సిద్దమైన హైదరాబాద్ మెట్రో విస్తరణ డీపీఆర్
రెండవ దశలో 78.6 కి.మీ మేర మెట్రో ప్రాజెక్టు
మెట్రోతో నిర్మాణరంగం ఉపందుకోనుందన్న ఆశ
హైదరాబాద్ లో రియల్ ఎస్టేట్ నేల చూపులు చూస్తోంది. అందుకు హైడ్రా ఓ కారణమైతే.. ప్రభుత్వ నిర్లిప్త వైఖరి మరో కారణంగా చెబుతున్నారు. ఓ వైపు నిర్మాణదారులు ఆందోళన చెందుతుంటే.. మరోవైపు గృహ కొనుగోలుదారులు ఇల్లు కొనాలన్న నిర్ణయాన్ని వాయిదా వేసుకుంటున్నారు. దీంతో గ్రేటర్ హైదరాబాద్ లో నిర్మాణ రంగం చతికిల పడిపోయింది. ఇలాంటి సమయంలో మెట్రో రైల్ ప్రాజెక్టు విస్తరణ కొంతమేర రియల్ ఎస్టేట్ వర్గాల్లో ఆశలు పుట్టిస్తోంది. నగరంలో ప్రస్తుతం సక్సెస్ ఫుల్ గా నడుస్తున్న మెట్రో రైల్ ప్రాజెక్టును మరిన్ని ప్రాంతాలకు విస్తరించేందుకు తెలంగాణ ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది.
ఇప్పుడు హైదరాబాద్ మెట్రో రైల్ రెండో దశను చేపడుతోంది తెలంగాణ ప్రభుత్వం. మెట్రో ట్రైన్ సెకండ్ ఫేజ్‌కు సంబంధించిన డీపీఆర్‌లు దాదాపుగా రేడీ అయినట్లు తెలుస్తోంది. మెుత్తం 5 మార్గాల్లో కలిపి 78.6 కిలో మీటర్లుగా రెండో దశను ప్రతిపాదించింది రేవంత్ సర్కార్. ఈ రెండో ఫేజ్‌లో సుమారు 60కి పైగా మెట్రో స్టేషన్లు రానున్నాయి. అందుకు రూ. 24,042 కోట్ల రూపాయల వ్యయం అవుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు.
కొత్త మెట్రో రైల్ మార్గాలపై ముఖ్యమంత్రి రేవంత్ ఇప్పటికే అధికారులకు కీలక సూచనలు చేశారు. సీఎం సూచనల మేరకు రెండో దశ డీపీఆర్‌లు వేర్వేరుగా తయారు చేస్తున్నారు. ఈ నెల చివరి నాటికి ఆయా డీపీఆర్‌లను అధికారులు ప్రభుత్వానికి సమర్పించనున్నట్లు తెలుస్తోంది. ఆ తరువాత కేబినెట్ ఆమోదం తర్వాత కేంద్ర ప్రభుత్వ అనుమతి కోసం పంపించనున్నారు.
హైదరాబాద్ మెట్రో రెండవ దశలో ప్రతిపాదించిన అన్ని మార్గాలు కూడా మొదటి దశలోని మూడు కారిడార్లకు కొనసాగింపుగా ఉన్నాయి. కారిడార్-1కి కొనసాగింపుగా ఎల్బీనగర్ నుంచి హయత్‌నగర్ వరకు మెట్రో ప్రాజెక్టును చేపట్టనున్నారు. మెుత్తం 8 కిలో మీటర్ల మేర ఈ మార్గాన్ని పొడిగించేలా ప్రణాళికలు సిద్దం చేశారు. ఇదే కారిడార్‌లో రెండోవైపు పొడిగింపుగా మియాపూర్ నుంచి పటాన్‌చెరు వరకు మెట్రోను విస్తరిస్తున్నారు.
