Categories: TOP STORIES

ట్విన్ ట‌వ‌ర్ల‌ను ఎందుకు కూల్చివేశారు?

* తొలుత చెప్పిందొక‌.. త‌ర్వాత చేసిందొక‌టి
* గార్డెన్ ఏరియాలో కట్టిన 40 అంత‌స్తుల ట‌వ‌ర్‌
* ఇందుకు రెసిడెంట్స్ అనుమ‌తి తీసుకోలేదు
* పూర్తిగా నిర్మాణ నిబంధ‌న‌ల‌కు విరుద్ధం..
* ఫైర్ డిపార్టుమెంట్ ఎన్వోసీ తీసుకోలేదు

 

న్యూఢిల్లీలో కుతుబ్ మినార్ కంటే అధిక ఎత్తు గ‌ల ట్విన్ ట‌వ‌ర్ల కూల్చివేయ‌డం.. దేశ‌మంత‌టా చ‌ర్చ‌నీయాంశంగా మారింది. అస‌లెందుకీ జంట ట‌వ‌ర్లను కూల్చివేశారు. ఇంత బ‌డా నిర్మాణాల్ని నేల‌మ‌ట్టం చేయ‌డానికి ప్ర‌ధాన కార‌ణ‌మేమిటి? కూల్చివేత‌లో వినియోగించిన ప‌రిజ్ఞానం ఏమిటి?

2005లో సూప‌ర్ టెక్ 9 అంత‌స్తుల ఎత్తులో 14 ట‌వ‌ర్లు, గార్డెన్ ఏరియా, షాపింగ్ కాంప్లెక్స్ క‌ట్టేందుకు అనుమ‌తిని తీసుకుంది. దీనికి ఎమ‌రాల్డ్ కోర్ట్ అని నామ‌క‌ర‌ణం చేసింది. 2009లో ప్లాన్ రివైజ్ చేసి అపెక్స్‌, సీయాన్ ట‌వ‌ర్ల‌ను క‌డ‌తామంటూ నొయిడా అథారిటీకి ద‌ర‌ఖాస్తు చేసింది. ఆత‌ర్వాత మళ్లీ 2012లో మరోసారి ప్లాన్ రివైజ్ చేసింది. ఒక ట‌వ‌ర్‌ను అద‌నంగా క‌ట్ట‌డ‌మే కాకుండా ట‌వ‌ర్ల ఎత్తు కూడా 9 నుంచి 11కి పెంచేసింది. ప్ర‌స్తుతం కూల్చివేసిన ట్విన్ ట‌వ‌ర్ల స్థ‌లంలో ఒక ట‌వ‌ర్ నిర్మించి.. దాన్ని ముందు స్థ‌లాన్ని గ్రీన్ ఏరియాగా డెవ‌ల‌ప్ చేస్తాన‌ని సూప‌ర్ టెక్ సంస్థ మొద‌ట్లో చెప్పింది. ఆ త‌ర్వాత ఆ గ్రీన్ ఏరియా స్థ‌లంలోనే ట్విన్ ట‌వ‌ర్ల‌ను నిర్మించేందుకు ప్లాన్ చేసింది. సీయాన్ మ‌రియు అపెక్స్ ట‌వ‌ర్ల‌ను 24 అంత‌స్తుల నుంచి 40 అంత‌స్తుల ఎత్తుకు పెంచింది. దీంతో చిర్రెత్తుకొచ్చిన ఎమ‌రాల్డ్ కోర్టు నివాసితులు తొలుత అలహాబాద్ కోర్టులో కేసు దాఖ‌లు చేశారు. కోర్టు ఆ టవర్లను కూల్చివేయ‌ల‌ని 2014లో తేల్చి చెప్పింది. ఆత‌ర్వాత సూప‌ర్ టెక్ సంస్థ కేసును సుప్రీం కోర్టులో ద‌ర‌ఖాస్తు చేసింది. దీంతో సుప్రీం కోర్టు కేసు పూర్వాప‌రాల్ని ప‌రిశీలించి.. సూప‌ర్ టెక్‌, నొయిడా అథారిటీలు కుమ్మ‌క‌య్యాన‌ని గుర్తించి.. ఆ జంట ట‌వ‌ర్ల‌ను నేల‌మ‌ట్టం చేయాల‌ని తీర్పునిచ్చింది.

మ‌హారాష్ట్ర‌కు చెందిన ఎడిఫీస్ సంస్థ కంట్రోల్డ్ ఇంప్లోష‌న్ ప‌రిజ్ఞానం సాయంతో సూప‌ర్‌టెక్ ట్విన్ ట‌వ‌ర్ల‌ను కూల్చివేసింది. ఈ ప‌రిజ్ఞానం సాయంతో ప్ర‌ప్ర‌థ‌మంగా 1773లో ఐర్లాండ్లో ఒక క్యాథ‌డ్ర‌ల్‌ని నేల‌మ‌ట్టం చేశారు. అప్ప‌ట్లో 60 కిలోల పేలుడు ప‌దార్థాల్ని వినియోగించారు. అదే టెక్నాల‌జీ సాయంతో కేర‌ళ‌లోని కోచిలో 2020లో నాలుగు అపార్టుమెంట్ల‌ను కూల్చివేశారు. తాజాగా, నొయిడాలో నల‌భై అంత‌స్తుల ఎత్తు గ‌ల రెండు ట‌వ‌ర్లు ఎనిమిది సెక‌న్ల‌లో కూలిపోవ‌డాన్ని చూశాం. ఇందుకోసం ఎడిఫీస్ ఇంజినీరింగ్ సంస్థ దాదాపు ఏడు నెల‌ల పాటు ప‌ని చేసింది. ఈ కూల్చివేత కార‌ణంగా ఎన‌భై వేల ట‌న్నుల క‌న్‌స్ట్ర‌క్ష‌న్ వ్య‌ర్థాలు ఉత్ప‌త్తి అయ్యాయి. ఇందులో 55 వేల ట‌న్నుల్ని ఆయా సైటును ఫిల్లింగ్ చేయ‌డానికి వినియోగిస్తారు. మిగ‌తా మొత్తాన్ని క‌న్ స్ట్ర‌క్ష‌న్ అండ్ డెమాలిష‌న్ యూనిట్ల‌కు రీ సైక్లింగ్ కోసం పంపిస్తారు.

This website uses cookies.