Categories: TOP STORIES

కొల్లూరులో కొంటే కొంప కొల్లేరేనా?

స‌గం ధ‌ర‌కే ఫ్లాటు వ‌స్తుంద‌ని కొనుగోలు చేస్తే.. అస‌లుకే మోసం వ‌చ్చే ప్ర‌మాద‌ముంది. మార్కెట్లో రూ.60 ల‌క్ష‌లున్న ఫ్లాటును ఎవ‌రైనా ముప్ప‌య్ ల‌క్ష‌ల‌కే ఇస్తున్నారంటే మీరు ఎగిరి గంతేయ‌కుండా.. అందులోని ప్ర‌తికూల అంశాల గురించి కూడా ఆలోచించాలి.

గ‌త ప్ర‌భుత్వం హ‌యంలో.. 2019 నుంచి కొల్లూరు, వెలిమ‌ల‌, తెల్లాపూర్‌, పాటి ఘ‌న‌పూర్, మోకిలా వంటి ప్రాంతాల్లో.. సుమారు పాతిక దాకా సంస్థ‌లు ప్రీలాంచ్‌లో ఫ్లాట్లు, విల్లాల‌ను అమ్మ‌కానికి పెట్టాయి. అందులో క‌నీసం ప‌ది శాతం సంస్థ‌లూ సీరియ‌స్‌గా నిర్మాణాల్ని మొద‌లెట్ట‌లేదు. కొన్ని కంపెనీలేమో ప్రాజెక్టుల‌ను నిలిపివేస్తే.. మ‌రికొన్నేమో నిర్మాణాలు చేస్తున్న‌ట్లు న‌టిస్తున్నాయి. ఇంకొందరేమో బ‌య్య‌ర్ల‌కు పూర్తిగా క‌నిపించ‌డ‌మే మానేశారు. క‌నిపిస్తే కొడ‌తారేమోన‌ని! వీరిలో కొంద‌రు బిల్డ‌ర్లుగా చెలామ‌ణి అవుతున్న వ్య‌క్తులు నెల‌లు గ‌డుస్తున్నా నేటికీ మేక‌పోతు గాంభీర్యాన్ని ప్ర‌ద‌ర్శిస్తున్నారు. స‌మ‌స్య మొత్తం స్థానిక సంస్థ‌ల మీద నెట్టేస్తున్నారు.

కోర్టు కేసులుంటే ఏం చేస్తామంటూ దాట‌వేస్తున్నారు. మ‌రికొంద‌రు డెవ‌ల‌ప‌ర్లు అయితే.. కోర్టు కేసులున్న‌ప్ప‌టికీ.. అదేదో త‌మ స‌మ‌స్య కాదంటూ.. ఆయా స‌ర్వే నెంబ‌ర్లు త‌మ‌వి కాద‌ని చెబుతూ.. య‌ధావిధిగా ప్రీలాంచుల్లో ఫ్లాట్ల‌ను అమ్ముతున్నారు. ఏదీఏమైనా, ఇలాంటి అంశాల్లో కొనుగోలుదారులు ఆచితూచి వ్య‌వ‌హ‌రించాలి. క‌నీసం రెరా ప్రాజెక్టుల్లో కొంటే, బిల్డ‌ర్ ప్రాజెక్టును క‌ట్ట‌క‌పోతే రెరా అథారిటీ త‌గిన చ‌ర్య‌లు తీసుకుంటుంది. కాబ‌ట్టి, కొనుగోలుదారులు దురాశ‌కు వెళ్ల‌కుండా.. రెరా ప్రాజెక్టుల్లో కొంటేనే అన్నివిధాల ఉత్త‌మం.

This website uses cookies.