గత కొంతకాలం నుంచి సుమారు 150 అక్రమ నిర్మాణాల్ని హెచ్ఎండీఏ నేలమట్టం చేసింది. కొన్నింటిని సీజ్ కూడా చేసింది. అయితే, ఈ కట్టడాలు రాత్రికి రాత్రే కట్టినవి కాదు. స్థానిక మున్సిపల్ కమిషనర్లు, టౌన్ ప్లానింగ్ ఆఫీసర్లు, విజిలెన్స్ సిబ్బందికి తెలియకుండా ఇన్నిన్ని అక్రమ నిర్మాణాలు పుట్టుకొచ్చే అవకాశమే లేదు. వీరి చేతికి ఆమ్యామ్యాలు ముట్టనిదే నిర్మాణాలు అడ్వాన్స్ స్టేజీకి చేరుకునేవా? ముఖ్యంగా, తూముకుంటలో సుచిరిండియా సంస్థ క్లబ్ హౌజ్ నిర్మాణం పూర్తయ్యి ఏకంగా రంగులూ వేశారు.
ప్రారంభోత్సవానికి సిద్ధంగా ఉన్న ఈ క్లబ్ హౌజ్ ని కేవలం సీజ్ చేశారు. మరి, ఈ ఒక్క నిర్మాణాన్ని కేవలం సీజ్ చేసి ఎందుకు వదిలేశారు? దీన్ని నేలమట్టం చేస్తారా? లేదా ఎప్పటిలాగే లంచం తీసుకుని వదిలేస్తారా? అలా చేస్తే గనక హెచ్ఎండీఏ చేస్తున్న ప్రయత్నమంతా వ్యర్థం అవుతుంది. భవిష్యత్తులో అక్రమ నిర్మాణాలు పుట్టుకొస్తూనే ఉంటాయి.
ప్రస్తుతం హెచ్ఎండీఏ పరిధిలో 150 దాకా అక్రమ నిర్మాణాల్ని కూల్చివేశామని పురపాలక శాఖ ఎంతో గొప్పగా చెప్పుకుంటున్నది. వీటి కూల్చివేత వల్ల జాతి సంపద ఎంత వ్యర్థమైందో అర్థం చేసుకోవచ్చు. మరి, ఇలా సహజ వనరులు వృథా కాకుండా ఉండాలంటే పురపాలక శాఖ అధికారులు అక్రమ నిర్మాణాల్ని కట్టకుండా ముందే అడ్డుకట్ట వేసి ఉంటే బాగుండేది. ఇంత బహిరంగంగా అక్రమ కట్టడాలు కడుతుంటే కళ్లగప్పించి చూసిన మున్సిపల్ అధికారుల మీద కఠిన చర్యల్ని తీసుకోవాలి. అప్పుడే, వీరంతా సక్రమంగా తమ కర్తవ్యాన్ని నిర్వర్తిస్తారు.
తూముకుంట, పీర్జాదిగూడ, మణికొండ, ఘట్ కేసర్, నార్సింగి, నిజాంపేట్.. వంటి పట్టణ స్థానిక సంస్థల్లో కూల్చివేసిన అక్రమ నిర్మాణాలు ఎప్పుడు ఆరంభయ్యాయి? అప్పుడు కమిషనర్ ను సస్పెండ్ చేయాలి. అక్కడి టౌన్ ప్లానింగ్ మరియు విజిలెన్స్ అధికారులకు షోకాజ్ నోటీసులిచ్చి జరిమానా విధించాలి. అనుమతులు ఆలస్యమైతే అధికారుల మీద జరిమానా విధిస్తామని పదేపదే చెప్పిన మంత్రి కేటీఆర్.. ఇలాంటి అధికారుల మీద జరిమానా తప్పకుండా విధించాలి. లేకపోతే, ఇలాగే అక్రమ నిర్మాణాలు పుట్టుకొస్తూనే ఉంటాయి. ఆయా కమిషనర్లు, టౌన్ ప్లానింగ్ ఆఫీసర్లు గతంలో పని చేసినప్పుడు అక్రమ నిర్మాణాలు కడుతుంటే ఇలాగే కళ్లప్పగించి చూశారా?ఒకవేళ అలాంటి రికార్డున్న వారిని తక్షణమే సస్పెండ్ చేయాలి.
This website uses cookies.