Categories: TOP STORIES

వర్క్ ఫ్రం హోం.. రియల్ మార్పులు

కరోనా మహమ్మారి జన జీవితంలో ఎన్నో మార్పులు తెచ్చింది. చాలా అంశాలపై ప్రభావం చూపించిన ఈ వైరస్.. రియల్ రంగాన్ని సైతం మార్చివేసింది. ఇళ్లకు సంబంధించి ప్రజల ఆకాంక్షలు, అభిరుచులు మారాయి. దీంతో రియల్ ఎస్టేట్ రంగం కూడా ఆ మేరకు మారింది. కొత్త మార్కెట్ అవసరాలు, ప్రాధాన్యతలకు అనుగుణంగా ముందుకెళ్తోంది. లాక్ డౌన్ ఎత్తివేసిన తర్వాత కూడా చాలామందికి వర్క్ ఫ్రం హోం అవకాశం ఉండటంతో ఇళ్ల ఎంపికలోనూ ఆ మేరకు మార్పులు కనిపిస్తున్నాయి.

మెరుగైన జీవనశైలి కోసం నగర శివారు ప్రాంతాల్లో సరసమైన ధరల్లోనే పెద్ద పెద్ద గృహాలను ఎంపిక చేసుకుంటున్నారు. వర్క్ ఫ్రం హోం విధానం పెరుగుదల ఫలితంగా వాక్ టు వర్క్ విధానం కొంత ప్రాధాన్యతను కోల్పోతోంది. అయితే, అదే సమయంలో నగర శివార్లలో పెద్ద పెద్ద ఇళ్లలో మెరుగైన జీవితం గడపాలనుకునేవారి సంఖ్య పెరుగుతోంది. కోవిడ్ తర్వాత ఇళ్లను అద్దెకు తీసుకోవడం కంటే కొత్త ఇంటిని కొనుక్కోవడానికే చాలా మంది మొగ్గు చూపుతున్నారు.

వర్క్ ఫ్రం హోం విధానం పెరుగుదలతో చాలా మంది విశాలమైన ఇళ్లలో ఉండడాన్నే ఇష్టపడుతున్నారు. అందుకు నగరం నుంచి ఎంత దూరం వెళ్లడానికైనా వెనకాడటంలేదు. నగర ప్రధాన ప్రాంతాలతో పోలిస్తే శివారు ప్రాంతాల్లో పెద్ద పెద్ద ఇళ్లు చాలా తక్కువకే వస్తుండటంతో అందరూ వాటిపైనే ఆసక్తి ప్రదర్శిస్తున్నారు. ఢిల్లీలోని ప్రధాన ప్రాంతాలలో 1000 చదరపు అడుగుల ప్రాపర్టీ ధర సుమారుగా రూ.88.2 లక్షలు ఉండగా.. అదే శివారు ప్రాంతాల్లో అది రూ.37.50 లక్షలకే లభిస్తుంది.

అంటే ఏకంగా 57 శాతం తేడా ఉంది. అలాగే ప్రధాన ప్రాంతాల్లో 2 బీహెచ్ కే ఇంటికి నెలవారీ అద్దె సగటును రూ.22వేలు ఉండగా.. శివారు ప్రాంతాల్లో 2 బీహెచ్ కే ఇల్లు రూ.9,500 అద్దెకే వస్తుంది. ఇక ముంబై విషయానికి వస్తే.. ప్రధాన ప్రాంతాల్లో 1000 చదరపు అడుగుల ఫ్లాట్ ధర దాదాపు రూ.1.85 కోట్లు ఉండగా.. శివారు ప్రాంతాల్లో ఇది రూ.55.35 లక్షలుగా ఉంది. అలాగే 2 బీహెచ్ కే ఇంటి అద్దె ప్రధాన ప్రాంతాల్లో రూ.45,800 ఉండగా.. శివారు ప్రాంతాల్లో రూ.12,500గా ఉంది. బెంగళూరులో వెయ్యి చదరపు అడుగుల ఫ్లాట్ ధర దాదాపుగా రూ.69.80 లక్షలు ఉండగా.. శివారు ప్రాంతాల్లో అది రూ.43.50 లక్షలు. అద్దెలు సైతం సగానికి పైగా తేడా ఉంది.

This website uses cookies.