Categories: LATEST UPDATES

వాననీటిని ఒడిసిపడితే లాభాలెన్నో..

నీరు లేకుంటే మనిషికి మనుగడే లేదు. ఒక్కరోజు నీళ్లు లేకుంటే పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించుకోలేం. మరి అంతటి ప్రాధాన్యమైన నీటిని మ‌న‌మెంత కాపాడుకుంటే అది మనల్ని అంతగా కాపాడుకుంటుంది. ఈ నేపథ్యంలో ప్రతి నీటిబొట్టునూ వృథా కాకుండా సమర్థంగా వినియోగించుకోవాలి. ఇందుకోసం వర్షపు నీటిని ఒడిసిపట్టుకుంటే కలిగే లాభాలెన్నో ఉన్నాయి. మామూలే నీళ్లను జాగ్రత్తగా వాడుకునే ఉద్దేశం ఉన్నా.. నీటి బిల్లు తగ్గించుకోవాలని భావిస్తున్నా.. దానికి రెయిన్ హార్వెస్టింగ్ సరైన మార్గం. ఈ నీటిని తాగడానికి ఉపయోగించనప్పటికీ.. కొన్ని సాధారణ పనులకు ఈ నీటిని వినియోగించడం ద్వారా అటు నీటిని, ఇటు డబ్బును ఆదా చేయొచ్చు. అవేంటంటే..

మొక్కలకు నీరు పెట్టడం

మీ తోటలోని మొక్కలకు నీళ్ళు పోయడానికి వర్షపు నీటిని ఉపయోగించడం వల్ల కలిగే ప్రయోజనాలు మూడు రెట్లు ఎక్కువ. పంపు నీటి కంటే ఈ నీరు చాలా మంచిది. ఇందులో తక్కువ లవణాలు, తక్కువ క్లోరిన్, ఫ్లోరైడ్, కాల్షియం వంటివి ఉంటాయి. ఈ నీరు మొక్కలకు చాలా మంచిది. రెయిన్ హార్వెస్టింగ్ సిస్టమ్ కోసం ప్రారంభంలో కొంత ఖర్చు చేయాల్సి వచ్చినా.. తదనంతర కాలంలో దీనివల్ల కలిగే లాభాలే ఎక్కువ కాబట్టి.. ఈ విషయంలో ఎలాంటి సంకోచాలూ అవసరం లేదు.

కారు కడగటం..

మీ కారును కడగడానికి కూడా వర్షపు నీరు అనువైనది. ఈ పని కోసం మీ వర్షపు నీటిని ఉపయోగించడం వల్ల మీ నీటి బిల్లుల గురించి చింతించకుండా మీ వాహనాన్ని శుభ్రంగా ఉంచుకోవచ్చు. అయితే, కారు కడగడానికి తగినంత ఈ నీటిని ఫిల్టర్ చేయాల్సి ఉంటుంది.

టాయిలెట్లను ఫ్లష్ చేయడం..

పాత టాయిలట్లలోఒకసారి ఫ్లష్ చేయడానికి తొమ్మిది లీటర్లకు పైగా నీరు అవసరం. ప్రస్తుతం వస్తున్న ఆధునిక టాయిలెట్లలో ఫ్లష్‌కు 3 లీటర్ల కంటే ఎక్కువ నీరు కావాలి. ఈ నేపథ్యంలో టాయిలెట్ల ఫ్లష్ కు వర్షపు నీటిని ఉపయోగించడం వల్ల గణనీయంగా నీరు, నీటి బిల్లు అదా అవుతాయి.

బట్టలు ఉతకడం..

వర్షపు నీటితో మరో అద్భుతమైన ఉపయోగం.. బట్టలు ఉతకడం. ఇది సంవత్సరానికి దాదాపు పదివేల లీటర్ల మామూలు నీటిని ఆదా చేస్తుంది. అంటే చాలా పెద్ద మొత్తంలో ఖర్చు కూడా ఆదా అయినట్టే. అయితే, మీ వాషింగ్ మెషీన్ జీవితకాలాన్ని పొడిగించడానికి, మీ బట్టల రంగులు మారకుండా ఉండటానికి ఆ నీటిని తగినంత ఫిల్టర్ చేయాల్సిన అవసరం ఉంటుంది.

This website uses cookies.