తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం జులై 22 నుంచి రిజిస్ట్రేషన్ ఛార్జీలను పెంచిన విషయం తెలిసిందే. నిన్నటివరకూ ఆరు శాతమున్న రిజిస్ట్రేషన్ ఛార్జీలను ఏడున్నర శాతం చేసింది. నాలుగు శాతమున్న స్టాంప్ డ్యూటీని ఐదున్నర శాతం చేసింది. కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో ట్రాన్స్ ఫర్ డ్యూటీ, రిజిస్ట్రేషన్ ఛార్జీల్లో ఎలాంటి మార్పు చేయలేదు. కాకపోతే గ్రామ పంచాయతీల్లో స్వల్ప మార్పుల్ని చేసింది. అక్కడ రిజిస్ట్రేషన్ ఛార్జీ రెండు శాతం చేసింది.
అంటే, ఇందులోనే ఒకటిన్నర శాతం ట్రాన్స్ ఫర్ డ్యూటీని కలిపేసింది. కాకపోతే, ట్విస్టు ఏమిటంటే.. ఈ 1.5 శాతాన్ని ఆయా గ్రామ పంచాయతీల కోసం వినియోగించరట. ఆయా సొమ్ము ప్రభుత్వ ఖజానాలోకి చేరుతుందట. ఎందుకంటే, కేంద్ర ప్రభుత్వం నుంచి ఇప్పటికే గ్రామ పంచాయతీలకు రకరకాల నిధులు సమకూరుతున్నాయి. అందుకే, ఈ ఒకటిన్నర శాతం మొత్తాన్ని ఆయా గ్రామ పంచాయతీలకు కాకుండా ప్రభుత్వ ఖజానాలో జమ చేస్తారట. మరి, ఆయా సొమ్మును దేనికోసం వినియోగిస్తారనే విషయంలో ప్రభుత్వం స్పష్టతనివ్వాల్సిన అవసరం ఉందని పంచాయతీలు అంటున్నాయి.