Categories: TOP STORIES

హైదరాబాద్లో 1.5 కోట్ల చ‌.అ. స్థ‌లం ఖాళీ!

హైద‌రాబాద్‌లో ఐటీ స్థ‌లానికి గిరాకీ ఎలా ఉంది? కొన్ని స‌ర్వే రిపోర్టులను గ‌మ‌నిస్తే.. హైదరాబాద్ ఆహో.. సాహో అంటున్నాయి. కానీ, వాస్త‌వ ప‌రిస్థితులు ఎలా ఉన్నాయ‌ని రెజ్ న్యూస్ ప‌రిశీల‌న చూస్తే.. ఆస‌క్తిక‌ర‌మైన విష‌యాలు వెలుగులోకి వ‌చ్చాయి. వాస్త‌వానికి, ప్ర‌స్తుతం మొత్తం హైద‌రాబాద్‌లో గ‌రిష్ఠంగా 25 కోట్ల చ‌ద‌ర‌పు అడుగుల్లో ఆఫీసు నిర్మాణం జ‌రుగుతోంది. ఇవి వివిధ నిర్మాణ ద‌శ‌లో ఉన్నాయి. నిర్మాణం పూర్త‌య్యి.. ఖాళీగా ఉన్న‌ ఆఫీసు స్థ‌లం సుమారు కోటిన్న‌ర చ‌ద‌ర‌పు అడుగుల దాకా ఉంటుంది. ఈ స్థ‌లాన్ని వివిధ ఐటీ, ఐటీఈఎస్‌ సంస్థ‌లు లీజుకు తీసుకునేందుకు ప‌ట్టే స‌మ‌యం ఎంతో తెలుసా?

2019 త‌ర‌హాలో హైద‌రాబాద్‌లో అధిక డిమాండ్ ఏర్ప‌డి.. వివిధ ఐటీ మ‌రియు ఐటీఈఎస్‌ సంస్థ‌లు ఆస‌క్తి చూపిస్తే.. ఏడాదిన్న‌ర‌లోనే కోటీన్న‌ర చ‌ద‌ర‌పు అడుగుల స్థ‌లాన్ని లీజుకు తీసుకుంటాయి. కాక‌పోతే, అమెరికాలో ఆరంభ‌మైన ఆర్థిక మాంద్యం, మ‌ళ్లీ మొద‌లైన క‌రోనా క‌ష్టాల్ని ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకుంటే.. ఇప్పుడంత సానుకూల ప‌రిస్థితులు క‌నిపించ‌ట్లేదు.

కాబ‌ట్టి, కోటిన్న‌ర చ‌ద‌ర‌పు అడుగుల స్థ‌లాన్ని ప‌లు కంపెనీలు లీజుకు తీసుకునేందుకు ఎంత‌లేద‌న్నా రెండు నుంచి మూడేళ్లు ప‌ట్టే అవ‌కాశ‌ముంది. పైగా, 2023లో మొద‌టి రెండు త్రైమాసికాల్లో మార్కెట్‌కు పెద్ద‌గా గిరాకీ ఉండ‌ద‌ని రియ‌ల్ నిపుణులు అంటున్నారు. కరోనా మళ్లీ విజృంభిస్తోంద‌నే వార్త‌లు మార్కెట్‌ను క‌ల‌వ‌ర‌పెడుతున్నాయి. మొత్తానికి, ఏదైనా అద్భుతం జ‌రిగితే త‌ప్ప న‌గ‌రంలో ఆఫీసు స్థ‌లానికి గిరాకీ పెర‌గ‌ద‌ని నిపుణులు అంటున్నారు.

This website uses cookies.