Categories: TOP STORIES

ట్రిపుల్ ఆర్ చేరువ‌లో స‌రికొత్త లేఅవుట్లు..

కొత్తూరులో ల్యాండ్ పూలింగ్‌

మూడు జిల్లాల్లో భూసేక‌ర‌ణ‌

924.28 ఎక‌రాల్లో లేఅవుట్లు

నాద‌ర్‌గుల్‌లో న‌యా లేఅవుట్‌

సొంతిల్లు ప్రతి ఒక్కరి కల. అందులోను హైదరాబాద్ లో ఇల్లు కావాలని చాలా మంది కోరుకుంటారు. అయితే రోజు రోజుకూ పెరుగుతున్న ధరలతో.. సామాన్య, మధ్య తరగతి వారు సొంతింటివైపు అడుగులు వేయలేకపోతున్నారు. ఇలాంటి వారి కోసమే రీజినల్ రింగ్ రోడ్డు పరిసర ప్రాంతాల్లో.. హెచ్ఎండీఏ నివాస యోగ్యమైన లేఅవుట్లను అభివృద్ది చేయ‌డానికి ప్ర‌ణాళిక‌ల్ని ర‌చిస్తోంది. ప్రైవేట్ డెవలపర్లు సైతం వేల ఎకరాల్లో ఓపెన్ ప్లాట్ వెంచర్లతో పాటు నిర్మాణ ప్రాజెక్టులు చేపట్ట‌డానికి స‌న్నాహాలు చేస్తున్నారు. దీంతో, అందరికి అందుబాటు ధరల్లో ఇల్లు, ఇంటి స్థలం లభించే అవకాశం ఉందని రియల్ రంగ నిపుణులు చెబుతున్నారు.

హైదరాబాద్ మెట్రో డెవలప్మెంట్ అధారిటీ ట్రిపుల్ ఆర్ పరిసరాల్లో నివాస యోగ్యమైన వెంచర్లను అభివృద్ది చేస్తోంది. ప్రధానంగా ఔటర్ రింగ్ రోడ్డు, రీజినల్ రింగ్ రోడ్డుకు మధ్యలో నివాస యోగ్యమైన ప్రాంతాలను గుర్తించి రైతులను నుంచి ల్యాండ్ పూలింగ్ ద్వారా సేకరించి ఓపెన్ ప్లాట్ వెంచర్లను డెవలప్ చేస్తోంది హెచ్ఎండీఏ. ఈ క్రమంలో బెంగళూరు జాతీయ రహదారిపై ఉన్న కొత్తూరుకు సమీపంలో ఇన్ముల్‌నెర్వలో 95.25 ఎకరాలు, లేమూరులో 83.48 ఎకరాల్లో లేఅవుట్‌ ను అభివృద్ధి చేసింది. ల్యాండ్‌ పూలింగ్‌లో భాగంగా రంగారెడ్డి, సంగారెడ్డి, మేడ్చల్‌-మల్కాజిగిరి పరిధిలో సుమారు 924.28 ఎకరాలను అధికారులు సేకరించగా లేఆవుట్లకు రంగం సిద్దమవుతోంది.

అటు చౌటుప్పల్‌ మండలంలోని దండు మల్కాపూర్‌, బోగారం, ప్రతాప సింగారం, నాదర్‌గుల్‌ తదితర ప్రాంతాల్లో అతిపెద్ద లేఅవుట్లను అభివృద్ది చేస్తున్నారు. ఇక్కడ పూర్తి స్థాయిలో వెంచర్ ను అభివృద్ది చేసి, మౌలిక వసతులు కల్పిస్తున్నారు. అందరికి అందుబాటు ధరలో ఉండేలా ప్లాట్లను అందించేందుకు హెచ్ఎండీఏ సిద్ధ‌మ‌వుతున్న‌ది. ఇందులో 150, 200 గజాల నుంచి ఆపైన పరిమాణంలో ప్లాట్లు సిద్ధం చేస్తున్నార‌ని స‌మాచారం. ఔటర్ రింగ్ రోడ్డు, ప్రతిపాదిత రీజినల్ రింగ్ రోడ్డు మధ్య సుమారు 20 వేల ఎకరాల్లో ఓపెన్ ప్లాట్ వెంచర్ల అభివృద్ది జరుగుతోందని రియాల్టీ నిపుణులు చెబుతున్నారు. ఇక్కడ కేవలం ఓపెన్ ప్లాట్ వెంచర్లే కాకుండా నిర్మాణ ప్రాజెక్టులు సైతం భారీగా వస్తున్నాయి.

This website uses cookies.