Categories: TOP STORIES

ఫ్యూచర్ సిటీలో ప్రపంచస్థాయి వ‌స‌తులు!

ఫ్యూచర్ సిటీ కెనెక్టివిటీకి గ్రీన్ ఫీల్డ్ రోడ్డు

ఔటర్ రింగ్ రోడ్డుకు-ఫ్యూచర్ సిటీకి రహదారి

తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ప్రకటించిన ఫ్యూచర్‌ సిటీ 4.O అభివృద్ధికి సంబంధించిన‌ అడుగులు ఒక్కొక్కటిగా పడుతున్నాయి. హైదరాబాద్‌ సమగ్రాభివృద్ధికి ఫ్యూచర్‌ సిటీ కీలకంగా మారుతుందని రేవంత్ సర్కార్ బలంగా విశ్వసిస్తోంది. ఇప్పటికే భవిష్యత్తు గరంలో స్కిల్ యూనివర్సిటీకి శంఖుస్థాపన జరగ్గా.. అక్కడే ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ సిటీని నిర్మించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.

ఈ క్రమంలో ప్రభుత్వ సంస్థలతో పాటు చాలా రంగాలకు చెందిన సంస్థలు, అంతర్జాతీయ స్థాయి కంపెనీలు అక్కడికి రాబోతున్నాయి. దీంతో ఫ్యూచర్ సిటీ భవిష్యత్‌ అవసరాలకు అనుగుణంగా ప్రపంచస్థాయి మౌలిక వసతులు ఏర్పాటు చేయాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగానే ఫ్యూచర్ సిటీ-4.O లో గ్రీన్ ఫీల్డ్ రోడ్లను నిర్మించాలని రేవంత్ సర్కార్ డిసైడ్ అయ్యింది.

ఫ్యూచర్ సిటీకి సంబంధించి భవిష్యత్తు ట్రాఫిక్‌ అవసరాలకు అనుగుణంగా రోడ్ల అనుసంధానం కోసం ప్రభుత్వం వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. ఫ్యూచర్‌ సిటీకి మెరుగైన అనుసంధానత కోసం ప్రస్తుత ఔటర్ రింగ్ రోడ్డు నుంచి శ్రీశైలం నేషనల్ హైవే వరకు 40 కిలోమీటర్ల పొడవునా గ్రీన్‌ఫీల్డ్‌ రోడ్డును నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఓఆర్‌ఆర్‌ ఎగ్జిట్‌-13 రావిర్యాల నుంచి కందుకూరు లోని మీర్‌ఖాన్‌పేటను ఈ రహదారి కలుపుతుంది.

మహేశ్వరంలోని కొంగర ఖుర్ద్, ఇబ్రహీంపట్నంలోని ఆదిభట్ల, దండుమైలారం, ఇబ్రహీంపట్నం ఖాల్సా, కప్పపహాడ్, నారేపల్లి, హఫీజ్‌పూర్, మజీద్‌పూర్, ఫిరోజ్‌గూడ, కొంగరకలాన్, కందుకూరు మండలంలోని గూడూరు, గుమ్మడవెల్లి, లేమూర్, మదాపూర్, రాచలూర్, తిమ్మాయిపల్లి, తుమ్మలూర్, మంఖాల్, పంజాగూడ, మీర్‌ఖాన్‌పేట గ్రామాల పరిధిలో 7622.19 ఎకరాల్లో పలు రకాల భూములు ఉన్నట్లు ప్రాథమికంగా గుర్తించారు.

ఈ ప్రాంతాల్లో ఎక్కువ విస్తీర్ణంలో ప్రభుత్వ భూములు ఉన్నట్లు తేల్చారు. ఇక్కడ గ్రీన్ ఫీల్డ్ రోడ్డు నిర్మాణంతో పాటు సమీపంలో భూముల అభివృద్ధిని కూడా చేపట్టాలని అధికారులు భావిస్తున్నారు. మహేశ్వరంలో ఒక గ్రామం, కందుకూరు మండలంలో ఆరు, ఇబ్రహీంపట్నంలో రెండు గ్రామాల్లో మొత్తంగా 497 ఎకరాల విస్తీర్ణంలో భూ సేకరణకు 175.87 కోట్లు ఖర్చవుతాయని అధికారులు అంచనా వేశారు. ఇబ్రహీంపట్నం మండలంలో తెలంగాణ స్టేట్ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కు చెందిన 834.17 ఎకరాలు విస్తీర్ణంలో భూములు ఉన్నాయి.

కందుకూరు, మహేశ్వరం మండలాల్లో సుమారు 742 ఎకరాల్లో భూగర్భ గనులు, ఖనిజాల శాఖ, అటవీశాఖకు చెందిన భూములున్నాయి. భవిష్యత్తులో మీర్‌ఖాన్‌పేట నుంచి రీజనల్‌ రింగ్‌ రోడ్‌ వరకు గ్రీన్ ఫీల్డ్ రోడ్డును అనుసంధానించేలా ప్రణాళికలు సిద్దం చేస్తున్నారు అధికారులు.

గ్రీన్‌ఫీల్డ్‌ రహదారికి సంబంధించి హైదరాబాద్‌ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ ఇప్పటికే రోడ్‌ ఎలైన్‌మెంట్‌ను రూపొందించింది. రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఆమోదం రాగానే ఈ రహదారి నిర్మాణాన్ని చేపట్టనున్నట్లు తెలుస్తోంది. ఔటర్ రింగ్ రోడ్ ఎగ్జిట్‌-12 రావిర్యాల నుంచి మహేశ్వరం, కందుకూరు, ఇబ్రహీంపట్నం మండలాల్లోని 21 గ్రామాల ద్వారా ఈ గ్రీన్‌ఫీల్డ్‌ రోడ్‌ వెళ్తుంది. దీనికి దాదాపు ఎనిమిది వేల ఎకరాల భూములు అవసరమని ప్రభుత్వ యంత్రాంగం గుర్తించింది. అందుకు సంబంధించిన‌ భూసేకరణ ప్రక్రియను వెంటనే ప్రారంభించాలని అధికారులను ఆదేశించింది ప్రభుత్వం. ఈ క్రమంలో హైదరాబాద్ నగర విస్తరణ ఫ్యూచర్ సిటీవైపే ఉండబోతోంది అంచనా వేస్తున్నారు రియల్ ఎస్టేట్ రంగ నిపుణులు.

This website uses cookies.