Categories: TOP STORIES

హోమ్ లోన్ ఇన్సూరెన్స్ ఎందుకు తీసుకోవాలి?

ఇల్లు కొనడం అంటే మామూలు విషయం కాదు. అది కూడా లోన్ తీసుకుని కొనుక్కోవడం అంటే జీవితాంతం ఈఎంఐలు కట్టాల్సిందే. ఈ పరిస్థితుల్లో ఇతరత్రా అవసరాల కోసం డబ్బు ఆదా చేయడం కష్టమే అవుతుంది. ఒకవేళ లోన్ తీసుకున్న తర్వాత రుణ గ్రహీతకు ఏదైనా అయితే, ఆ భారం కుటుంబ సభ్యులపై పడుతుంది. అందువల్ల హోమ్ లోన్ తోపాటు ఇన్సూరెన్స్ కూడా తీసుకోవడం ఉత్తమం అని నిపుణులు చెబుతున్నారు. దీనివల్ల కలిగే ప్రయోజనాలను వివరించారు. అవేంటంటే..

కుటుంబానికి రక్ష

హోమ్ లోన్ ఇన్సూరెన్స్ ప్లాన్ తీసుకోవడం వల్ల మొదటి, అతి ముఖ్యమైన ప్రయోజనం.. రుణ గ్రహీత కుటుంబానికి రక్షణ కల్పించడం. హోమ్ లోన్ చెల్లింపుదారు ఆకస్మిక మరణంతో సహా క్లిష్ట పరిస్థితుల్లో ఈ బీమా సదరు కుటుంబానికి తోడుగా నిలుస్తుంది. ఈ బీమా రక్షణ పథకం రుణ గ్రహీత మరణం తర్వాత కూడా పని చేస్తుంది. రుణ గ్రహీత లేనప్పుడు ఆయన కుటుంబ అవసరాలను తీరుస్తుంది. బకాయి ఉన్న హోమ్ లోన్ మొత్తాన్ని తిరిగి చెల్లిస్తుంది. తద్వారా రుణ గ్రహీత ఆస్తిని బ్యాంకు స్వాధీనం చేసుకోకుండా కాపాడుతుంది.

ప్రీమియం చెల్లింపు సులభం

హోమ్ లోన్ ఇన్సూరెన్స్ కుటుంబానికి పెద్ద వరం లాంటిది. అభద్రతా భావం నుంచి కుటుంబాన్ని సురక్షితంగా ఉంచుతుంది. ఇది అందించే ప్రయోజనంతో పోలిస్తే బీమా ఖర్చు తక్కువనే చెప్పొచ్చు. పైగా ప్రీమియం చెల్లింపు కూడా చాలా సులభం. మీరు విడిగా దీనిని చెల్లించొచ్చు లేదా హోమ్ లోన్ ఈఎంఐతో కలిపి కూడా చెల్లించొచ్చు. నెలవారీ ప్రీమియం చెల్లించే సౌకర్యం కూడా ఉంటుంది. హోమ్ లోన్ ఇన్సూరెన్స్ కాలిక్యులేటర్ ఉపయోగించి మీ హోమ్ లోన్ ఇన్సూరెన్స్ ప్రీమియం ఎంతో తెలుసుకోవచ్చు.

పన్ను ప్రయోజనాలు

హోమ్ లోన్ ప్రొటెక్షన్ కవర్ కొనుగోలుతో ఆదాయపు పన్ను చట్టం సెక్షన్ 80 సి కింద మినహాయింపును క్లెయిమ్ చేసుకోవచ్చు. అయితే, హోమ్ లోన్ తో ప్రీమియం కలిపి లేనప్పుడు, విడిగా ఇన్సూరెన్స్ చెల్లించినప్పుడు మాత్రమే ఈ క్లెయిమ్ చేసుకోగలం. పన్ను ప్రయోజనాలతోపాటు విపత్తు లేదా సంక్షోభ సమయాల్లో ఈ లోన్ ప్రొటెక్షన్ ప్లాన్ మీకు ఆస్తి భద్రతను కల్పిస్తుంది.

అదనపు ప్రయోజనాలు

హోమ్ లోన్ ఇన్సూరెన్స్ తో కొన్ని అదనపు ప్రయోజనాలను బ్యాంకులు ఆఫర్ చేస్తుంటాయి. వాస్తవానికి ఇది తప్పనిసరి కొనుగోలు కాదు. ప్రమాదవశాత్తూ రుణ గ్రహీత మరణించినా, నిరుద్యోగి అయినా, వైకల్యం చెందినా అలాంటి సంక్షోభ సమయాల్లో ఇది అక్కరకొస్తుంది. ఈ హోమ్ లోన్ ఇన్సూరెన్స్ ప్లాన్లు రుణ గ్రహీతలను పూర్తిగా కవర్ చేసి కవచ్ వలె కాపాడతాయి. అందువల్ల ఇప్పటికి మీరు హోమ్ లోన్ తీసుకుని ఇన్సూరెన్స్ తీసుకోకుంటే వెంటనే దానిని తీసుకోండి.

This website uses cookies.