దేశంలో నిర్మాణరంగ పరిశ్రమ జోరుగా సాగుతున్న తరుణంలో.. కర్బన ఉద్గారాలను తగ్గించాలనుకుంటున్న లక్ష్యాన్ని చేరుకోగలమా అనే సందేహాలు నెలకొంటున్నాయి. అయితే, విపరీతంగా విడుదలవుతున్న కర్బన ఉద్గారాలను నిర్మాణరంగం కచ్చితంగా తగ్గించాల్సిందేనని హరితభవన నిపుణులు స్పష్టం చేస్తున్నారు. నిర్మాణ రంగంలోని పలు మెటీరియల్స్ వల్ల వాతావరణంలోకి కర్బన ఉద్గారాలు విడుదలవుతాయని సీఐఐ- ఐజీబీసీ వైస్ ఛైర్మన్ సి.శేఖర్‌రెడ్డి తెలిపారు. ఆయన రియల్ ఎస్టేట్ గురుతో ప్రత్యేకంగా మాట్లాడుతూ.. కాంక్రీట్, స్టీల్, ఇన్సులేషన్ మెటీరియల్స్ వంటివి ఉత్పత్త చేసినప్పటి దగ్గర నుంచి వాటి రవాణా, నిర్మాణం, నిర్మాణ వ్యర్థాలను తొలగించడం వంటి అన్ని పనుల్లో కార్బన్ డై ఆక్సైడ్ విడుదలవుతుందని వివరించారు.
ఈ నేపథ్యంలో వీటిని నియంత్రించాల్సిన అవసరం ఉందన్నారు. పెద్దపెద్ద భవనాలనే కాకుండా సాధారణ నివాసాలనూ హరిత ఇళ్లగా మార్చొచ్చని తెలిపారు. నేషనల్ బిల్డింగ్ కోడ్, ఎనర్జీ ఎఫిషియన్సీ కోడ్ నిబంధనలకు అనుగుణంగా ఇళ్లను నిర్మిస్తే.. స్థిరమైన పర్యావరణానికి దోహదపడినట్టు అవుతాయని చెప్పారు. అయితే, డెవలపర్లు సులభమైన, వేగవంతమైన కొత్త విధానాలను అవలంభిస్తున్నారని.. వారు ఎనర్జీ ఎఫిషియన్సీని పట్టించుకోవడంలేదని ఆవేదన వ్యక్తం చేశారు.
అంతర్జాతీయంగా విడుదలవుతున్న మొత్తం కర్బన ఉద్గారాల్లో సిమెంట్, స్టీల్, అల్యూమినియం వంటి నిర్మాణ మెటీరియల్స్ ద్వారా 37 శాతం వస్తున్నాయని ఐక్యరాజ్యసమితి పర్యావరణ కార్యక్రమ నివేదిక వెల్లడించిందని వివరించారు. ఈ నేపథ్యంలో బిల్డర్లు వాణిజ్య, రెసిడెన్షియల్ ప్రాజెక్టుల్లో బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియన్సీ కోడ్స్ పాటించాలని సూచించారు. బయటి గోడలు, రూఫ్, కిటికీలు, డోర్లు.. ఇలా అన్నింట్లో ఈ నిబంధనలు పాటించాలన్నారు. స్థిరమైన భవనం.. వాతావరణంలోని అస్థిరతలను సమర్థంగా ఎదుర్కొంటుందని చెప్పారు.
సమర్థవంతమైన కవచం వాతావరణంలోని ప్రమాదకర పరిస్థితుల నుంచి రక్షణగా నిలుస్తుందని, ఇంటి లోపల గాలి నాణ్యతను మెరుగుపరుస్తుందని వివరించారు. పునరుత్పాదక ఇంధన వనరుల ద్వారా మీ భవనాన్ని జీరో ఎనర్జీ బిల్డింగ్ గా చేసుకోవచ్చన్నారు. మీరు వినియోగించుకున్నదానికి సమానంగా ఉత్పత్తి చేసే అవకాశం ఇక్కడ ఉంటుందని సి.శేఖర్‌రెడ్డి పేర్కొన్నారు.
ఇంధన డిమాండ్ ను తగ్గించుకోవడం, పునరుత్పాదక ఇంధన వనరులపై వైపు వంద శాతం వెళ్లడం వంటి సమర్థవంతమైన ఇంధన నిర్వహణ చర్యలు అవలంభించడం ద్వారా ఈ లక్ష్యాలను చేరుకోవచ్చన్నారు. హరితం అంటే.. మెటీరియల్స్ తోపాటు లోపలి పర్యావరణ విధానం, వ్యర్థాల నిర్వహణ, కర్బన ఉద్గారాల నియంత్రణ, భూమి, నీరు తదితరాలన్నీ కలిసిందని వివరించారు. ప్రస్తుతం నగరాల్లో క్రాస్ వెంటిటేషనల్ వంటి సంప్రదాయ విధానాలకు దూరంగా నిర్మాణాలు జరుగుతున్నాయని పేర్కొన్నారు.
స్థిరమైన భవనాలకు కచ్చితమైన నియమ నిబంధనలు ఉన్నప్పటికీ ఎవరూ సరిగా పాటించడంలేదని విమర్శించారు. పైగ హరిత భవనాల నిర్మాణాలకు సంప్రదాయ నిర్మాణాల కంటే ఎక్కువ వ్యయం కూడా కాదని స్పష్టం చేశారు. అలాయ్స్, పాలిమర్స్ వంటి తక్కువ బరువు కలిగిన మెటీరియల్స్ తోపాటు నిర్మాణ సైట్ల నుంచి ఉత్పత్తి అయ్యే వ్యర్థాలను పునర్ వినియోగించడం, గ్రీన్ బిల్డింగ్ రెగ్యులేన్స్ పాటించడం ద్వారా నిర్మాణ వ్యయాన్ని తగ్గించుకోవచ్చని వివరించారు.
This website uses cookies.