Categories: TOP STORIES

రిజిస్ట్రేష‌న్ ఛార్జీల‌ను 4 శాతానికి త‌గ్గించాలి!

తెలంగాణ బిల్డ‌ర్స్ ఫెడ‌రేష‌న్ విన్న‌పం

ఫిబ్ర‌వ‌రి 1 నుంచి భూముల మార్కెట్ విలువ‌ల్ని పెంచ‌డం స‌రైన నిర్ణ‌యం కాద‌ని.. దీని వల్ల చిన్న బిల్డ‌ర్ల మ‌నుగ‌డే ప్ర‌శ్నార్థ‌కంగా మారుతుంద‌ని.. అందుకే, విలువల పెంపుద‌ల నిర్ణ‌యాన్ని వెన‌క్కి తీసుకోవాల‌ని లేదా రిజిస్ట్రేష‌న్ ఛార్జీల‌ను నాలుగు శాతానికి త‌గ్గించాల‌ని తెలంగాణ బిల్డ‌ర్స్ ఫెడ‌రేష‌న్ ప్ర‌భుత్వాన్ని కోరింది. ఈ సంఘం ఏర్పాటు చేసిన విలేక‌రుల స‌మావేశంలో టీబీఎఫ్‌కు చెందిన ఏడు నిర్మాణ సంఘాల ప్ర‌తినిధులు పాల్గొన్నారు.

ఈ సంద‌ర్భంగా సంఘం అధ్య‌క్షుడు సీహెచ్ ప్ర‌భాక‌ర్ రావు మాట్లాడుతూ.. ఆరు నెల‌ల వ్య‌వ‌ధిలో రెండుసార్లు పెంపుద‌ల నిర్ణ‌యం తీసుకోవ‌డం వ‌ల్ల చిన్న బిల్డ‌ర్ల మ‌నుగడే ప్ర‌శ్నార్థ‌కంగా మారింద‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. ఎకరాల్లో ప్రాజెక్టుల్ని చేపట్టే పెద్ద కార్పొరేట్ సంస్థలను సంప్రదించి మార్కెట్ వాల్యూ పెంచాలనే నిర్ణయానికి ప్రభుత్వం రావడం సరైన నిర్ణయం కాదని విమర్శించారు. 600 నుంచి 1000 గజాల్లోపు కట్టేవారి వద్ద ఎక్కువ మంది సామాన్యులు సొంతిల్లు కొనుక్కుంటారని గుర్తు చేశారు. ఇలాంటి తమకు మనుగడే ప్రశ్నార్థకంగా మారిందన్నారు.

అందుబాటు ధరల్లో ఇళ్లను ఇవ్వగలిగే చిన్న బిల్డర్లను ప్రభుత్వం చిన్న చూపు చూస్తోందని విచారం వ్య‌క్తం చేశారు. తాజాగా మార్కెట్ వాల్యూ పెంపుదలతో చిన్న బిల్డర్లు కనుమరుగయ్యే ప్రమాదం పొంచి ఉందన్నారు. ఇంకా, ఆయ‌న ఏమ‌న్నారంటే..

” తెలంగాణ రాష్ట్రం ఏర్ప‌డిన‌ప్ప‌టి నుంచి తెలంగాణ ప్ర‌భుత్వం రియ‌ల్ ఎస్టేట్ ప‌రిశ్ర‌మ‌ను ఎంత‌గానో ప్రోత్స‌హిస్తోంది. రియ‌ల్ ఎస్టేట్ రంగం సంఘ వ్య‌తిరేక శ‌క్తుల నుంచి ఎలాంటి భ‌యం, బెదిరింపులు లేకుండా త‌మ వ్యాపారం చేసుకుంటోంది. మంచి పోలీసింగ్‌, శాంతిభ‌ద్ర‌త‌లు అదుపులో ఉండ‌ట‌మే అందుకు కార‌ణం. ఇక్క‌డి అభివృద్ధి కార్య‌క్ర‌మాలు చూసి ఇత‌ర రాష్ట్రాల నుంచి చాలామంది వ‌చ్చి తెలంగాణ రాష్ట్రంలో స్థిర‌ప‌డాల‌నుకుంటున్నారు.

