హైదరాబాద్ రియాల్టీలో కొత్త స్కామ్.. జీపీఏలతో అక్రమ దందా
హైదరాబాద్‌లో విపరీతపు పోకడలు
స్థల యజమానులకే బిల్డర్లు టోకరా
బయ్యర్లు జాగ్రత్త.. కొనకపోవడమే మేలు
2018 కంటే ముందు ప్రశాంతంగా ఉన్న హైదరాబాద్ రియల్ రంగం.. క్రమక్రమంగా వికృత పోకడలకు చిరునామాగా మారుతోంది. కొందరు బిల్డర్లు అక్రమంగా వ్యవహరిస్తూ.. ల్యాండ్‌లార్డ్స్ కు తెలియకుండా.. అక్రమంగా ప్లాట్లను రిజిస్టర్ చేస్తున్నారు. వీరు ఎంతకు తెగిస్తున్నారంటే.. భూయజమానుల్నే ప్రాజెక్టులో నుంచి బయటికి పంపించేలా కుట్రలు పన్నుతున్నారు. మరి, ఇలాంటి మోసపూరిత బిల్డర్లకు నిర్మాణ సంఘాలన్నీ కలిసికట్టుగా బుద్ధి చెప్పాలి. లేకపోతే, వికృత పోకడలు మార్కెట్లో ఎక్కువై.. నిర్మాణ రంగం ఉనికి ప్రమాదంలో పడుతుంది. ఈ క్రమంలో బయ్యర్లు ఎలాంటి ముందు జాగ్రత్తలు తీసుకోవాలి?
హైదరాబాద్‌లో కొన్ని ప్రాజెక్టుల్ని గమనిస్తే.. స్థల యజమానులు, బిల్డర్ల మధ్య గొడవల కారణంగా.. అందులో ప్లాట్లు, ఫ్లాట్లను కొనుగోలు చేసిన కొనుగోలుదారులు ఇబ్బంది పడుతున్నారు. కొందరు బిల్డర్లు ఏం చేస్తున్నారంటే.. స్థల యజమానులతో తొలుత ఒప్పందం కుదుర్చుకుని.. ఆతర్వాత రాసుకున్న నిబంధనలకు తూట్లు పొడుస్తూ.. ప్రీలాంచ్‌లో ప్లాట్లు, ఫ్లాట్లను విక్రయిస్తున్నారు. అలాంటి వాటిలో కష్టార్జితాన్ని పోసి.. కష్టాలు కొని తెచ్చుకోకండి. అసలు ఒక ప్రాజెక్టులో ప్లాటు లేదా ఫ్లాటును కొనేటప్పుడు.. మీరు ఎలాంటి జాగ్రత్తల్ని తీసుకోవాలో ఒకసారి చూసేద్దామా..
ఎక్కువ రేషియో రాసిచ్చారా?
కొన్ని సందర్భాల్లో స్థల యజమానులు హుందాగా వ్యవహరిస్తుంటారు. స్థలాన్ని డెవలప్‌మెంట్ నిమిత్తం బిల్డర్లకు అందజేసే క్రమంలో.. వారికే ఎక్కువ రేషియో కూడా రాసిచ్చేస్తుంటారు. కారణం.. మధ్యలో ఎవరో ఒక మంచి వ్యక్తి ఆయా బిల్డర్‌ను పరిచయం చేయడమే అందుకు ప్రధాన కారణం కావొచ్చు. కాకపోతే, ఆయా స్థలం సదరు బిల్డర్ పెట్టుబడి పెట్టకుండా.. ప్రీలాంచ్‌లో ప్లాట్లను విక్రయించి.. ఆయా సొమ్మునే పెట్టుబడి పెడితే ఎలా? అప్పుడు స్థల యజమానికి బిల్డర్‌పై ఎలాంటి అభిప్రాయం ఏర్పడుతుంది? ఆ అంశంలో అతన్ని నిలదీస్తే? అతని నుంచి సరైన సమాధానం రాకపోతే.. అతను కుట్రపూరితంగా ఆ స్థలయజమానిని ప్రాజెక్టులో నుంచి బయటికి నెట్టేస్తే ఎలా? ఇలాంటి సంఘటనలు హైదరాబాద్‌లో ఇప్పుడిప్పుడే వెలుగులోకి వస్తున్నాయి. కాబట్టి, ల్యాండ్ లార్డ్స్ తస్మాత్ జాగ్రత్త.
