Categories: LATEST UPDATES

కోకాపేట్‌లో 52 అంత‌స్తుల సాఫ్ట్ లాంచ్‌?

  • నిద్ర‌పోతున్న తెలంగాణ ప్ర‌భుత్వం?
  • ప‌ట్టించుకోని రెరా అథారిటీ
  • యూడీఎస్‌, ప్రీలాంచులు న్యాయ‌బ‌ద్ధ‌మేనా?
  • వీటిలో కొనాలా? వ‌ద్దా? బ‌య్య‌ర్ల‌కు స్ప‌ష్ట‌త‌నివ్వాలి

యూడీఎస్‌, ప్రీలాంచ్ ప్రాజెక్టుల్లో కొనుగోలుదారులు ఎట్టి ప‌రిస్థితిలో కొన‌కూడ‌ద‌ని నీతి వాక్యాలు ప‌లుకుతూ.. తెలంగాణ నిర్మాణ సంఘాలు నెల రోజులు క్రితం హ‌డావిడి చేశాయి. బంజారాహిల్స్‌లోని క్రెడాయ్ హైద‌రాబాద్ కార్యాల‌యంలో.. ప‌త్రికా స‌మావేశాన్ని నిర్వ‌హించి ఏకంగా గాల్లో కాల్పులు చేపట్టాయి. దీని వ‌ల్ల పెద్ద‌గా ఉప‌యోగం ఉండ‌ద‌ని వారికీ తెలుసు. ఎందుకంటే, అక్ర‌మ రీతిలో హైద‌రాబాద్‌లో ఫ్లాట్ల‌ను ఎవ‌రు అమ్ముతున్నారో వారికీ తెలుసు. కానీ, అదేదో త‌మ‌కు తెలియ‌ద‌న్న‌ట్లుగా ఈ సంఘ పెద్ద‌లు గంభీరంగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. అక్ర‌మార్కుల‌ను ప‌ట్టుకునే డ్యూటీ ప్ర‌భుత్వ విభాగాలద‌ని చెబుతున్నారు. మ‌రి, కోడ్ ఆఫ్ కండ‌క్ట్ మీద సంత‌కం పెట్టాక‌.. ఇలా ఎలా కొంద‌రు బిల్డ‌ర్లు అక్ర‌మంగా వ్య‌వ‌హ‌రిస్తున్నారనే ప్ర‌శ్న‌కు జ‌వాబు లేదు. యూడీఎస్‌, ప్రీలాంచుల్లో అమ్మేవారిని సంఘం నుంచి బ‌హిష్క‌రించే ధైర్యం సంఘ పెద్ద‌ల‌కు లేదు. అక్ర‌మ వ్యాపారం చేసేవారిని త‌మ సంఘం నుంచి తొల‌గిస్తామ‌ని కనీసం వీరు ప్ర‌క‌ట‌న కూడా చేయ‌లేరు. అందుకే, సందిట్లో స‌డేమియాలా ఎప్ప‌టిక‌ప్పుడు స‌రికొత్త ముష్క‌రులు ఈ రంగంలోకి ప్ర‌వేశించి.. అమాయ‌కుల నుంచి ప్రీలాంచ్‌, సాఫ్ట్ లాంచ్‌, యూడీఎస్ అంటూ సొమ్ము కొల్ల‌గొడుతూనే ఉన్నారు. తాజాగా, 52 అంత‌స్తుల్ని క‌డుతున్నామంటూ ఓ నిర్మాణ సంస్థ ఏకంగా ప్ర‌వాసుల్ని ఆక‌ట్టుకుంటోంది.

