హైదరాబాద్ లో సాధారణంగా భూమి ధర ఎక్కువగా ఎక్కడ ఉంటుందని అడిగితే.. బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, గచ్చిబౌలి.. లేదంటే కోకాపేట్ అని చెబుతారు. కానీ అందరి అంచనాలను తలకిందులు చేస్తూ.. హైదరాబాద్లో ఎవరూ ఊహించని ప్రాంతంలో.. అత్యధికంగా గజం భూమి ధర పలికింది. ఔను.. బేగంబజార్‌లో భూమి ధర ముంబయితో పోటీ పడుతోంది. మన వద్ద గజం భూమి తక్కువలో తక్కువ 10 లక్షల రూపాయల వరకు ధర పలుకుతోంది.
బేగంబజార్ లో భూమి అందుబాటులో లేకపోవడంతో పాత భవనాలను కూల్చి కొత్త భవనాలను నిర్మిస్తున్నారు. ఉత్తర్ ప్రదేశ్, రాజస్థాన్, గుజరాత్, మహారాష్ట్రకు చెందిన పలు రంగాలకు చెందిన వోల్ సేల్ వ్యాపారులు ఎంతో మంది బేగం బజార్ లో స్థిరపడిపోయారు. ప్రతిరోజు ఇక్కడ కొన్ని వందల కోట్ల వ్యాపారం జరుగుతోంది. దీంతో ఈ ప్రాంతంలో భూమికి భారీ డిమాండ్ ఏర్పడింది. తాజాగా జరిగిన రెండు మూడు భూమి లావాదేవీల్లో.. చదరపు గజం ధర సుమారు 10 లక్షల రూపాయల ధర పలికిందని చెబుతున్నారు. బేగంబజార్ లో చదరపు అడుగుల చొప్పున అమ్మకాలు జరిగే దకాణాలు, కమర్షియల్ భవనాల్లో ధరలు సైతం కోట్లలోనే పలుకుతున్నాయని స్థానిక రియల్ ఎస్టేట్ వ్యాపారులు చెబుతున్నారు.
ఇక్కడ గల్లీ, వీధిని బట్టి.. గజానికి కనీస ధర 10 లక్షలు ఆపైనే భూమి ధరలున్నాయట. దీంతో పాతవి, పురాతన, శిథిలావస్థకు చేరిన భవనాలు ఇక్కడి యజమానులకు కోట్ల రూపాయల్లో కాసుల వర్షం కురిపిస్తున్నాయి. తాజాగా బేగం బజార్ లో 68 గజాల ఓ చిన్న స్థలం అక్షరాలా 6 కోట్ల 80 లక్షల రూపాయలకు అమ్మడుపోయిందంటే పరిస్థితి ఎలా ఉందో అర్ధం చేసుకోవచ్చు. హైదరాబాద్ లో గచ్చిబౌలి, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, కోకాపేట, మాధాపూర్ లో భూములకు అత్యధిక ధరలు ఉన్నప్పటికీ.. బేగంబజార్ లో అంతకు మించిన ధరలు ఉండటంతో అంతా ఆశ్చర్యపోతున్నారు.
This website uses cookies.