సొంతిల్లు అనేది సామాన్యుడి కల. ఎవరైనా సరే తమకంటూ ఓ ఇల్లు సొంతంగా ఏదో ఒక చిన్న గూడు ఉంటే చాలని భావిస్తారు. అయితే, కరోనా పరిస్థితుల తర్వాత ఈ ఒరవడిలో కాస్త మార్పు వచ్చింది.
ఆరోగ్య అంశాలు, జీవన ప్రమాణాల పరంగా చాలా మంది అన్ని సౌకర్యాలూ కలిగిన ఇల్లు కావాలని కోరుకుంటున్నారు. ఇందుకోసం తాము ఉంటున్న ఇంటిని వదిలి కొత్త ఇంటికి మారాలని అనుకుంటున్నారు. ఫలితంగా దేశంలో కొత్త ఇళ్లకు మరింత డిమాండ్ పెరుగుతోంది. ఈ నేపథ్యంలో 2036 నాటికి దేశంలో 6.4 కోట్ల కొత్త ఇళ్ల అవసరం ఉంటుందని క్రెడాయ్-లియోసెస్ ఫోరాస్ నివేదిక పేర్కొంది. అలాగే ప్రస్తుత జనాభా అవసరాలతో పోలిస్తే 2.9 కోట్ల ఇళ్ల కొరత ఉంది. దీంతో 2036 నాటికి మొత్తం 9.3 కోట్ల ఇళ్లు కావాలని స్పష్టంచేసింది. అలాగే ప్రధాన నగరాలతోపాటు ద్వితీయ, తృతీయ శ్రేణి ప్రాంతాల్లో కూడా రియల్ రంగం మరింతగా వృద్ధి చెందుతుందని పేర్కొంది. గతేడాది ఇళ్లకు అధిక డిమాండ్ ఏర్పడిందని..
వేగంగా జనాభా పెరుగుతుండటమే ఇందుకు కారణమని తెలిపింది. అలాగే ప్రజల కొనుగోలు శక్తి పెరగడం, సౌకర్యాల విషయంలో రాజీపడకుండా ఉండటం వల్ల పెద్ద ఇళ్లకు డిమాండ్ పెరుగుతోందని విశ్లేషించింది.