెక్టును చూసీచూడ‌న‌ట్లు వ‌దిలేశారెందుకు?
కాంగ్రెస్ ప్ర‌భుత్వం ఏర్ప‌డ్డాక కూడా.. ఇలాంటి అక్ర‌మ విల్లాల‌కు అడ్డుక‌ట్ట ప‌డ‌దా? గుట్టు చ‌ప్పుడు కాకుండా.. రాత్రికి రాత్రే విల్లాల్ని నిర్మిస్తున్న డ్రీమ్ వ్యాలీ సంస్థ‌ను కాంగ్రెస్ ప్ర‌భుత్వంలో కాపాడుతున్న శ‌క్తి ఎవ‌రు? ఇలాంటి అక్ర‌మ ప్రాజెక్టుల‌పై ఉదాసీన వైఖ‌రిని అవ‌లంభిస్తే.. సీఎం రేవంత్‌రెడ్డికి ప్ర‌జ‌ల్లో ఏర్ప‌డిన మంచి ఇమేజ్ కూడా మ‌స‌క‌బారిపోయే ప్ర‌మాదముంది. కాబ‌ట్టి, ఇప్ప‌టికైనా ముఖ్య‌మంత్రి డ్రీమ్ వ్యాలీ నిర్మించే ఇమాజిన్ విల్లాల్ని కూల్చివేత‌కు ప‌చ్చ‌జెండా ఊపాల్సిన అవ‌స‌రం ఎంతైనా ఉంది.

This website uses cookies.