Categories: TOP STORIES

ఈసారైనా ఇండస్ట్రీ హోదా ద‌క్కేనా?

కేంద్ర బడ్జెట్ పై కొండంత ఆశలు

లోక్ సభ ఎన్నికలు ముగిసి కేంద్రంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని ప్రభుత్వం కొలువుదీరింది. 2024-25 సంవత్సరానికి సంబంధించి జూలై 22న లోక్ సభలో బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. దీనిపై చాలా వర్గాలు భారీగానే ఆశలు పెట్టుకున్నాయి. పన్ను మినహాయింపులు లభిస్తాయని.. ఇతరత్రా రాయితీలు ఉంటాయని ఆశల పల్లకీలో ఊగిసలాడుతున్నారు. అయితే, రియల్ ఎస్టేట్ కు సంబంధించి ఎన్నాళ్ల నుంచో పెండింగ్ లో ఉన్న పరిశ్రమ హోదా డిమాండ్ ఈసారైనా దక్కుతుందా అనే చర్చ సాగుతోంది. కరోనా తర్వాత దారుణంగా పడిపోయిన అందుబాటు ధరల ఇళ్ల విభాగాన్ని పునరుద్ధరించే చర్యలు తీసుకుంటుందా లేదా అనే ప్రశ్నలు కూడా తలెత్తుతున్నాయి.

2024లో ఇప్పటివరకు దేశంలోని ఏడు ప్రధాన నగరాల్లో ఇళ్ల అమ్మకాలు, కొత్త లాంచ్ లు కొత్త శిఖరాలకు వెళ్లాయి. 2023-24లో ఇళ్ల అమ్మకాలు రికార్డు స్థాయిలో 4.93 లక్షల యూనిట్లకు చేరుకోగా.. కొత్తగా 4.47 లక్షల యూనిట్లు లాంచ్ అయ్యాయి. సమీప భవిష్యత్తులో కూడా ఇదే ఒరవడి కొనసాగే అవకాశం కనిపిస్తోంది. అయితే, మధ్యస్థ, ప్రీమియం హౌసింగ్ ఇళ్ల అమ్మకాలు మాత్రమే బాగా సాగుతున్నాయి. అయితే, భారత్ లో తక్కువ ఆదాయం ఉన్న వ్యక్తులే ఎక్కువగా ఉన్న నేపథ్యంలో అందుబాటు ధరల ఇళ్ల విభాగం కూడా ఇదే దూకుడుతో కొనసాగాలి. అనరాక్ డేటా ప్రకారం.. కోవిడ్ తర్వాత అందుబాటు ధరల ఇళ్ల అమ్మకాలు తగ్గుముఖం పట్టాయి.

2019లో ఇవి 38 శాతం ఉండగా.. 2022లో 26 శాతానికి తగ్గాయి. 2024 క్యూ1లో 20 శాతానికి పడిపోయాయి. వీటికి డిమాండ్ తగ్గిన నేపథ్యంలో సరఫరా సైతం తగ్గిపోయింది. 2019లో వీటి వాటా 40 శాతం ఉండగా.. 2024 క్యూ1లో 18 శాతానికి తగ్గిపోయింది. అందుబాటు ధరల ఇళ్ల విభాగానికి సంబంధించి అటు కొనుగోలుదారులు, ఇటు డెవలపర్లకు ఇచ్చిన రాయితీలు గత రెండేళ్లలో ముగిసిపోయాయి. ఈ నేపథ్యంలో కీలకమైన ఈ విభాగానికి మళ్లీ రాయితీలు ఇవ్వాల్సిన అవసరం ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అలాగే పీఎంఈవై కింద క్రెడిట్ లింక్డ్ సబ్సిడీ పథకం కూడా పునరుద్ధరించాలని కోరుతున్నారు.

డెవలపర్లకు సెక్షన్ 80-ఐబీఏ కింద కింద వంద శాతం పన్ను రాయితీని మళ్లీ తీసుకురావాలని అంటున్నారు. దీనివల్ల డెవలపర్లు అందుబాటు ధరల ఇళ్లను ఆరంభిస్తారని.. కొనుగోలుదారులకూ భారం తగ్గుతుందని చెబుతున్నారు. మరోవైపు అందుబాటు ధరల ఇళ్ల పరిమాణం, ధరలను సవరించాల్సిన అవసరం ఉందనే వాదనలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం నాన్ మెట్రోపాలిటన్ నగరాల్లో అందుబాటు ధరల ఇళ్లు అంటే 90 చదరపు మీటర్ల కార్పెట్ ఏరియా ఉండాలి. అదే పెద్ద నగరాల్లో 60 చదరపు మీటర్ల కార్పెట్ ఏరియా ఉండాలి. రెండు చోట్లా వీటి ధర రూ.45 లక్షలకు మించకూడదు.

అయితే, ప్రస్తుత పరిస్థితుల్లో ఇది సరికాదనే వాదనలు వినిపిస్తున్నాయి. 60 చదరపు మీటర్ల కార్పెట్ ఏరియా అంగీకారమే అయినప్పటికీ, రూ.45 లక్షల పరిమితి కుదరదని పేర్కొంటున్నారు. ముంబై వంటి నగరంలో రూ.45 లక్షలకు ఏమీ రాదని.. అందువల్ల ఈ పరిమితిని రూ. 85 లక్షలకు పెంచాలని సూచిస్తున్నారు. మిగిలిన నగరాల్లో దీనిని కనీసం రూ. 60-65 లక్షలు చేయాలని చెబుతున్నారు. మరి ఈ బడ్జెట్ లో కేంద్ర ప్రభుత్వం ఈ దిశగా నిర్ణయం తీసుకుంటుందా లేదా అనేది వేచి చూడాలి.

This website uses cookies.