క‌రోనా వైర‌స్ త‌న రూపాన్ని మార్చుకుంటూ ప్ర‌పంచాన్ని వ‌ణికిస్తున్న విష‌యం తెలిసిందే. మ‌రోవైపు, హైద‌రాబాద్లో కొంద‌రు బిల్డ‌ర్లు సైతం అక్ర‌మ అమ్మ‌కాల‌కు సంబంధించిన రూపాన్ని మార్చివేస్తున్నారు. దీనికి స‌రికొత్త పేరును సృష్టిస్తున్నారు. తాజాగా, సాఫ్ట్ లాంచ్ అంటూ రేటు త‌క్కువ చెబుతూ.. రెరా ప్ర‌కారం అపార్టుమెంట్ల‌ను నిర్మిస్తున్న డెవ‌ల‌ప‌ర్లలో వ‌ణుకు పుట్టిస్తున్నారు. కొన్నాళ్ల క్రితం రెరా ప్ర‌కారం అనుమ‌తులు తీసుకుని అపార్టుమెంట్ల‌ను క‌డుతున్న బిల్డ‌ర్ల‌కు చుక్క‌లు చూపిస్తున్నారు. ఈ సాఫ్ట్ లాంచ్ అక్క‌డి చుట్టుప‌క్క‌ల బిల్డ‌ర్ల‌కు అమ్మ‌కాలు లేకుండా పోతున్నాయి. ఈ సంస్థ చెబుతున్న‌ట్లు ఒక‌వేళ 52 అంతస్తుల నిర్మాణం ప్రారంభ‌మై.. స‌కాలంలో నిర్మాణం పూర్త‌యితే పెద్ద రికార్డు అవుతుందన‌డంలో ఎలాంటి సందేహం లేదు.

అంత‌స్తుల ప్రాజెక్టులో కొనేవారిని ఆక‌ట్టుకునేందుకు.. సాఫ్ట్ లాంచ్ పేరిట చ‌ద‌ర‌పు అడుక్కీ రూ. 5200కే ఫ్లాట్ల‌ను విక్ర‌యిస్తోంది. దాదాపు 4.75 ఎక‌రాల్లో 3 ట‌వ‌ర్ల‌ను నిర్మిస్తోంది. ఫ్లోరుకు రెండు నుంచి నాలుగు ఫ్లాట్లు, ప్ర‌తి ట‌వ‌రుకో క్ల‌బ్ హౌజ్ ఉంటుంద‌ట‌. అంద‌రికీ కలిపి ఒక క్ల‌బ్ హౌజ్ క‌డ‌తార‌ట‌. ఫ్లాట్ సైజులేమో 2700, 3600, 4500, 5400, 8000 చ‌ద‌ర‌పు అడుగులుగా నిర్ణ‌యించార‌ని తెలిసింది. ఇప్పుడు కొంటే చ‌ద‌ర‌పు అడుక్కీ రూ.5,200కే అమ్ముతారు. అనుమ‌తుల‌న్నీ వ‌చ్చాక కొంటే చ‌ద‌ర‌పు అడుగుకీ రూ. 7500+ చొప్పున విక్ర‌యిస్తార‌ట‌. అప్పుడైతే, 80 శాతం గృహ‌రుణం కూడా మంజూరు అవుతుంద‌ట‌.

52

5 అంత‌స్తుల అపార్టుమెంట్ అయినా 52 అంత‌స్తుల ప్రాజెక్టు అయినా.. ప్రీలాంచ్‌, సాఫ్ట్ లాంచ్ అంటూ కొనుగోలుదారుల నుంచి ముందే వంద శాతం సొమ్ము వ‌సూలు చేయ‌డం దారుణ‌మైన విష‌యం. ఢిల్లీ, నొయిడా, గుర్గావ్ వంటి ప్రాంతాల్లో పేరెన్నిక గ‌ల బిల్డ‌ర్లే ప్ర‌స్తుతం జైలులో ఊచ‌లు లెక్క‌పెడుతున్నారు. మ‌రి, అంత ద‌రిద్ర‌పు ప‌రిస్థితి మ‌న వ‌ద్ద రాకూడ‌దంటే.. ప్రీలాంచుల్ని అరిక‌ట్టాలి. లేక‌పోతే, మ‌న హైద‌రాబాద్ బ్రాండ్‌కు మ‌చ్చ వాటిల్లే ప్ర‌మాద‌ముంది.

This website uses cookies.