ఇక్క‌డ రియ‌ల్ట‌ర్ల‌కు మంచి వ్యాపారం ఉండ‌టం, నిర్మాణ రంగం బాగుండ‌టంతో దేశ‌మంతా తెలంగాణ రాష్ట్రంలో పెట్టుబ‌డులు పెట్టాల‌ని చూస్తున్న‌ది. ఇలాంటి కీల‌క త‌రుణంలో.. ఇత‌ర రాష్ట్రాలు స్టాంపు డ్యూటీ, రిజిస్ట్రేష‌న్ ఛార్జీల‌ను త‌గ్గిస్తుంటే మ‌న ప్రభుత్వం రెండుసార్లు పెంచ‌డం శోచ‌నీయం.

రియ‌ల్ ఎస్టేట్ ప‌రిశ్ర‌మ మార్కెట్ అస్స‌లు బాగా లేదు. గ‌త ఆరు నెలల్నుంచి పూర్తిగా మందిగించింది. కొవిడ్-19 మ‌హ‌మ్మారి వ‌ల్ల అమ్మ‌కాలు త‌గ్గాయి. డిసెంబ‌ర్, జ‌న‌వ‌రి నెల‌ల్లో పండుగ‌లు ఉండ‌టంతో మంచి రోజుల కోసం చూసేవారే ఎక్కువ‌గా ఉంటారు. మ‌రోవైపు, ప‌రిశ్ర‌మ‌లో క్ర‌మ‌ప‌ద్ధ‌తిలో లేని కొంద‌రు బిల్డ‌ర్లు ప్రీ-లాంచ్/యూడీఎస్ పేరుతో చాలా గంద‌ర‌గోళం సృష్టించారు, ప‌రిశ్ర‌మ పేరును చెడ‌గొట్టారు. దుర‌దృష్ట‌వ‌శాత్తు సామాన్యులు ప్రింట్, ఎల‌క్ట్రానిక్, సోష‌ల్ మీడియాలో జ‌రిగే ప్ర‌క‌ట‌న‌ల‌ను చూసి మోస‌పోతున్నారు. దీనివ‌ల్ల రియ‌ల్ ఎస్టేట్ ప్రాప‌ర్టీ ప్రైస్ మార్కెట్‌లోని వాస్త‌వ‌మైన‌, క్ర‌మ‌ప‌ద్ధ‌తిలో జ‌రిగే లావాదేవీలు దెబ్బ‌తింటున్నాయి.”
ఈ కార్య‌క్ర‌మంలో ఈస్ట్ జోన్ బిల్డర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు మారం సతీష్ కుమార్, కూకట్ పల్లి బిల్డర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు శ్రీనివాసన్, ప్రగతినగర్ బిల్డర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు శ్రీనివాస్, ఉప్పల్ బిల్డర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు రమేష్, గ్రేటర్ సిటీ బిల్డర్స్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి జేటీ విద్యాసాగర్, గ్రేటర్ వెస్ట్ బిల్డర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు రాజా రెడ్డి, టీబీఎఫ్ కోశాధికారి గోపాల్ తదితరులు పాల్గొన్నారు.

రెండేళ్లు వాయిదా వేయాలి

స్టాంపు డ్యూటీ, మార్కెట్ విలువ‌లు, భ‌వ‌నాల రేట్లు, బెట‌ర్‌మెంట్ రేట్లు, నాలా ఛార్జీల‌ను ఇటీవ‌ల‌ పెంచ‌డం వ‌ల్ల‌, ప్ర‌స్తుత త‌రుణంలో మార్కెట్ విలువ‌ల‌ను మ‌ళ్లీ పెంచ‌డం స‌రికాదు. మార్కెట్ విలువ‌ల‌ను పెంచ‌డం వ‌ల్ల రిజిస్ట్రేషన్ ఛార్జీలు, నాలా ఛార్జీల్లాంటివ‌న్నీ 1.2.2022 నుంచి దీంతోపాటు జ‌త‌చేసిన స్టేట్‌మెంటులో చూపించిన‌ట్లు అమాంతం పెరుగుతాయి. ఒక‌వేళ మార్కెట్ విలువ‌ల‌ను స‌వ‌రించాల్సి వ‌స్తే, అది స‌రైన ప‌ద్ధ‌తిలో, పార‌ద‌ర్శ‌క విధానంతో, ప‌రిశ్ర‌మ‌.. పౌరుల‌ను సంప్ర‌దించి చేయాలి.

