Categories: LEGAL

నాలుగు ఎస్టీపీల నిర్మాణానికి రూ.82 కోట్లు

  • జంట జలాశయాల్లో కాలుష్య నివారణకు చర్యలు

హైదరాబాద్ నగరానికి ప్రధాన తాగునీటి వనరుగా ఉన్న ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ జలాశయాల్లో కాలుష్య నివారణకు సర్కారు చర్యలు ప్రారంభించింది. ఈ జలాశయాల పరిరక్షణ కోసం గతంలో ఉన్న ట్రిపుల్ వన్ జీవోను ప్రభుత్వం ఎత్తివేసిన సంగతి తెలిసిందే. అప్పట్లో ఈ జంట జలాశయాల ఎఫ్ టీఎల్ పరిధి నుంచి 10 కిలోమీటర్ల మేర నిర్మాణపరమైన ఆంక్షలు ఉండేవి.

కానీ ఇటీవల ప్రభుత్వం ఆ జీవోను ఎత్తివేసింది. ట్రిపుల్ వన్ జీవో జారీ చేసిన సమయంలో ఈ రిజర్వాయర్లు 27.59 శాతం తాగునీటి సరఫరా సామర్థ్యం కలిగి ఉండేవని.. కానీ ప్రస్తుతం 1.25 శాతం కంటే తక్కువగానే వీటిపై ఆధారపడుతున్నందున హైదరాబాద్ కు ఇవి ప్రధాన తాగునీటి వనరు కావని సర్కారు పేర్కొంది. ఈ నేపథ్యంలో ట్రిపుల్ వన్ జీవో ఎత్తివేసింది. ఈ క్రమంలో ఈ రిజర్వాయర్లు కాలుష్యం బారిన పడకుండా చర్యలు చేపట్టింది. ఇందుకోసం వివిధ ప్రాంతాల్లో మురుగునీటి శుద్ధి ప్లాంట్లు (ఎస్టీపీ) ఏర్పాటు చేయడంతోపాటు శుద్ధి చేసిన నీటిని ఈ రెండు జలాశయాల్లోకి వెళ్లనివ్వకుండా మళ్లింపు మార్గాలను నిర్మించనుంది. ఈ నేపథ్యంలో నాలుగు ఎస్టీపీల నిర్మాణం, ఇతరత్రా పనుల కోసం రూ.82.23 కోట్లు మంజూరు చేసింది. వీటి నిర్మాణ బాధ్యతను హైదరాబాద్ మెట్రొపాలిటన్ వాటర్ సప్లై అండ్ సీవరేజ్ బోర్డుకు అప్పగించారు.

This website uses cookies.