దేశవ్యాప్తంగా రియల్ రంగం జోరుగా సాగుతోంది. ఎనిమిది ప్రధాన నగరాల్లో గతేడాది అన్ని రకాల ఇళ్ల అమ్మకాలు 5 శాతం పెరిగాయి. 2023లో మొత్తం 3,29,907 యూనిట్లు అమ్ముడుపోయాయి. ఇది పదేళ్ల గరిష్ట స్థాయి కావడం గమనార్హం. మధ్య, ప్రీమియం విభాగంలో ఇళ్లకు డిమాండ్ బాగా ఉండటంతో అమ్మకాలు పెరిగాయి. అయితే, రూ.50 లక్షల్లోపు బడ్జెట్ ఇళ్ల అమ్మకాలు 16 శాతం తగ్గి, 97,983 యూనిట్లు మాత్రమే అమ్ముడయ్యాయి.
2022లో ఈ విభాగంలో అమ్మకాలు 1,17,131 యూనిట్లుగా ఉన్నాయి. రూ.50 లక్షల్లోపు ఇళ్ల సరఫరా (కొత్త వాటి నిర్మాణం) గతేడాది 20 శాతం తగ్గింది. ఇది కూడా విక్రయాలు తగ్గేందుకు ఒక కారణం. మొత్తం ఇళ్ల అమ్మకాల్లో అందుబాటు ధరల ఇళ్ల వాటా 37 శాతం నుంచి 30 శాతానికి పరిమితమైనట్టు నైట్‌ఫ్రాంక్ ఇండియా పేర్కొంది. రూ.కోటిపైన ఖరీదైన ఇళ్ల అమ్మకాలు 2022లో 27 శాతం పెరగ్గా, 2023లో 34 శాతం పెరిగినట్టు వెల్లడించింది.
నగరాలవారీగా పరిశీలిస్తే.. హైదరాబాద్‌లో ఇళ్ల అమ్మకాలు గతేడాది 6 శాతం పెరిగి 32,880 యూనిట్లుగా నమోదయ్యాయి. 2022లో 31,406 యూనిట్లు అమ్ముడయ్యాయి. ముంబైలో అందుబాటు ధరల ఇళ్ల అమ్మకాలు (రూ.50లక్షల్లోపు) 6 శాతం తగ్గి 39,093 యూనిట్లకు పరిమితమయ్యాయి. ఇక్కడ మొత్తం మీద ఇళ్ల అమ్మకాలు 2 శాతం పెరిగి 86,871 యూనిట్లకు చేరాయి. బెంగళూరులోనూ అందుబాటు ధరల ఇళ్లు 46 శాతం క్షీణించి 8,141 యూనిట్లకు పరిమితమయ్యాయి.
అన్ని విభాగాల్లోనూ ఇళ్ల అమ్మకాలు ఒక శాతం పెరిగి 54,046 యూనిట్లుగా ఉన్నాయి. ఢిల్లీలో ఇళ్ల అమ్మకాలు 3 శాతం పెరిగి 60,002 యూనిట్లుగా ఉన్నాయి. ఇక్కడ అందుబాటు ధరల ఇళ్ల విక్రయాలు 44 శాతం తగ్గాయి. 7,487 యూనిట్లు అమ్ముడయ్యాయి. పుణెలో 13 శాతం వృద్ధితో 49,266 యూనిట్లకు చేరాయి. చెన్నైలో 5 శాతం అధికంగా 14,920 ఇళ్లు అమ్ముడయ్యాయి. కోల్‌కతాలో 16 శాతం అధికంగా 14,999 ఇళ్ల యూనిట్ల విక్రయాలు జరిగాయి.
దేశవ్యాప్తంగా ఏడు నగరాల్లో ఈ ఏడాది సగటున ఇళ్ల ధరలు 10-24 శాతం మధ్య పెరిగినట్టు అనరాక్ నివేదిక వెల్లడించింది. నిర్మాణంలోకి వినియోగించే మెటీరియల్స్ ధరలు పెరగడంతోపాటు, డిమాండ్ అధికంగా ఉండడం ధరల వృద్ధికి కారణంగా ఉంది. ఏడు పట్టణాల్లో కొత్త ఇళ్ల నిర్మాణం (సరఫరా) క్రితం ఏడాదితో పోలిస్తే 25 శాతం పెరిగి 4,45,770 యూనిట్లుగా ఉన్నట్టు పేర్కొంది.
This website uses cookies.