2023లో 32 శాతం పెరుగుదల
నైట్‌ఫ్రాంక్ ఇండియా నివేదిక వెల్లడి
హైదరాబాద్ లో ఆఫీస్ స్పేస్ కు డిమాండ్ బాగా పెరిగింది. గతేడాది 32 శాతం పెరిగి 8.8 మిలియన్ చదరపు అడుగులుగా నమోదైంది. దేశవ్యాప్తంగా ఎనిమిది ప్రధాన నగరాల్లోనూ ఆఫీస్ స్పేస్ లీజు గతేడాది 15 శాతం వృద్ధి చెంది 59.6 మిలియన్ చదరపు అడుగులకు చేరినట్టు ప్రముఖ రియల్ ఎస్టేట్ కన్సల్టెంట్ సంస్థ నైట్ ఫ్రాంక్ ఇండియా వెల్లడించింది. ఆఫీస్ స్పేస్ లీజులో గ్లోబల్ క్యాపబులిటీ సెంటర్స్ (జీసీసీలు) ముఖ్య పాత్ర పోషించినట్టు తెలిపింది. వీటి లీజు పరిమాణం 20.8 మిలియన్ చదరపు అడుగులుగా నమోదైంది. 2022తో పోలిస్తే ఇది 58 శాతం అధికం. 2019లో ఆఫీస్ స్పేస్ లీజు 60.6 మిలియన్ చదరపు అడుగుల తర్వాత..
ఇదే అత్యధికమని నైట్ ఫ్రాంక్ ఇండియా తెలిపింది. పట్టణాలవారీగా చూస్తే.. ముంబైలో ఆఫీస్ స్పేస్ లీజు 2023లో 16 శాతం పెరిగి 7.4 మిలియన్ చదరపు అడుగులుగా నమోదైంది. ఢిల్లీలో 14 శాతం పెరుగుదలతో 10.1 మిలియన్ చదరపు అడుగులకు చేరింది. పుణెలో 9 శాతం వృద్ధితో 6.7 మిలియన్ చదరపు అడుగులుగా నమోదైంది. చెన్నైలో ఏకంగా 92 శాతం పెరిగి, 10.8 మిలియన్ చదరపు అడుగులకు చేరింది. కోల్‌కతాలో 20 శాతం వృద్ధితో 1.4 మిలియన్ చదరపు అడగులకు పెరిగింది. బెంగళూరు మార్కెట్లో ఆఫీస్ స్పేస్ లీజు 14 శాతం తగ్గి 12.5 మిలియన్ చదరపు అడుగులకు పరిమితమైంది. అహ్మదాబాద్‌లోనూ 15 శాతం తగ్గి 1.8 మిలియన్ చదరపు అడుగులుగా నమోదైంది.
This website uses cookies.