Categories: LATEST UPDATES

అక్రమ నిర్మాణాలపై ఉక్కుపాదం

రాష్ట్రంలోని నగరాలు, పట్టణాల్లో జరిగే భవన నిర్మాణరంగాన్ని సరళీకృతం చేయడానికి ప్రభుత్వం టి ఎస్ బి-పాస్ చట్టాన్ని అందుబాటులోకి తెచ్చింది. అదే విధంగా, రాష్ట్రంలోని అన్ని మునిసిపాలిటీలలో తెలంగాణ పురపాలక సంఘ చట్టం, 2019 లోని సెక్షన్ 178 (1) & (2) ల ప్రకారంగా నిబంధనలకు విరుద్ధంగా చేపట్టే అక్రమ నిర్మాణాలను గుర్తించి వాటిపై కఠినమైన చర్యలు తీసుకునేందుకు గాను అడీషనల్ కలెక్టర్ల ఆధర్యంలో డిస్ట్రిక్ట్ టాస్క్ ఫోర్స్ కమిటీలను ఏర్పాటు చేయడం జరిగినది.

రాష్ట్రంలోని (141) మునిసిపాలిటీలలో రెవెన్యూ, పోలీస్, ఫైర్, ఆర్ & బి ఇంజనీరింగ్ మరియు మున్సిపల్ అధికారులతో ఏర్పాటు చేయబడిన ఈ (141) డిస్ట్రిక్ట్ టాస్క్ ఫోర్స్ కమిటీలు దాదాపు (700) మంది సభ్యులతో పని చేస్తున్నాయి. రాష్ట్రంలోని అన్ని మునిసిపాలిటీలలో ఈ కమిటీలు ఏర్పాటు చేయబడినప్పటి నుండి అక్రమనిర్మాణాలను గుర్తించి కూల్చివేసే కార్యక్రమం నిర్విరామంగా జరుగుతుంది.

నేరుగా ఆఫీసులో, ఆన్లైన్ ద్వారా, టి ఎస్ బి-పాస్ పోర్టల్ లో, ట్విట్టర్ ద్వారా, మెయిల్ ల ద్వారా వచ్చే ఫిర్యాదులను 3 రోజులలో పరిశీలించి ఈ కమిటీ బృందాలు కూల్చివేతలు చేపడుతున్నారు. అంతే కాకుండా 15 రోజులకు ఒకసారి విస్తృతంగా పర్యటించి అక్రమ నిర్మాణాలను గుర్తించి కూల్చివేయుటకు తగు చర్యలు తీసుకుంటున్నారు.

ఎలాంటి ముందస్తు అనుమతి లేకుండా చేపట్టే భవనములను, పొందిన అనుమతికి విరుద్ధంగా నిబంధనలను అతిక్రమించి అదనముగా చేపట్టబడుతున్న కట్టడములను, చట్టపరమైన అధికారం లేకుండా పంచాయతీ అనుమతుల పేరుతో కొనసాగుతున్న అక్రమ నిర్మాణాలను, అక్రమంగా అభివృద్ధి చేయబడుతున్న లే-ఔట్లను విస్తృత పర్యవేక్షణల ద్వారా మరియు ఫిర్యాదుల ద్వారా గుర్తించి ఎప్పటికప్పుడు కూల్చివేసేందుకు ఈ కమిటీ బృందాలు చురుకుగా పనిచేస్తున్నాయి.

ఇప్పటి వరకు ఈ కమిటీల ఆధ్వర్యంలో రాష్ట్రంలోని వివిధ మునిసిపాలిటీలలో దాదాపు 459, హెచ్.ఎం.డి.ఏ. పరిధిలోని మునిసిపాలిటీలలో 468, మొత్తం 927 అక్రమనిర్మాణాలను గుర్తించి కూల్చి వేయడం జరిగినది.

This website uses cookies.