మెుత్తం 14 కిలో మీటర్ల మేర పొడిగిస్తారు. చందానగర్ ప్రాంతంలో కొంతదూరం డబుల్ డెక్‌ని మెట్రో అధికారులు ప్రతిపాదించగా ఇందులో మెుత్తం 10 స్టేషన్లు అందుబాటులోకి రానున్నాయి. మెట్రో కారిడార్-2కు కొనసాగింపుగా ఎంజీబీఎస్ నుంచి ఫలక్‌నుమా, చాంద్రాయణగుట్ట వరకు మెట్రో రైల్ ప్రాజెక్టును నిర్మించనున్నారు. మెుత్తం 7.5 కిలో మీటర్ల మేర ఆరు స్టేషన్లు ఏర్పాటు చేసేలా ప్రణాళికలు సిద్దం చేశారు.
కారిడార్-3కి కొనసాగింపుగా రాయదుర్గం నుంచి కాజాగూడ, నానక్‌రాంగూడ, విప్రో సర్కిల్, ఫైనాన్షియల్ డిస్ట్రిక్, యూఎస్ కాన్సులేట్, కోకాపేట నియోపోలీస్ వరకు మెట్రో పొడగిస్తున్నారు. ఈ కారిడార్ లో మెుత్తం 11.3 కిలో మీటర్ల వరకు ట్రైన్ సర్వీసులు విస్తరించనున్నారు. ఇదే కారిడార్‌లో మరో వైపు నాగోల్ నుంచి ఎల్బీనగర్, మైలార్ దేవుపల్లి, జల్‌పల్లి, శంషాబాద్ ఎయిర్‌పోర్టు వరకు మొత్తం 33.1 కిలో మీట్రలు పొడిగించనుండగా.. ఇక్కడ మెుత్తం 22 స్టేషన్లను ప్రతిపాదించారు. ఈ కారిడార్‌నే మైలార్ దేవ్‌పల్లి నుంచి ఆరాంఘర్- రాజేంద్రనగర్ వ్యవసాయ వర్సిటీ సమీపంలో నిర్మించే కొత్త హైకోర్టు వరకు మెట్రోను పొడిగించేందుకు ప్రతిపాదించారు.
దాదాపు 5 కిలో మీటర్ల మేర ఈ మార్గంలో కొత్తగా మూడు స్టేషన్లు రానున్నాయి. అంతే కాకుండా ఫ్యూచర్ సిటీకి కూడా మెట్రో ట్రైన్ విస్తరించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించగా.. అందుకు సంబంధించిన ప్రణాళిక ఇంకా ఖరారు కాలేదు. ఈ క్రమంలో మెట్రో రైల్ విస్తరణకు సంబంధించిన ప్రాజక్టు పట్టాలెక్కితే ఆయా ప్రాంతాల్లో రియల్ ఎస్టేట్ జోరందుకుంటుందని రియల్ రంగ నిపుణులు భావిస్తున్నారు.
మరీ ముఖ్యంగా మెట్రో రైల్ రెండవ దశ ప్రాజెక్టుతో విజయవాడ జాతీయ రహదారిపైన హయత్ నగర్, ముంబై జాతీయ రహదారిపైన పటాన్ చెరు నుంచి మొదలు సంగారెడ్డి వరకు, బెంగళూరు జాతీయ రహదారిపైన శంషాబాద్ నుంచి మొదలు షాద్ నగర్ వరకు, మరోవైపు ఫ్యూచర్ సిటీ వరకు రియల్ ఎస్టేట్ ఊపందుకోనుందని రియల్ రంగ నిపుణులు అంచనా వేస్తున్నారు.
ఇప్పటికే అయా ప్రాంతాల్లో మౌళిక వసతులు కొంత మేర మెరుగ్గా ఉండగా, ఇప్పుడు మెట్రో రూపంలో రవాణా సౌకర్యం పెరిగితే మధ్య తరగతి, ఎగువ మధ్య తరగతి వారు ఆయా ప్రాంతాల్లో నివాసాలు ఏర్పాటు చేసుకుంటారని చెబుతున్నారు. తద్వార అక్కడ నిర్మాణరంగానికి మంచి భవిష్యత్తు ఉంటుందని భావిస్తున్నారు.
This website uses cookies.