Categories: LEGAL

నిబంధనల ఉల్లంఘన.. బిల్డర్ కి 15 కోట్ల జరిమానా

పర్యావరణ అనుమతుల (ఈసీ) నిబంధనలను ఉల్లంఘించి అదనపు అంతస్తులు నిర్మించిన బిల్డర్ కు జాతీయ హరిత ట్రైబ్యునల్ (ఎన్జీటీ) షాక్ ఇచ్చింది. నిబంధనలు ఉల్లంఘించి అక్రమ నిర్మాణాలు చేసినందుకు రూ.15 కోట్లు చెల్లించాలని ఎక్స్ ప్రెస్ బిల్డర్స్ అండ్ ప్రమోటర్స్ ను ఆదేశించింది. ఈ సంస్థ నోయిడాలోని 77వ సెక్టార్ లో ‘ఎక్స్ ప్రెస్ జెనీత్’ పేరుతో ఓ ప్రాజెక్టు నిర్మించింది. దీనికి గ్రౌండ్, 18 అంతస్తుల వరకు అనుమతి ఉండగా.. ఐదు టవర్లలోనూ గ్రౌండ్, 19 అంతస్తులు నిర్మించారు. ఈ విషయంపై ఎన్జీటీలో పిటిషన్ దాఖలైంది.

దీనిపై విచారణ జరిపిన ఎన్జీటీ చైర్ పర్సన్ జస్టిస్ ఏకే గోయెల్.. సదరు కంపెనీపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పర్యావరణ అనుమతులు ఉల్లంఘించడం సరికాదని స్పష్టం చేశారు. దీని వల్ల పర్యావరణం పై అదనంగా కాలుష్య ప్రభావం పడుతుందని పేర్కొన్నారు. 19 అంతస్తులు నిర్మించి, వాటిని విక్రయించడం.. కొనుగోలుదారులు అందులో ప్రవేశించడంతో అదనపు అంతస్తును కూల్చివేస్తే వారు ప్రభావితమవుతారని ఎన్జీటీ అభిప్రాయపడింది. ఈ నేపధ్యంలో బిల్డర్ రూ.15 కోట్లు చెల్లించాలని ఆదేశించింది. ఆ మొత్తాన్ని నెల రోజుల్లోగా జిల్లా మేజిస్ట్రేట్ కు చెల్లించాలని స్పష్టం చేసింది. ఆ మొత్తాన్ని జిల్లా పర్యావరణ ప్రణాళికను అమలు చేయడానికి వినియోగించాలని సూచించింది.

This website uses cookies.