స్థలయజమానులకు తెలియకుండానే.. ఆయా ప్రాజెక్టులో నుంచి బయటికి పంపిస్తే ఎలా అనే విషయాన్ని ఆలోచించండి. గుడ్డిగా డెవలప్‌మెంట్ అగ్రిమెంట్ కమ్ జీపీఏలు రాసుకోకుండా. ఇక నుంచి ఇలాంటి పరిస్థితి వస్తే.. దానికి సొల్యూషన్ ఉండేలా నిబంధనల్ని మీ అగ్రిమెంట్‌లో పొందుపర్చండి. ఎందుకంటే, ఎలాగైనా కోట్లు సంపాదించాలన్న దురుద్దేశ్యంతో రియల్ రంగంలోకి కొందరు వ్యక్తులు డెవలపర్లుగా చెలామణీ అవుతున్నారు.
వీరంతా ముందు మంచిగానే నటిస్తూ.. ఎక్కువ సొమ్ము అడ్వాన్సులిస్తూ.. మిమ్మల్ని ఆకట్టుకుంటారు. తీరా మీరు అగ్రిమెంట్ చేసుకున్నాక.. ఆ ప్రాజెక్టులో నుంచి బయటికి నెట్టేస్తే మీరు ఇబ్బంది పడాల్సి వస్తుంది. అందుకే, మార్కెట్లో పేరున్న బిల్డర్లకే డెవలప్‌మెంట్ నిమిత్తం మీ స్థలాన్ని అందజేయండి. లేకపోతే, పోలీసులు, న్యాయవాదులు, కోర్టుల చుట్టూ తిరగలేక ఇబ్బంది పడాల్సి వస్తుంది.
బయ్యర్లు ఏం చేయాలి?
మీరు కొనాలని అనుకుంటున్న ప్రాజెక్టులో పార్ట్‌నర్లు ఉంటే గనక.. వారి షేర్ హొల్డింగ్ ప్యాటర్న్ ఎంతుందో తెలుసుకోవాలి. అధిక షేర్ ఉన్న పార్ట్‌నర్.. కుట్రలు పన్ని ఇతరుల్ని బయటికి పంపివేస్తే పరిస్థితి ఎలా? ఈ అంశాన్ని మీరు ప్లాటు కొనుక్కునేటప్పుడే అడిగి తెలుసుకోవాలి. ఇది తమకేం సంబంధం అనుకోవద్దు. ఎందుకంటే, పార్ట్‌నర్ల మధ్య గొడవలు వచ్చి కోర్టు కేసుల వద్దకెళితే.. అంతిమంగా మీరు కూడా ఇబ్బంది పడతారని గుర్తుంచుకోండి.
డెవలప్‌మెంట్ అగ్రిమెంట్‌లో రాసుకున్న నిబంధనల్ని కొందరు బిల్డర్లు పాటించట్లేదు. ప్రభుత్వ అనుమతులన్నీ వచ్చాకే ప్రాజెక్టును ఆరంభించాలని తొలుత రాసుకున్నా.. స్థలయజమానికి తెలియకుండా.. ప్రీలాంచుల్లో ప్లాట్లను విక్రయిస్తున్నారు. ఈ విషయమై అడిగితే.. స్థలయజమానిని అందులో నుంచి అడ్డదారిలో బయటికి వెళ్లగొట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. అవసరమైతే తప్పుడు కేసులు పెట్టి ఇబ్బంది పెడుతున్నారు. కాబట్టి బయ్యర్లు ఇలాంటి వాటిలో కొనకండి.
మీకు స్థిరాస్తిని విక్రయించే సంస్థ ఛైర్మన్, ఎండీ ఎవరు? అందులో ఎంతమంది పార్ట్‌నర్లు, డైరెక్టర్లు ఉన్నారో తెలుసుకోవాలి. వారి బ్యాక్ గ్రౌండ్ తప్పనిసరిగా చెక్ చేయాలి. ఇళ్ల డెలివరిలో వారి ట్రాక్ రికార్డును తెలుసుకోవాలి.
గతంలో ఎప్పుడు, ఎక్కడ ప్రాజెక్టులను చేపట్టారు? ఎలా పూర్త చేశాడనేది ఆరా తీయాలి. అంటే, బయ్యర్లను ఇబ్బంది పెట్టకుండానే ప్రాజెక్టును హ్యాండోవర్ చేశారా? లేక ఇబ్బందులకు గురి చేశారా అనే అంశాన్ని కనుక్కోవాలి.
ఖరీదైన, అందమైన బ్రోచర్లను చూసి.. ఎట్టి పరిస్థితిలో నమ్మకండి. వాటిని చూసి స్థిరాస్తిని కొనుగోలు చేయకండి. అవి కేవలం మిమ్మల్ని ఆకర్షించేందుకు చేసిన ప్రజంటేషన్ అని గుర్తుంచుకోండి. ఇటీవల కాలంలో కొందరు బిల్డర్లు ప్రాజెక్టులను నిర్మించకున్నా.. ఇలాంటి బ్రోచర్లతో బయ్యర్లను బోల్తా కొట్టించి.. కష్టార్జితాన్ని దోచుకుంటున్నారు. కాబట్టి, తస్మాత్ జాగ్రత్త.