Categories: TOP STORIES

ఆర్థిక మంత్రి ఆదుకుంటారా?

కోవిడ్ మహమ్మారి నుంచి ప్రపంచ ఆర్థిక వ్యవస్థ బయటపడి కొత్త సవాళ్లను ఎదుర్కొంటున్న తరుణంలో.. కేంద్రం ఫిబ్రవరి ఒకటో తేదీన పార్లమెంటులో 2023-24 సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్ ను ప్రవేశపెట్టనుంది. ప్రపంచం మాంద్యం ఒత్తిళ్లను ఎదుర్కొంటున్నప్పటికీ, మన ఆర్థిక వ్యవస్థ మెరుగైన పని తీరును కనబరుస్తోంది. ఈ కారణంగా 2023లో దేశ జీడీపీ 6.8 శాతానికి చేరుకునే అవకాశముందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇక రియల్ ఎస్టేట్ విషయానికి వస్తే గత రెండేళ్ల ఒడుదొడుకుల తర్వాత బలమైన వృద్దిలోనే కొనసాగుతున్నట్టు రుజువైంది.

అయితే, హౌసింగ్ రుణాలపై వడ్డీ రేట్లు పెరగడం, పెరిగిన ద్రవ్యోల్బణం వంటి వాటిపై బడ్జెట్ దృష్టి సారించే అవకాశం ఉంది. అందుబాటు ధరల గృహాల డిమాండ్ ను పెంచే చర్యలు చేపట్టడం, స్టార్టప్ కమ్యూనిటీకి ప్రోత్సాహకాలు ఇవ్వడం, రియల్ ఎస్టేట్ లో సుస్థిరతను ప్రోత్సహించడం వంటిపై బడ్జెట్ దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. 2022లో రియల్ రంగంలో డిమాండ్ ఉల్లాసంగా ఉండగా.. 2023లో కూడా ఆ ఊపు కొనసాగుతుందని నిర్ధారించుకోవడానికి 2023 బడ్జెట్ ఉద్దీపన అందిస్తుందని పలువురు ఆశిస్తున్నారు.

‘రాబోయే బడ్జెట్ చాలా అంచనాలున్న బడ్జెట్. పెరుగుతున్న వడ్డీ రేట్లు సరసమైన, మధ్య తరగతి రెసిడెన్షియల్ విభాగాల్లో డిమాండ్ ను తగ్గిస్తున్నాయి. ఈ నేపథ్యంలో వడ్డీపై పన్ను మినహాయింపు పరిమితిని రూ.2 లక్షల నుంచి రూ.3-4 లక్షలకు పెంచాలి. నివసించడానికి కొనే ఇల్లు, అద్దె ఇళ్లపై ఎలాంటి పరిమితి విధించకూడదు. వడ్డీ తగ్గింపులో పెంపు గృహ కొనుగోలుదారులను రియల్ ఎస్టేట్ లో పెట్టుబడి పెట్టేలా ప్రోత్సహిస్తుంది. మార్కెట్లో డిమాండ్ ను పెంచుతుంది. వాణిజ్యపరంగా రీట్లలో రూ. 50 వేల పెట్టుబడుల నుంచి సెక్షన్ సి కింద మినహాయింపు ఇస్తే చాలామందికి ఊరటగా ఉంటుంది’ అని నిపుణులు అంటున్నారు.

 

బడ్జెట్ లో రియల్ రంగానికి ఏం కావాలి?

  • సెక్షన్ 80 ఐబీఏ కింద సరసమైన ప్రాజెక్టులకు 100 శాతం ట్యాక్స్ హాలిడేను కొనసాగించాలి. ఇది గతేడాది మార్చి 31 వరకే ఉంది.
  • సెక్షన్ 80 సి కింద గృహ రుణం మొత్తాన్ని తిరిగి చెల్లించడానికి ప్రత్యేక మినహాయింపు ఉండాలి. ప్రస్తుతం హౌసింగ్ లోన్ ప్రిన్సిపల్ రీపేమెంట్ కోసం పన్ను మినహాయింపు రూ.1.50 లక్షల వరకు మాత్రమే ఉంది. ఈ సెక్షన్ కింద పన్ను పరిమితిని రూ.5 లక్షలకు పెంచాలి.
  • ప్రపంచ పరిణామాల నేపథ్యంలో నిర్మాణ సామగ్రి ధరలు పెరగడంతో ఇన్ పుట్ వ్యయం కూడా పెరిగింది. ఈ నేపథ్యంలో సిమెంట్ వంటి వాటిపై జీఎస్టీ తగ్గించాలి.
  • మరిన్ని పెట్టుబడులను ఆకర్షించడానికి రీట్లకు పన్ను ప్రయోజనాల్ని కల్పించాలి.
  • స్టార్టప్ సెంట్రిక్ కార్యక్రమాలను విరివిగా అమలు చేయాలి. ఇన్ పుట్ ఖర్చులు తగ్గించగల, లిక్విడిటీని పెంపొందించే నిర్ధిష్ట ఉప రంగాలకు ఆర్థిక ప్రోత్సాహకాలను కల్పించాలి. స్టార్టప్ ఇండియా స్కీమ్ కింద అర్హత సాధించిన సంస్థల కోసం జీఎస్టీ నమోదు చేసుకోవడం, ఎంఎస్ఎంఈ పత్రాలు పొందడం, పన్ను దాఖలు సంఖ్య, పన్ను స్లాబ్ లు మొదలైనవాటిని సింగిల్ విండో క్లియరెన్స్ వ్యవస్థ ద్వారా పూర్తి చేయాలి.
  • హరిత, సుస్థిర భవనాల అభివృద్ధికి కట్టుబడి ఉన్న కంపెనీలకు ప్రభుత్వం ప్రోత్సాహాకాాల్ని ఇవ్వాలి. హరిత భవనాల నిర్మాణంలో ఉన్న డెవలపర్లకు 15 ఏళ్ల బ్లాక్ లో వరుసగా పదేళ్ల పాటు ఆదాయ పన్ను నుంచి మినహాయింపు పొందే అవకాశం ఉంది. అలాగే గత బడ్జెట్ లో ప్రకటించిన సావరిన్ గ్రీన్ బాండ్లను 2023లో మరింతగా పెంచాలి.
  • లాజిస్టిక్స్ ఖర్చులు తగ్గించడానికి, ఎలక్ట్రానిక్ వాహనాలకు రాయితీ పొడిగించడానికి బడ్జెట్ లో అవకాశం ఉంది. పబ్లిక్, ప్రైవేటు భాగస్వామ్య పద్ధతిలో కనెక్టివిటీ ప్రాజెక్టులు, లాజిస్టిక్స్, మౌలిక వసతులను అభివృద్ధి చేయడంలో మరిన్ని పెట్టుబడులను ఆకర్షించే జాతీయ లాజిస్టిక్స్ విధానంతో బడ్జెట్ ను సర్దుబాటు చేయాలి.

This website uses cookies.