వివాదాస్పద జీవో నెం,145 నుంచి ఏపీ సర్కారు వెనక్కి తగ్గింది. 2021 డిసెంబర్లో జారీ చేసిన ఈ జీవోను తాజాగా ఉపసంహరించుకుంది. ఈ జీవో ప్రకారం ప్రైవేటు రియల్టర్లు అభివృద్ధి చేసే లేఔట్లలో 5 శాతం భూమిని ప్రభుత్వానికి ఇవ్వవలసి ఉంటుంది. అలా సేకరించిన భూమిని పేదల ఇళ్ల స్థలాల కోసం సర్కారు వినియోగిస్తుంది. తద్వారా రాష్ట్రంలో వీలైనంత ఎక్కువ మంది పేదలకు ఇళ్లను అందించాలనేది ప్రభుత్వ ఉద్దేశం. ప్రైవేటు రియల్టర్ల ప్రాజెక్టుల్లో 5 శాతం భూమిని తీసుకుని సంబంధిత జిల్లా కలెక్టర్లకు అప్పగించాలని మున్సిపల్ అధికారులను ప్రభుత్వం ఆదేశించింది.
ఒకవేళ ఆ లేఔట్ లో భూమి ఇవ్వడం వీలుకాని పక్షంలో ఆ సైట్ నుంచి మూడు కిలోమీటర్ల పరిధిలో స్థలమైనా ఇవ్వవచ్చు. లేకుంటే ఆ మేరకు డబ్బులు కూడా సర్కారుకు చెల్లించే అవకాశం ఇచ్చారు. అయితే, ఈ జోవోపై ఆది నుంచి విమర్శలు వ్యక్తమయ్యాయి. దీనివల్ల తమ ప్రాజెక్టు వ్యయం పెరుగుతుందని, అది తమకు నష్టదాయకమని పలువురు బిల్డర్లు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం కూడా పునరాలోచనలో పడింది. జీవో జారీ ఉద్దేశం ఆశించిన ఫలితాలు ఇవ్వకపోగా.. రియల్ రంగం స్తబ్దుగా మారిన వైనాన్ని గుర్తించింది. దీంతో జీవో నెం.145ని వెనక్కి తీసుకుంది. ఫలితంగా ఏపీలోని బిల్డర్లకు భారీ ఊరట లభించినట్టయింది.
జీవో నెం. 145ని ఏపీ సర్కారు ఉపసంహరించుకోవడంపై ఏపీ క్రెడాయ్ హర్షం వ్యక్తం చేసింది. ఈ నిర్ణయం రియల్ ఎస్టేట్ రంగానికి ఎంతో మేలు చేస్తుందని, ప్రభుత్వానికి కూడా ఆదాయపరంగా లబ్ధి చేకూరుతుందని క్రెడాయ్ ఏపీ చైర్మన్ ఎస్.వెంకట్రామయ్య, అధ్యక్షుడు బి.రాజా శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి కేఎస్ సీ బోస్ ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ఈ జీవో కారణంగా ఎదురయ్యే సమస్యలను సీఎం జగన్, మంత్రి ఆదిమూలపు సురేశ్ లకు వివరించామని వెల్లడించారు. ఈ నేపథ్యంలో ఈ జీవోను వెనక్కి తీసుకున్నందుకు సీఎం జగన్ కు ధన్యవాదాలు తెలిపారు.
This website uses cookies.