మొత్త‌మ్మీద మార్కెట్ విలువ‌ల‌ను 25% నుంచి 50% వ‌ర‌కు పెంచ‌డం న్యాయం కాదు. దీనికి స‌రైన ప‌ద్ధ‌తిని క‌నుగొని, దాన్ని స‌క్ర‌మంగా పాటించి న్యాయ‌బ‌ద్ధ‌మైన మార్కెట్ విలువ క‌నుగొనేవ‌ర‌కు వాయిదా వేయాలి. ఈ ప‌రీక్షా స‌మయంలో ప‌రిశ్ర‌మ‌కు ద‌య‌తో సాయం చేసి, మార్కెట్ విలువ‌ల పెంపును కొన్నాళ్లు వాయిదా వేయాలి. టి.న‌ర్సింహారావు, ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి, టీబీఎఫ్‌

ఇంత పెంచేస్తారా?

  • క‌న్వేయ‌న్స్ డీడ్ ప్ర‌కారం స్టాంపు డ్యూటీని 37.5% పెంచారు. ఫలితంగా 22.7.2021 నుంచి రిజిస్ట్రేష‌న్ ఛార్జీల భారం 25% పెరిగింది.
  • మార్కెట్ విలువ‌ల‌ను ప్ర‌భుత్వం 33% నుంచి 100% వ‌ర‌కు పెంచారు.
  • రిజిస్ట్రేష‌న్ ఛార్జీలు 6% నుంచి 7.5% కు పెరిగాయి.
  • ఆస్తుల బ‌దిలీపై స్టాంపు డ్యూటీని 4% నుంచి 5.5%కు పెంచారు.
  • భ‌వ‌నాలు/నిర్మాణాల మార్కెట్ విలువ‌ను చ‌ద‌ర‌పు అడుగుకు రూ.760 నుంచి రూ.1100కు (అంటే 45% పెరుగుద‌ల‌) పెరిగింది.
  • వ్య‌వ‌సాయ భూములు, ఇత‌ర ఆస్తుల మార్కెట్ విలువ‌లు 30% నుంచి 100% వ‌ర‌కు పెరిగాయి.
  • నాలా ప‌న్ను జీహెచ్ఎంసీ ప‌రిధిలో 50%, ఇత‌ర ప్రాంతాల్లో 67% పెంచారు.
  • కొవిడ్-19 మ‌హ‌మ్మారి వ‌ల్ల‌ చాలా కార్యాల‌యాలు స‌గం సిబ్బందితోనే ప‌ని చేస్తున్నాయి.

900 మంది బిల్డ‌ర్లు

తెలంగాణ బిల్డ‌ర్స్ ఫెడ‌రేష‌న్‌లో మొత్తం ఏడు సంఘాలున్నాయి. అవి గ్రేట‌ర్ సిటీ బిల్డ‌ర్స్, ఈస్ట్ జోన్ బిల్డ‌ర్స్ అసోసియేష‌న్, కూక‌ట్‌ప‌ల్లి బిల్డ‌ర్స్ అసోసియేష‌న్, ఉప్ప‌ల్ బిల్డ‌ర్స్ అసోసియేష‌న్, , ప్ర‌గతిన‌గ‌ర్ బిల్డ‌ర్స్ అసోసియేష‌న్, గ్రేట‌ర్ వెస్ట్ సిటీ బిల్డ‌ర్స్ అసోసియేష‌న్, సౌత్ జోన్ బిల్డ‌ర్స్ అసోసియేష‌న్. వీటిలో మొత్తం 900 మందికి పైగా బిల్డ‌ర్లు ఈ ఫెడ‌రేష‌న్‌లో ఉన్నారు. వీరిలో చాలామంది నిర్మాణ రంగంలో చురుగ్గా ఉండ‌టం విశేషం.

This website uses cookies.