తెలంగాణ ప్రభుత్వం ముచ్చర్లలో కొత్తగా ఫ్యూచర్ సిటీని అభివృద్ధి చేయనున్నట్లు ప్రకటించడంతో.. ఆ పరిసర ప్రాంతాల్లో భూముల ధరలకు రెక్కలొచ్చాయి. సీఎం రేవంత్ రెడ్డి ప్రకటన తరువాత అక్కడ రియల్ ఎస్టేట్ కార్యకాలాపాలు జోరందుకున్నాయి. ఇప్పటికే ఔటర్ రింగ్ రోడ్డు దాటి రియల్ ఎస్టేట్ విస్తరించిగా.. ఇప్పుడు ముచ్చర్ల భవిష్యత్తు నగరం ప్రకటనతో.. ఇళ్లు, భూముల ధరలు క్రమంగా పెరుగుతున్నాయని రియల్ ఎస్టేట్ వర్గాలు చెబుతున్నాయి. ప్రధానంగా మహేశ్వరం, ఇబ్రహీంపట్నం, కల్వకుర్తి నియోజకవర్గాల్లోని భూములకు మంచి ధరలు పలుకుతున్నాయి.
ముచ్చర్ల సమీపంలోని దాసర్లపల్లి, కడ్తాల్, నేదునూర్, కందుకూర్, మిర్ఖాన్‌పేట్, తుమ్మలూర్, మహేశ్వరం, గూడుర్, పంజగూడ, నాగిరెడ్డిగూడ, మక్త మదారం వంటి ప్రాంతాల్లో భూముల ధరలు పెరుగుతున్నాాయి. ముచ్చర్ల చుట్టు పక్కల ప్రాంతాల్లో ఫ్యూచర్ సిటీ ప్రకటన తరువాత 20 నుంచి 30 శాతం మేర భూముల ధరలు పెరిగాయని రియల్ రంగ నిపుణులు చెబుతున్నారు. అంతకుముందు ముచ్చర్ల ఉన్న కందుకూరు మండలంలో ఎకరా సగటున 1 కోటి 50 లక్షల రూపాయలు ఉండగా ఇప్పుడు 1 కోటి 80 లక్షల ధర పలుకుతోంది. ఇక కడ్తాల్ మండలంలో గతంలో మొన్నటి వరకు ఎకరా భూము ధర కోటి 20 లక్షలు ఉండగా తాజాగా కోటి 50 లక్షల వరకు పెరిగిందని తెలుస్తోంది.
మహేశ్వరం, కందుకూరు, కడ్తాల్, అమనగల్, యాచారం మండలాల్లో ఫ్యూచర్ సిటీ తరువాత భూముల ధరలు క్రమంగా పెరుగుతున్నాయి. ఆమనగల్ మండలంలో నిన్నటి వరకు ఎకరా భూమి ధర సగటున కోటి రూపాయలు ఉంగా ఇప్పుడు కోటి 20 లక్షల నుంచి కోటి 50 లక్షల వరకు ప్రాంతాన్ని బట్టి ధరలు చెబుతున్నారు. ముఖ్యంగా శ్రీశైలం హైవేకు సమీపంలోని భములకు విపరీతమైన డిమాండ్ ఏర్పడింది. శ్రీశైలం రహదారికి ఇరువైపులా ఎకరం అత్యధికంగా 3 కోట్ల రూపాయలు చెబుతున్నారు.
ఈ మండలాల్లో ఇళ్ల స్థలాల ధరలకు సైతం రెక్కలొచ్చాయి. కందుకూరు మండలంలో ముచ్చర్ల సమీపంలో ఇప్పటికే వందల్లో వెలసిన రియల్ వెంచర్లలో.. మొన్నటి వరకు చదరపు గజం 8 వేల రూపాయల నుంచి ఉండగా ఇప్పుడు 10 నుంచి 12 వేలకు పెరిగింది. శ్రీశైలం హైవే కు దగ్గరగా ఉన్న వెంచర్లలో చదరపు గజం 20 వేల రూపాయలకు పైగానే ధరలున్నాయి. కడ్తాల్, ఆమనగల్, ఇబ్రహీంపట్నం, కందుకూర్ ప్రాంతాల్లో ఇళ్ల స్థలాలకు ఇప్పుడు డిమాండ్ పెరిగింది. హైదరాబాద్లో ఇల్లు లేదంటే ఇంటి స్థలం కొనుక్కోవాలని, ఇక్కడ ధరలు చూసి వెనకడుగు వేసిన మధ్య తరగతి వారంతా.. ఇప్పుడు ఫ్యూచర్ సిటీ ప్రాంతంలో ఇంటి స్థలం కొనుక్కునేందుకు మొగ్గు చూపుతున్నారని రియల్ రంగ వర్గాలు చెబుతున్నాయి.
This website uses cookies.