అన్ని రంగాల్లో పోటీపడుతున్న మహిళలు.. ఇళ్ల కొనుగోలులోనూ కీలకపాత్ర పోషిస్తున్నారు. దేశంలో ఇళ్లు కొంటున్న మహిళల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. మరి 2024లోనూ ఈ ట్రెండ్ కొనసాగుతుందా? వచ్చే ఏడాది మహిళా కొనుగోలుదారులు మరింతగా పెరుగుతారా? అంటే ఔననే అంటున్నారు. ఇందుకు అనేక కారణాలు ఉన్నాయని చెబుతున్నారు. ముఖ్యంగా మహిళా రుణ గ్రహీతలకు గృహ రుణ వడ్డీ రేట్లపై రాయితీ లభిస్తోంది. ఇవి ఒక్కొక్కరికీ ఒక్కోలా ఉండొచ్చు. సాధారణంగా ప్రామాణిక గృహ రుణ వడ్డీ రేట్లపై 0.05 శాతం నుంచి 0.10 శాతం వరకు మహిళా రుణ గ్రహీతలకు రాయితీ లభిస్తుంది. అలాగే ప్రాంతం, రాష్ట్రాన్ని బట్టి మహిళా రుణ గ్రహీతలకు స్టాంపు డ్యూటీ చార్జీలపై కూడా ఒక శాతం నుంచి 2 శాతం వరకు తగ్గింపు ఇస్తున్నారు.
ఆర్థిక విషయాల్లో లింగ సమానత్వాన్ని ప్రోత్సహించడానికి, రియల్ ఎస్టేట్ లో మహిళలు పెట్టుబడి పెట్టడాన్ని పెంచడానికి ఈ రాయితీలు అమలు చేస్తున్నారు. మహిళలకు అధిక రుణ అర్హత, తక్కువ వడ్డీ రేట్లు, పలు పన్ను ప్రయోజనాలు అందుబాటులో ఉన్నాయి. ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద స్త్రీల వైవాహిక స్థితితో సంబంధం లేకుండా బలహీన వర్గాలు, దిగువ ఆదాయ సమూహం (ఎల్ఐజీ)లోని మహిళలకు 6.5 శాతం వడ్డీ రాయితీని అందిస్తున్నారు. ఈ నేపథ్యంలో వచ్చే ఏడాది కూడా మహిళా కొనుగోలుదారుల సంఖ్య పెరుగుతుందని అంచనా వేస్తున్నారు.