భారతదేశం దేశీయ, అంతర్జాతీయ పెట్టుబడులకు భారీ అవకాశాలను కలిగి ఉంది. ఇటీవల స్టార్టప్ లు, వ్యవస్థాపక వ్యవహారాల్లో చక్కని పురోగతి సాధించింది. ఇది మన ఆర్థిక వ్యవస్థను ఆరోగ్యకరమైన అభివృద్ధి వైపు నడిపించింది. మరి కొత్త సంవత్సరంలో ఇదే పరిస్థితి ఉంటుందా? 2023లో ఆర్థిక ట్రెండ్ ఎలా ఉంటుందో చూద్దామా?
2023లో మన వృద్ధి రేటు మందగిస్తుందని అంచనా. దేశ జీడీపీ 2021, 2022 మధ్య 8.7 శాతంతో వృద్ధి చెందింది అయితే, 2023లో వృద్ధిని కొనసాగించినప్పటికీ, అది మందగించే అవకాశం ఉంది. 2023లో వృద్ధి రేటు 6.9 శాతం ఉంటుందని అంచనా వేసినా అది 5.9 శాతమే వృద్ధి చెందుతుందని గోల్డ్ మన్ సాక్స్ అంచనా. ఇక క్రిసిల్ అంచనా ప్రకారం దేశ వృద్ధి 2024లో 6 శాతానికి తగ్గుతుంది. ఇలాంటి నివేదికలన్నీ 2023లో దేశ వృద్ధి ఒక శాతం తగ్గుతుందని అంచనా వేస్తున్నాయి. అయితే, ఇదేమీ అంత ఆందోళన చెందాల్సిన విషయం కాదని నిపుణులు అంటున్నారు. ప్రపంచవ్యాప్తంగా పలు ఆర్థిక వ్యవస్థలు సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్నాయి. కొన్ని మాంద్యం ముప్పును ఎదుర్కొంటున్నాయి. కానీ మనదేశం ఇటీవలే ప్రపంచంలోని ఐదో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉన్న బ్రిటన్ ను అధిగమించింది.
రియల్ ఎస్టేట్ పరిశ్రమ విషయానికి వస్తే.. గత రెండేళ్లుగా రెసిడెన్షియల్, ఆఫీస్ స్పేస్ రెండింటికీ డిమాండ్ బాగా పెరిగింది. అదేవిధంగా దేశంలోని రియల్ పరిశ్రమ 2021లో 200 బిలియన్ డాలర్ల విలువకు చేరినట్టు అంచనా వేశారు. 2025లో దేశ జీడీపీలో ఇది 13 శాతం వాటా కలిగి ఉంటుందని చెబుతున్నారు. 2023, తర్వాతి సంవత్సరాల్లో రియల్ ఎస్టేట్ వృద్ధి వేగంగా కొనసాగుతుందని అంచనా వేస్తున్నారు. వ్యవసాయం తర్వాత దేశంలో ఎక్కవ మందికి ఉపాధి కల్పిస్తోంది రియల్ పరిశ్రమే.
మీడియా, గేమింగ్ కూడా చక్కని పురోగతి సాధించింది. డిజిటల్ గేమింగ్ మార్కెట్ 2020లో 1.02 బిలియన్ డాలర్ల విలువ కలిగి ఉండగా.. 2026 నాటికి అది 4.88 బిలియన్ డాల్లరకు చేరుతుందని అంచనా. ఇది ఏకంగా 20.83 శాతం వార్షిక వృద్ధి రేటును సూచిస్తోంది. వృద్ధి, పెట్టుబడి అవకాశాలకు సంబంధించి గేమింగ్ చాలా ఆశాజనకంగా ఉంది. ఇక దేశంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న మరో రంగం ఆన్ లైన్ ఎడ్యుకేషన్. వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా.. ఇది నిజం. ఇటీవల సంవత్సరాల్లో ఆన్ లైన్ విద్య గణనీయమైన వృద్ధి సాధించింది. దీంతో అంతే స్థాయిలో విదేశీ పెట్టుబడులను ఆకర్షిస్తోంది. ప్రస్తుతం దేశంలో 4500 కంటే ఎక్కువ ఎడ్ టెక్ స్టార్టప్ లు పని చేస్తున్నాయి. 2026 నాటికి ఆన్ లైన్ విద్య పరిశ్రమ విలువ 11.6 బిలియన్ డాలర్లుగా అంచనా వేశారు.
This website uses cookies.