తెలంగాణ రాష్ట్ర ప్రజలు మూడోసారి జరిగిన ఎన్నికల్లో బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని తిరస్కరించినా.. హైదరాబాద్ అభివృద్ధి గురించి ఆయా ప్రభుత్వం పక్కా ప్రణాళికల్ని రచించింది. భవిష్యత్తులో చేయాల్సిన కార్యక్రమాల పట్ల స్పష్టత ఉండేది. మరి, కొత్తగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రణాళికల్ని యధావిధిగా అమలు చేస్తుందా? లేక సరికొత్త వ్యూహాలతో అడుగు ముందుకేస్తుందా?
ఒకసారి చరిత్రను గమనిస్తే.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వం మారగానే.. తెదేపా ప్రణాళికల్ని వైఎస్సార్ ప్రభుత్వం అమలు చేసింది. ఆతర్వాతి కిరణ్ కుమార్ రెడ్డి కాంగ్రెస్ ప్రణాళికల్లోనే నడిచారు. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిన తర్వాత అధికారంలోకి వచ్చిన బీఆర్ఎస్ ప్రభుత్వం.. హైదరాబాద్ అభివృద్ధిని యధావిధిగా కొనసాగించింది. 2018 తర్వాత నెక్ట్స్ లెవెల్‌కి తీసుకెళ్లింది. ఇటీవల ఏర్పాటైన కాంగ్రెస్ ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రణాళికల్ని కొనసాగిస్తుందా? లేక కొత్త ప్రణాళికల్ని రచిస్తుందా? అనే సందేహం తెలంగాణ రియల్ రంగంలో నెలకొంది. ముఖ్యంగా, హైదరాబాద్ మెట్రో రైలు విస్తరణ గురించి బీఆర్ఎస్ ప్రభుత్వం వద్ద స్పష్టమైన ప్రణాళికలుండేవి. రాయదుర్గం నుంచి శంషాబాద్ ఎయిర్‌పోర్టు దాకా సెకండ్ ఫేజ్ మెట్రో రైలు పనుల్ని కూడా సీఎం కేసీఆర్ ఆరంభించారు. ఆ తర్వాతి ఫేజుల గురించి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వివరించారు. మరి, కొత్త ప్రభుత్వం మెట్రో రైలు ప్రాజెక్టును కొనసాగిస్తుందా? లేక నిలిపివేస్తుందా? అనే సందేహం సర్వత్రా వ్యక్తమవుతుంది. కాబట్టి, ఈ ప్రాజెక్టు గురించి కాంగ్రెస్ ప్రభుత్వం స్పష్టమైన విధానాన్ని వెల్లడించాల్సిన అవసరముంది.
కోకాపేట్, బుద్వేల్..
కోకాపేట్, బుద్వేల్ వంటి ప్రాంతాల్లో హెచ్ఎండీఏ వేలం పాటల్ని నిర్వహించిన విషయం తెలిసిందే. మరి, కొత్త ప్రభుత్వం గత ప్రభుత్వం తరహాలో వేలం పాటల్ని కొనసాగిస్తుందా? లేక ఆయా ప్రాంతాల్లోని భూముల్ని వేలం వేయకుండా.. మధ్యతరగతి ప్రజానీకం కోసం అఫర్డబుల్ లగ్జరీ గృహాల్ని నిర్మిస్తుందా? అనే అంశం గురించి క్లారిటీ ఇవ్వాలి.
బీజింగ్ తరహాలో..
చైనాలోని బీజింగ్ తరహాలో 332 కిలోమీటర్ల రీజినల్ రింగ్ రోడ్డును ఔటర్ రింగ్ రోడ్డుతో పాటు ఇన్నర్ రింగ్ రోడ్డును అనుసంధానం చేయాలన్నది గత ప్రభుత్వ ప్రణాళిక. మరి, సీఎం రేవంత్ రెడ్డి ఎన్నికల ప్రచారంలో మాట్లాడుతూ.. ఔటర్ రింగ్ రోడ్డు వరకూ అర్బన్ తెలంగాణ పాలసీ, ఓఆర్ఆర్ నుంచి రీజినల్ రింగ్ రోడ్డు దాకా సెమీ అర్బన్ పాలసీ, అక్కడ్నుంచి తెలంగాణ సరిహద్దు వరకూ రూరల్ పాలసీలను ఏర్పాటు చేస్తామని వివరించారు. ఇందుకు సంబంధించి ఒక స్పష్టమైన విధానాన్ని ఏర్పాటు చేస్తే మేలని నిర్మాణ రంగం భావిస్తోంది.
ఇలా చెప్పుకుంటూ వెళితే.. హైదరాబాద్ అభివృద్ధి గురించి బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన విధానాల్ని.. అమలు చేయాలనుకున్న ప్రణాళికల్ని కాంగ్రెస్ గవర్నమెంట్ కొనసాగిస్తుందా? లేదా తమదైన శైలిలో ఆలోచించి నిర్ణయం తీసుకుంటుందా? అనే అంశం అతిత్వరలో తెలుస్తుంది.