నేను తోపుని.. నన్నేం చేస్తారు.. నేను రంగంలోకి దిగానంటే ఎవరైనా అడ్డు చెబుతారా.. మనం ఒక మాట చెబితే అధికారులైనా గప్ చుప్ గా వినాల్సిందే.. చెప్పిన పని చేయాల్సిందే.. అని అనుకున్నాడనుకుంటా ఆ బడా డెవలపర్. దేశంలోనే పేరుమోసిన బిల్డర్. అధికారానికి దగ్గరగా ఉన్నప్పుడు ఎంత విర్రవీగినా.. అంతిమంగా గెలిచేది న్యాయమే. కాకపోతే, కాస్త ఆలస్యం కావొచ్చు. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తే ఏదో ఒక రోజు అమాంతం కింద పడిపోవడం ఖాయం. ఈ విషయాన్ని ప్రతిఒక్క బిల్డర్ తప్పకుండా గుర్తు పెట్టుకోవాలి. ముఖ్యంగా, ట్విన్ టవర్స్ వంటి నిర్మాణాలు దేశంలో ఎక్కడున్నా.. అలాంటి వాటిలో కొనకుండా బయ్యర్లు జాగ్రత్తపడాలి. లేకపోతే ఏమవుతుందో తెలుసా?
ట్విన్ టవర్స్.. మొత్తం 7.5 లక్షల చదరపు అడుగుల నిర్మాణాలు.. రూ.1200 కోట్ల విలువైన 915 ఫ్లాట్లు.. 103 మీటర్లు, 97 మీటర్ల పొడువుతో 40 అంతస్తుల్లో నిర్మితమైన రెండు టవర్లు.. నలుగురు వ్యక్తులు పదేళ్లకు పైగా చేసిన పోరాటంతో పదంటే పదే సెకన్లలో నేలమట్టం కానున్నాయి. ఇదీ నోయిడాలో సూపర్ టెక్ సంస్థ అక్రమంగా నిర్మించిన జంట టవర్ల కథ.
ట్విన్ టవర్ల కూల్చివేతకే రూ.20 కోట్లు వెచ్చిస్తున్న ఈ ట్విన్ టవర్లకు ఈ పరిస్థితి ఎందుకొచ్చింది? బిల్డర్, అధికార యంత్రాంగం లాలూచీ పడకుండానే ఇంత పెద్ద టవర్లు వెలిసే అవకాశం లేదు. ఈ నిర్మాణాల కూల్చివేతకు ఆదేశాలిచ్చిన సుప్రీంకోర్టు ఇదే అంశాన్ని ప్రస్తావించింది. నోయిడా అథారిటీ అధికారుల అనుమతి లేకుండా ఇంత పెద్ద నిర్మాణం సాధ్యం కాదని వ్యాఖ్యానించింది. ఈ నేపథ్యంలో నోయిడా అథార్టీ తీరుపై పలు సందేహాలు వ్యక్తం చేసింది.
ఈ నిర్మాణాలకు అనుమతి ఇచ్చిన అధికారులపై విచారణ జరపాలని ఆదేశించింది. దీంతో యూపీ ప్రభుత్వం ఆ మేరకు దర్యాప్తు చేపట్టి.. 26 మంది అధికారులను గుర్తించింది. ఈ పరిణామాలను చూస్తుంటే.. భవన నిర్మాణాల్లో బిల్డర్లు, అధికారులు లాలూచీ పడితే ఈ రోజు కాకుంటే రేపైనా విచారణ ఎదుర్కోక తప్పదని అర్థమవుతోంది. అటు సుప్రీంకోర్టు తీర్పు, ఇటు ప్రభుత్వ చర్యలు ఎలాంటి ఉల్లంఘనులనూ సహించేది లేదనే సందేశాన్ని పంపుతున్నాయి. నోయిడా జంట టవర్ల ఉదంతం బిల్డర్లకు, అధికారులకు ఓ గుణపాఠం వంటిది. ఇకపై అయినా, ప్రజా ప్రయోజనాలే పరమావధిగా అటు బిల్డర్లు, ఇటు అధికారులు మరింత జవాబుదారీతో పారదర్శకంగా వ్యవహరించాలి.
జంట టవర్ల కూల్చివేత సందర్భంగా ఆగస్టు 28న ఆ ప్రాంతంలో డ్రోన్లు ఎగరడంపై నిషేధం విధించారు. ట్విన్ టవర్ల ముందు వైపు 450 మీటర్లు, వెనుక వైపు 250 మీటర్ల ప్రాంతాన్ని నిషేధిత జోన్ గా ప్రకటించారు. కూల్చివేత సమయంలో ఆ ప్రాంతంలోకి మనుషులు, జంతువులు, వాహనాలు వేటినీ అనుమతించరు. అలాగే ఈ నిషేధిత జోన్ లో డ్రోన్లను కూడా అనుమతించారు. ఆ జోన్ బయట డ్రోన్లను వినియోగించాలంటే పోలీసులు అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలి. ఇక కూల్చివేత సందర్భంగా ఆగస్టు 28న మధ్యాహ్నం 2.15 గంటల నుంచి 2.45 గంటల వరకు నోయిడా-గ్రేటర్ నోయిడా ఎక్స్ ప్రెస్ వేను మూసివేస్తారు.
This website uses cookies.